నవతెలంగాణ – హైదరాబద్: ప్రముఖ శాంతి ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. చెన్నైలో తాను నిర్వహించనున్న గ్లోబల్ పీస్ ఫెస్టివల్‌కు హాజరుకాకపోతే, రాబోయే ఎన్నికల్లో స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. గతంలో దివంగత సీఎం జయలలితకు ఇదే అనుభవం ఎదురైందని ఆయన గుర్తుచేశారు. ఇది రాజకీయ సభ కాదని, వేలాది మంది యువత పాల్గొనే ప్రపంచ శాంతి సభ అని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో ఇది ప్రసారం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం కొంత సమయాన్నిచ్చి, శాంతికి సంఘీభావం తెలపాలని కోరారు.
అనంతరం పాల్ గతాన్ని గుర్తుచేస్తూ, “2002లో జయలలిత నా శాంతి సభకు హాజరుకాలేదు. దీంతో ఆమెను ఓడించాలని నా అనుచరులకు పిలుపునిచ్చాను. ఫలితంగా 2004 ఎన్నికల్లో ఆమె పార్టీ 38 ఎంపీ స్థానాల్లో ఓడిపోయింది. ఆ తర్వాత జయలలిత నన్ను ఆహ్వానించి మద్దతు కోరగా, 2014లో ఆమె గెలిచారు. ఇప్పుడు స్టాలిన్ కూడా ఈ శాంతి సభను తిరస్కరిస్తే, మే 2026 ఎన్నికల తర్వాత ఆయన కూడా మాజీ సీఎం అవుతారు” అని హెచ్చరించారు. శాంతిని, ప్రజలను గౌరవించడం ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పాల్ వ్యాఖ్యానించారు.



