నవతెలంగాణ – ఆర్మూర్
తాను బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి మారుతున్నానని కొన్ని వార్తా సంస్థల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా నిరాధారమని
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. తాను జీవితంలో ఎప్పుడూ
బీఆర్ఎస్ ను వీడను, బీజేపీతో సహా మరే పార్టీలో చేరను అని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒక పథకం ప్రకారం సాగిస్తున్న కుట్రలో భాగమే తనపై ఈ దుష్ప్రచారం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకూ కేసీఆర్ బాట వీడనని, చివరి వరకు గులాబీ నీడలోనే రాజకీయాలు చేస్తానని ఆయన అన్నారు. తాను రాజకీయ ఓనమాలు దిద్దుకున్న పార్టీ బీఆర్ఎస్ అని, తన రాజకీయ గురువు, ఆరాధ్య దైవం కేసీఆర్ అని జీవన్ రెడ్డి తెలిపారు. తాను బీజేపీలో చేరడానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీని ఢిల్లీలో కలిసినట్టు కట్టు కథలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిజానికి తాను ఏ కేంద్ర మంత్రిని కలవలేదని, తాను హైదరాబాద్ లోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ఫేక్ ప్రచారాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని జీవన్ రెడ్డి హెచ్చరించారు.



