Tuesday, April 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయూఎస్‌ సుంకాల రీఫండ్‌ ప్రక్రియ షురూ

యూఎస్‌ సుంకాల రీఫండ్‌ ప్రక్రియ షురూ

- Advertisement -

సుప్రీంకోర్టు అక్షింతలతో చెల్లింపులు
వాషింగ్టన్‌ :
అమెరికాలో ట్రంప్‌ ప్రభుత్వం గతంలో విధించిన వివాదాస్పద సుంకాల విషయంలో దిగుమతిదారులకు భారీ ఊరట లభించింది. ఈ సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని యూఎస్‌ సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించే (రీఫండ్‌) ప్రక్రియను అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ (సీబీపీ) అధికారికంగా ప్రారంభించింది. 1977 నాటి అత్యవసర అధికారాల చట్టాన్ని అడ్డం పెట్టుకుని ట్రంప్‌ ప్రభుత్వం వివిధ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాలు విధించింది. అయితే పన్నులు విధించే సర్వాధికారాలు కేవలం యూఎస్‌ కాంగ్రెస్‌కే ఉంటాయని.. అధ్యక్షుడికి కాదని పేర్కొంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో కీలక తీర్పునిచ్చింది. ఈ సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చడమే కాకుండా ఇప్పటివరకు వసూలు చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా రీఫండ్‌ చేయాలని ఆదేశించింది.

రీఫండ్‌ ప్రక్రియ ఇలా..
దిగుమతిదారులు, బ్రోకర్ల సౌకర్యార్థం సీబీపీ ప్రత్యేక ఆన్‌లైన్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో క్లెయిమ్‌లను దాఖలు చేయవచ్చు. ట్రంప్‌ ఉత్తర్వుల తర్వాత సుమారు 3.30 లక్షల మంది దిగుమతిదారులు 166 బిలియన్‌ డాలర్లను సుంకాల రూపంలో చెల్లించారు. ప్రస్తుతం మొదటి విడతలో రిజిస్టర్‌ చేసుకున్న 56,497 మందికి వడ్డీతో కలిపి సుమారు 127 బిలియన్‌ డాలర్లను తిరిగి ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. క్లెయిమ్‌ ఆమోదం పొందిన 60 నుంచి 90 రోజుల్లోగా నగదు దిగుమతిదారుల ఖాతాల్లోకి చేరుతుంది. అయితే చివరకు చెల్లించిన వారికి ముందుగా రీఫండ్‌ అందే అవకాశం ఉండటం విశేషం.
వినియోగదారులకు లబ్ది చేకూరేనా..?
దిగుమతిదారులు న్యాయపరంగా తాము పొందే రీఫండ్‌ మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేయాల్సిన నిబంధన ఏమీ లేదు. అంటే ఈ 127 బిలియన్‌ డాలర్ల సొమ్ము నేరుగా ఆయా వ్యాపార సంస్థల లాభాల ఖాతాలోకి వెళ్లనుంది. అయితే.. ఫెడ్‌ఎక్స్‌ వంటి కొన్ని దిగ్గజ సంస్థలు మాత్రం ఈ ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు బదిలీ చేస్తామని ప్రకటించడం విశేషం. ట్రంప్‌ తప్పుడు చర్యతో పాటు.. ఈ రీఫండ్‌ ప్రక్రియ అమెరికా వాణిజ్య చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక పరిణామంగా నిలవనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -