ఓ వ్యవస్థాపకురాలు, ఓ రచయిత్రి, ఓ అథ్లెట్, ఓ స్టాండ్-అప్ కామిక్, ఓ తల్లి.. ఇలా తన జీవితాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకున్నారు. భిన్న రంగాలలో తన సత్తా చాటుకుంటున్నారు. తాను చేయాల్సిన ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. మహిళగా వివక్షను అనుభవించారు. తన లక్ష్యాలను చేరే మార్గంలో ఎదురవుతున్న సవాళ్లను ధైర్యంగా ఎదిరిస్తూ ముందుకు వెళుతున్నారు. ఆమే అను వైద్యనాద్. భిన్న రంగాల కళాకారిణిగా నేటి మహిళల్లో స్ఫూర్తి నింపుతున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
ఢిల్లీలో పుట్టి బెంగళూరులో పెరిగిన అను వైద్యనాద్ ప్రాంతాలు, భాషలు, సంప్రదాయాలకు అతీతంగా ఉండే కుటుంబంలో పెరిగారు. దేశవ్యాప్తంగా బంధువులు ఉండటంతో విభిన్న జీవన విధానాలు, ఆలోచనలు ఆమెను ప్రభావితం చేశాయి. ‘వివిధ ప్రదేశాలు, ప్రజలు, సంస్కృతుల మధ్య పెరగడం వల్ల ఎన్నో నేర్చుకోగలిగాను. నా జీవితం ఒక ప్యాచ్‌వర్క్ క్విల్ట్ లాగా అనిపించింది. బెంగళూరు ఒక అద్భుతమైన నగరం. ఇక్కడ గడపడం నాకు దొరికిన చక్కని అవకాశం’ అంటూ ఆమె ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో పంచుకున్నారు.
అక్కడ అమ్మాయిలు పెద్దగా లేరు
అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ చేసేటపుడు తరగతిలోని ఐదుగురు మహిళలలో ఆమె ఒకరు. ‘బెంగళూరులో అమ్మాయిలందరం కలిసి పోటీ పడేవాళ్లం. భిన్న కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నించాము. నేను పర్డ్యూలోకి అడుగుపెట్టినప్పుడు అక్కడ మహిళలు పెద్దగా లేరు. ఇది నేనసలు ఊహించలేదు. నేను ఎప్పుడూ ఓ తరగతిలో ఉండేదాన్ని అంతే, అంతకు మించి గుర్తుంచుకోదగిన విషయాలు అక్కడ నాకు ఏమీ లేవు’ అంటారు ఆమె.
మానసిక బలం కోసం క్రీడల వైపుకు
ఇంజనీరింగ్ చదువు తర్వాత దానికే పరిమితమైన అను క్రీడ వైపు మళ్లి, మరింత ఉత్సాహం పొందడానికి పరుగు, ఈత కొట్టడం ప్రారంభించారు. అదే సమయంలో ఆమె తన పిహెచ్‌డి ప్రోగ్రామ్ నుండి తప్పుకుని, తన మేధో సంపత్తితో కన్సల్టింగ్ సంస్థ ప్యాట్‌ఎన్‌మార్క్స్‌ను ప్రారంభించారు. తర్వాత తన పిహెచ్‌డి పూర్తి చేయడానికి న్యూజిలాండ్‌కు వెళ్లారు. తన మానసిక బలాన్ని పొందడానికి క్రీడలోకి ప్రవేశించినప్పటికీ అది ఆమెలోని ఎన్నో అడ్డంకులు అధిగమించేందుకు సహాయపడింది. నూతన శిఖరాలను అధిరోహించగలిగింది. 2009లో అల్ట్రామాన్, 10 కి.మీ ఈత, 420 కి.మీ బైక్ రైడ్, 84.4 కి.మీ పరుగును జయించిన మొదటి ఆసియా ట్రయాథ్లెట్ అయ్యారు. అల్ట్రామాన్ కెనడాలో ఆరవ స్థానాన్ని పొందారు.
కామెడీకి మార్గం
తర్వాత కాలంలో ఆమె సృజనాత్మక రచనలకు, సినిమాలు, స్టాండ్-అప్ కామెడీకి మారడం చాలా సులభంగా జరిగిందని అను అంటున్నారు. ఆమె ఏఐలోని మౌంట్ హోలీయోక్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బోధించింది. గ్రాంట్ ప్రతిపాదనలు రాశారు, ట్రయాథ్లెట్లకు శిక్షణ ఇచ్చారు. కళాకారిణిగా మారడానికి అవసరమైన నైపుణ్యాలను నెమ్మదిగా నేర్చుకున్నారు. ఆమె కామెడీ స్క్రిప్ట్ కూడా ఓ సరళమైన ప్రణాళికతో ప్రారంభమైంది. హాస్య నటులను ఎలా దర్శకత్వం వహించాలో నేర్చుకోవాలనే ఆసక్తితో ఆమె ప్రఖ్యాత ఫ్రెంచ్ విదూషకుడి పాఠశాల ఎకోల్ ఫిలిప్ గౌలియర్‌లో చేరారు.
ఓ మహిళగా…
2022లో మహమ్మారి నుండి బయటపడుతూనే ఆమె తన తొలి షో బిఫోర్ చిల్డ్రన్, ఆఫ్టర్ డైపర్స్‌ను ఎడిన్‌బర్గ్ ఫ్రింజ్ ఫెస్టివల్‌కు తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో ఎడిన్‌బర్గ్ ఫ్రింజ్ అంటే ఏమిటో ఆమెకు పెద్దగా తెలియదు. చెన్నైలో తమిళ హాస్యనటుడు ఎస్వీ శేఖర్ ప్రదర్శన చూసిన తన 16 ఏండ్ల వయసు నుండి ఈమె ఈ క్షణానికై ఎదురు చూస్తూనే ఉంది. ఆమె తన ప్రదర్శన ప్రారంభించిన నాల్గవ వారం నాటికి రోజుకు 60 సీట్ల అమ్ముడుపోయేవి. ఆమె ఊహించని విధంగా ప్రచారం జరిగింది. ఇన్ని విజయాలు సాధించిన ఆమె ‘ఒక మహిళగా ఉండటం ఓ బాధాకరమైన అనుభవం. ప్రపంచవ్యాప్తంగానూ అనేక రకాలుగా వివక్ష ఎదుర్కొన్నాను’ అంటారు ఆమె.
అంతర్జాతీయ పర్యటనా
ఫ్రింజ్ తర్వాత ఈ ప్రదర్శన కోసం అంతర్జాతీయంగా పర్యటించారు. ఆమె తాజా రచన అల్లెగోరీ అనే స్టాండ్-అప్ షో. ప్రస్తుతం ఆమె ‘మనం మనుగడ కోసం చెప్పే కథలు’ అని పిలిచే వాటి కోసం అన్వేషిస్తున్నారు. విభజనకు ముందు భారతదేశం నుండి వచ్చిన ఆమె అత్తగారు ఈ రచనలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. ‘ఆమె ఒక గణిత శాస్త్రజ్ఞురాలు, నేను ఇప్పటివరకు కలిసిన అత్యంత తెలివైన వ్యక్తులలో ఆమె ఒకరు. అయితే ఆమె ఎల్లప్పుడూ సాంప్రదాయ జీవితాన్నే గడపాల్సి వచ్చింది. ఈ సమాజం ఆమెను ఎగరనివ్వలేదు’ అన్నారు.
కేంబ్రిడ్జ్‌లో ప్రివ్యూలతో
అను గత ఆగస్టులో ఫ్రింజ్‌లో అల్లెగోరీని ప్రదర్శించారు. అల్లెగోరీ ఈ నెలలో కేంబ్రిడ్జ్‌లో ప్రివ్యూలతో పర్యటనను ప్రారంభిస్తుంది. అదే నగరంలో టేపింగ్‌తో ముగుస్తుంది. ఆమె ఫిక్షన్ స్క్రిప్ట్‌లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఒకటి సన్‌డాన్స్ ఫీచర్ ల్యాబ్స్‌లో క్యూరేట్ చేయబడింది. మరొకటి హుబర్ట్ బాల్స్‌లో చివరి రౌండ్‌కు చేరుకుంది. ఆమె థియేట్రికల్ అవర్, మెనగరీ, ది స్కాట్స్‌మన్‌దీలో విమర్శకుల దృష్టిని ఆకర్షించింది. తర్వాత డిస్పాచ్ అనే చిత్రంగా పరిణామం చెందింది. ఈ ప్రాజెక్ట్ నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి జరిగిన 2025 నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రొడ్యూసర్స్ వర్క్‌షాప్‌కు ఎంపికయింది. డిస్పాచ్ ఈ ఏడాదిలో విడుదలవుతుంది. ఇలా ఆమె తన జీవితంలో పూర్తి చేయడానికి ఎన్నో లక్షాలు పెట్టుకున్నారు. నేటి మహిళల్లో స్ఫూర్తినింపుతున్నారు.



