Saturday, February 21, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంటారిఫ్‌లు రద్దు

టారిఫ్‌లు రద్దు

- Advertisement -

సుంకాలు చట్టవిరుద్ధం
ట్రంప్‌నకు అమెరికా సుప్రీంకోర్టు గట్టి షాక్‌
6-3 మెజారిటీతో న్యాయస్థానం తీర్పు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావం

ప్రపంచ దేశాలపై టారిఫ్‌లతో వాణిజ్య యుద్ధానికి దిగిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఆయనకు అమెరికా సుప్రీంకోర్టు షాకిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా విధించిన భారీ టారిఫ్‌లను న్యాయస్థానం శుక్రవారం రద్దు చేసింది. అత్యవసర పరిస్థితుల కోసం రూపొందించిన 1977 నాటి అంతర్జా తీయ అత్యవసర ఆర్థిక శక్తుల చట్టం (ఐఈఈపీఏ) చట్టాన్ని ఉపయోగించి విధించిన ఈ టారిఫ్‌లను న్యాయస్థానం తప్పుబట్టింది.

6-3 మెజారిటీతో ఈ తీర్పునిచ్చింది. దిగుమతి పన్నులు విధించడం అధ్యక్షుడి అధికార పరిధిని మించిందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఇప్పటికే దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును చీఫ్‌ జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్‌ సమర్థించింది. అధ్యక్షుడు అసాధారణ అధికారాన్ని వినియోగించాలంటే.. కాంగ్రెస్‌ స్పష్టమైన అనుమతి చూపాలని వివరించింది.

వాషింగ్టన్‌ : ట్రంప్‌ పాలనలో ఐఈఈపీఏ చట్టాన్ని ఆధారంగా చేసుకొని ప్రధాన వాణిజ్య భాగస్వాములపై భారీ టారిఫ్‌లను అమెరికా విధించింది. ఈ చట్టం సాధారణంగా ఆంక్షల కోసం ఉపయోగిస్తుండగా.. డోనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం తొలిసారిగా దీనిని టారిఫ్‌ల కోసం వినియోగించారు. ఈ టారిఫ్‌ల కారణంగా ప్రభావితమైన వ్యాపారసంస్థలు, డెమోక్రటిక్‌ పార్టీ పాలిత 12 రాష్ట్రాలు కలిసి ఈ కేసును దాఖలు చేశాయి. అధ్యక్షుడు ట్రంప్‌ తన రెండో పదవీకాలంలో ప్రారంభించిన గ్లోబల్‌ ట్రేడ్‌వార్‌లో టారిఫ్‌లు ప్రధాన ఆయుధంగా మారాయి. భారత్‌ కూడా ఈ టారిఫ్‌ల బారిన పడింది. అమెరికా ఒత్తిడితో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయాల్సిన పరిస్థితి భారత్‌కు ఏర్పడింది. ట్రంప్‌ విధించిన సుంకాలకు భయపడి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమెరికా డిమాండ్లు, ప్రతిపాదనలకు తలొగ్గిందని ఇప్పటికే భారత్‌లోని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎఫెక్ట్‌
అయితే అమెరికా సుప్రీంకోర్టు నిర్ణయం అమెరికా వాణిజ్య విధానాలపై మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా గణనీయమైన ప్రభావం పడే అవకాశాలున్నాయని వాణిజ్య నిపుణులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్‌ టారిఫ్‌ చర్యలతో 175 బిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయం వచ్చినట్టు ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే కోర్టు తీర్పు నేపథ్యంలో ట్రంప్‌ యంత్రాంగం ఆ మొత్తంలో పెద్ద భాగాన్ని తిరిగి చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉంది. అమెరికా ట్రెజరీ డేటా ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్‌ డ్యూటీల ద్వారా 195 బిలియన్‌ డాలర్ల రికార్డు వసూళ్లు నమోదయ్యాయి. ట్రంప్‌ తీసుకున్న చర్యలతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో అమెరికాకు ఉన్న వాణిజ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. టారిఫ్‌లను ఆయుధంగా వాడి.. పలు దేశాలపై ఆధిపత్యం చలాయించే చర్యలకు ట్రంప్‌ దిగారు. మరోపక్క ఆర్థిక మార్కెట్లు అస్థిరతకు గురయ్యాయి. కాగా ఈ తీర్పు ద్వారా అధ్యక్షుడి అధికారాల పరిమితులపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చినట్టుగా న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత్‌పై ప్రభావం
ట్రంప్‌ ప్రకటించిన టారిఫ్‌ల ప్రభావానికి గురైన దేశాల్లో భారత్‌ కూడా ఒకటి. అమెరికా-భారత్‌ ద్వైపాక్షిక వాణిజ్యం ఏడాదికి 190 బిలియన్‌ డాలర్లకు పైగా ఉంది. భారత్‌.. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు, మెడికల్‌ పరికరాలు, మోటార్‌ సైకిళ్లపై అధిక సుంకాలు విధిస్తోందని విమర్శించారు. అలాగే ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో రష్యా చమురు కొనుగోళ్లను కూడా ఆయన ప్రస్తావిం చారు. దానిని ఆపేయాలంటూ పలుమార్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత ఔషధ, టెక్స్‌టైల్‌, ఐటీ రంగాల ఎగుమతిదారులు ఆందోళనకు గురయ్యారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ.. వాణిజ్య ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గేలా కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

‘ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తాం’
తాజా తీర్పు పరిస్థితుల నేపథ్యంలో అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెస్సెంట్‌ స్పందించారు. సుంకాల కోసం ప్రత్యామ్నాయ చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని సంకేతాలు ఇచ్చారు. అయితే ఐఈఈపీఏ ఇచ్చినంత విస్తృత స్వేచ్ఛ ఇతర చట్టాల్లో లేదని నిపుణులు చెప్తున్నారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో అధ్యక్ష అధికారాల పరిమితులపై స్పష్టత వచ్చినప్పటికీ.. అమెరికా-ప్రపంచ వాణిజ్య సంబంధాలు ఇంకా అనిశ్చితిలోనే ఉన్నాయని వివరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -