నవతెలంగాణ-హైదరాబాద్: రెండో దఫా చర్చల వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ముగింపు కోసం పాకిస్తాన్లో జరగనున్న రెండో దఫా చర్చలకు హాజరు కాలేమని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా వైఖరే ఇందుకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది.అమెరికా మితిమీరిన డిమాండ్లు, ఆ దేశ వైఖరిలో నిరంతర మార్పులు, హార్మూజ్ జలసంధిలో తమ ఓడరేవులపై కొనసాగుతున్న అమెరికా నావికా దిగ్బంధనాన్ని కాల్పుల విరమణ ఉల్లంఘనగా పరిగణిస్తూ రెండో దఫా చర్చలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపింది.
2026, ఏప్రిల్ 22వ తేదీ వరకు ఇరాన్-అమెరికా మధ్య తాత్కాలిక కాల్పుల విమరణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. దాదాపు 7 వారాలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఏప్రిల్ 10న అమెరికా ఇరాన్ చర్చలు జరిపాయి. కానీ ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అసంపూర్తి ఈ చర్చలు ముగిశాయి. దీంతో ఏప్రిల్ 20న మరోసారి భేటీ అయ్యి చర్చలు జరపాలని నిర్ణయించాయి. కానీ అమెరికా తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న ఇరాన్ రెండో దఫా చర్చలకు రాలేమని కరాకండిగా చెప్పేసింది.



