Friday, April 24, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిదేశ నాయకుల విద్వేష ప్రసంగాలపై ఒక సర్వే

దేశ నాయకుల విద్వేష ప్రసంగాలపై ఒక సర్వే

- Advertisement -

విద్య, ఆరోగ్యం, ఉపాధి లాంటి విషయాలు ఈ ప్రభుత్వ హయాంలో అటకెక్కాయి. ద్వేషం సర్వోన్నతంగా పెంచి పోషించ బడుతూ ఉంది. అజ్మీరు దర్గా కింద శివాలయం ఉందన్న కారణంతో ప్రభుత్వం సర్వేలు చేయిస్తోంది. ప్రభుత్వం చేసే పిచ్చిపనులకు న్యాయస్థానాలు కూడా వంతపాడు తూ ఉండడం వల్ల, దేశం ప్రమాదస్థితికి చేరింది.
-ఎస్‌.ఇర్ఫాన్‌ హబీబ్‌, ప్రసిద్ధ చరిత్రకారుడు.

దేశంలో విద్వేష ప్రచారం ఎలా ప్రారంభమై ందో, అది ఒక విధానంగా ఎలా స్థిరపడిందో, క్రమక్రమంగా అది ఎలా ప్రకోపిస్తూ వచ్చిందో అర్థం చేసుకోవాలంటే, కొంచెం వెనక్కివెళ్లి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. 1.స్వాతంత్య్రా నంతరం యాభై రెండేళ్లు ఆరెస్సెస్‌ మన జాతీయజెండాను గుర్తించలేదు, వారి కార్యాలయంలో ఎగరేయలేదు. 2.వారు ఇప్పుడు దేశవాసులకు దేశభక్తి గురించి ప్రభోదిస్తున్నారు. 3.వాళ్ల నాయకులు బ్రిటీషువారి కాళ్లమీద పడి, క్షమాపణలు చెప్పి బతికారు. 4.జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేయిం చారు.5. గాంధీని మరిపించి, ఆయన స్థానంలో సావర్కర్‌ను జాతి పితగా నిలబెట్టాలని ప్రస్తుతం వారు ఆశ పడుతు న్నారు. 6.మన రాజ్యాంగాన్ని పక్కన పెట్టించి, దాని స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలని ప్రస్తుతం వారు ఆశపడుతున్నారు. 7.పాకిస్థాన్‌ ముస్లింల దేశమైనట్లు, దీన్ని హిందువుల దేశంగా అంటే-‘హిందూ రాష్ట్ర’గా మార్చాలని ప్రస్తుతం వారు ఆశ పడుతున్నారు. 8.చరిత్ర గ్రంథాలు మార్చి, వారికి అనువైన చరిత్రను స్థిరపరచాలని ప్రస్తుతం వారు ఆశపడుతున్నారు.

గత పన్నెండేళ్లుగా సామాన్యుడి బతుకు భారమైపో యింది. విద్యాసంస్థలు భ్రష్టుపట్టాయి. మీడియా సంస్థలు ప్రభుత్వానికి అమ్ముడు పోయాయి. న్యాయవ్యవస్థ అధికా రానికి భజన చేస్తూ ఉంది. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్‌ కమిషన్‌, ఈడి, సిబిఐ, వంటివన్నీ దేశ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నాయి. అందుకే ఎ.పి.సి.ఆర్‌ వంటి సంస్థ రూపుదిద్దుకుంది. దానిస్థాయిలో అది కృషిచేస్తూ ఉంది. నిజాలు, నిజాయితీ జీవితంలో తప్పనిసరి అని అనుకున్న దేశపౌరులంతా ఎపిసిఆర్‌కు మద్దతు తెలుపుతున్నారు. ఇంతకూ ఏమిటీ ఎపిసిఆర్‌? అదేం చేస్తుంది? ASSOCIATION FOR PROTECTION OF CIVIL RIGHTS (APCR) న్యూఢిల్లీలోని జిల్లా ప్రాంతంలో 2006లో ప్రారంభమైంది. ఇది ఒక ఎన్‌.జి.ఓ. Non profit & Governa-mental organization.. ఇది లాయర్లు, సామాజిక కార్యకర్తలు, పారా లీగల్‌ వాలంటీర్లతో రూపొందిన సంస్థ. చట్టపరమైన అవగాహనను, విద్యను వ్యాప్తిచేస్తుంది. చట్టపరమైన న్యాయ సలహాలు, సూచనలు ఉచితంగా అందిస్తూ, దేశ పౌరులకు అండగా ఉంటుంది. ప్రజాస్వామ్యంపై చర్చలు, సెమినార్లు నిర్వహిస్తుం టుంది. ఒక రకంగా చట్టానికీ,న్యాయానికీ మధ్య వారధిలా పనిచేస్తుంది. మధ్యమధ్యలో క్రైమ్‌ రిపోర్టులు విడుదల చేస్తుంది.

నరేంద్ర మోడీ మూడవసారి ప్రధాని అయ్యాక, తొలి సంవత్సరంలోనే దేశంలో ఎన్ని విద్వేష నేరాలు జరిగాయో ఈ సంస్థ సర్వే నిర్వహించి, 2025లో ప్రకటించింది. ఆ సర్వే నివేదికను ‘హేట్‌ క్రైమ్‌ రిపోర్ట్‌’ అని అంది. దాని ప్రకారం ఒక్క 2025లోనే 937 విద్వేష నేరాలు జరిగాయి. అందులో స్వయంగా దేశ ప్రధాని 110 ప్రసంగాలలో ఇస్లామోఫోబియా వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు 63 విద్వేష ప్రసంగాలు చేశారు. ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులు 71 ప్రసంగాలు చేశారు. వీరంతా మైనార్టీలపై విద్వేషం చిమ్మారు. విద్వేష ప్రసంగాలు మొత్తం 345గా లెక్కతేలింది. సంవత్సరానికి 365 రోజులయితే అందులో విద్వేష ప్రసంగాలు 345. ఇవిగాక, మైనార్టీలపై దాడులు, నేరాలూ అదనం. ఆ సంవత్సరం మైనార్టీలపై 173 భౌతికదాడులు జరిగాయి. అందులో 25మంది ముస్లింలు ప్రాణాలు పొగొట్టుకున్నారు. 602 ద్వేషపూరిత ఇతరనేరాలు జరిపించారు. ఆరెస్సెస్‌, బీజేపీలు మాత్రమే కాకుండా, ఈ నేరాలలో విశ్వహిందూ పరిషత్‌, బజ్‌రంగ్‌ దళ్‌ సభ్యులు కూడా చురుకుగా పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత్‌ నాయకులు 21 విద్వేష ప్రసంగాలు చేస్తే, వారితో పోటీపడ్డట్టుగా బజ్‌రంగ్‌ దళ్‌ నాయకులు 20 విద్వేష ప్రసంగాలు చేశారు. అవి నేరాలకు కూడా దారితీశాయి. విద్వేష ప్రసంగాలు చేసిన వారిలో ఓ ఇద్దరు గవర్నర్లు, మరో ముగ్గురు జడ్జీలు కూడా ఉండడం గమనించాల్సిన విషయం!

‘హిందుత్వ’ ఒక సిద్ధాంతంగా ఉన్నంత వరకు ప్రమాదం లేదు. దాన్ని ఆచరణలో పెట్టి నేరాలకు పాల్పడుతున్నందువల్ల – మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. అందువల్ల అది ప్రమాదకారిగా తయారైంది. హిందుత్వ పేరుతో జరుగుతున్న విద్వేష నేరాలలో ఉత్తరప్రదేశ్‌ది అగ్రస్థానం. అక్కడ నెలకు ఎనభై నేరాలు తప్పకుండా జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో నెలకు 16 ద్వేషపూరిత నేరాలు నమోదయితే, మహారాష్ట్రలో 11 దాకా అవుతున్నాయి. ఇవి కాకుండా మహారాష్ట్రలో గోరక్షణ మూకలు రెచ్చిపోతున్నాయి. నమాజు చేసుకుంటున్న ముస్లింలపై, ప్రార్థ నలు చేసుకుంటున్న క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. ఒక ప్రసిద్ధ జైన మందిరాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రభుత్వం అక్రమంగా కూల్చేసింది. వక్ఫ్‌ బోర్డు బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలపడంతో దేశంలో ముస్లింలపై హింస పెరిగింది. హిందూ పండగల్ని అడ్డుపెట్టుకుని అల్లర్లు సృష్టిస్తూ మైనార్టీలపై దాడులు చేస్తున్నారు. వారి ఇళ్లను ధ్వంసం చేస్తున్నారు. గణేష్‌ ఉత్సవం, నవరాత్రి, రామనవమి, హోలీ వంటి పండగల సందర్భాలలో ఎవరి వేడుకలు వారు చేసుకోవచ్చు. ఏళ్లకేళ్లుగా ఇవి జరుగుతూ వస్తున్నాయి. అల్లర్లు జరిగేవి కావు. ఇప్పుడే బీజేపీ ప్రభుత్వం హిందుత్వ పేరుతో విద్వేషం పెంచి పోషిస్తున్నందువల్ల, శోభాయాత్రల సందర్భాల్లో మైనార్టీలను హింసించడం జరుగుతూ ఉంది. మహారాష్ట్ర ధానేలో యూరిన్‌ జిహాద్‌ పేరుతో ఓ ముస్లింను చంపేశారు. సంకెళ్లతో బంధించిన ఒక ముస్లిం ఆకారాన్ని సింబాలిక్‌గా రాజస్థాన్‌ జోద్‌ పూర్‌లో ఊరేగించారు. అదే రాజస్థాన్‌ బర్మర్‌ నగరం లో మసీదును ధ్వంసం చేశారు. రాజస్థాన్‌లోనే కొన్ని గ్రామాల్లోకి ముస్లింలను అనుమతించడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో హోలీ సమయంలో ముస్లిం లను పార్క్‌ల్లోకి రానీయడం లేదు. ఇంకా చెదురు ముదురు సంఘటనలు దేశవ్యాప్తంగా అక్కడ క్కడ జరుగు తూనే ఉన్నాయి. అల్లర్లకు మతతత్వ మీడియా ఆజ్యం పోస్తోంది. ఉదాహరణకు సుదర్శన్‌ టి.వి ప్రసారాలు ముస్లింలపై విషం చిమ్ముతున్నాయి.

మరీ ముఖ్యంగా ఇలాంటి విద్వేష ప్రసంగాలు, నేరాలూ ఎన్నికల సమయంలోనే తీవ్రరూపం దాలుస్తున్నాయి. తాను ముస్లిం వ్యతిరేకినని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ బాహాటంగా ప్రకటించుకు న్నాడు. ‘ముస్లింలను ఒక్కొక్కరినీ నరికేయండి!’ అని పిలుపునిచ్చాడు మహారాష్ట్రలో నితీష్‌ నారాయణ్‌ రాణె. ఈయన బీజేపీ సభ్యుడు, రాష్ట్రమంత్రి. ఈ వ్యాసంలో పొందుపరిచిన ఈ విష యాలన్నీ అసోసియేషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ రైట్స్‌ – అనే ఎన్‌.జి.ఓ సంస్థ ప్రకటించిన హేట్‌ క్రైమ్‌ రిపోర్ట్‌లోనివే! ఇంకా వివరాలు కావల్సిన వారు నెట్‌లో కొట్టి తెలుసుకోవచ్చు. అభిరుచి ఉంటే వారిని సంప్రదించి, వారితో కలిసి పనిచేయవచ్చు కూడా!
ఇటీవల కాలంలో బీజేపీ నాయకులలో ఎక్కువమంది దౌర్జనాలలో, బాంబు పేలుళ్లలో, సెక్స్‌ స్కామ్‌లలో, అవినీతిలో దొరికిపోతున్నారని ప్రత్యామ్నాయ మీడియా వల్ల, స్వతంత్ర జర్నలిస్టుల కథనాల వల్ల తెలుస్తూ ఉంది. చాలాకాలం ఆరెస్సెస్‌ తన సభ్యులను వీటికి దూరంగా ఉంచింది. వారి మీద చాలా కఠినంగా ప్రవర్తించింది కూడా! కానీ, ఒకసారి అధికార మదం తలకెక్కగానే ఇక వారిని ఆపే శక్తి ఎవరికీ లేకుండాపోయింది, వారిని శిక్షించాలంటే న్యాయవ్యవస్థలు పనిచేయాలి! అవన్నీ అధికారంలో ఉన్న బీజేపీ ఆధీనంలోనే ఉన్నాయి. వారు చర్యలు తీసుకోరు. దోషులకు శిక్షలు పడవు. అందుకే దేశంలో ఇన్నిన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఇవన్నీ బయటకు రాకుండా ‘సబ్‌కా సాత్‌, సబ్‌ వికాస్‌’- అని అంటూ ఉంటారు. కానీ, వాస్తవంగా జరుగుతున్నదేమిటీ? – సబ్‌కా సత్తెనార్‌! ఎంత సేపటికీ రోజూ నాలుగే మాటలు హిందూ ముస్లిం – కాశ్మీర్‌- పాకిస్థాన్‌! లేదా అబద్దాలు-కల్పిత కథలు – ద్వేషం – దేశభక్తి! ప్రధాన మీడియాను కొనేసి నిరంతరం చేయించుకునే భజన-వారు చేస్తున్నది విభజన. – ఇకపోతే వీరి సైన్సు పరిజ్ఞానం స్థాయిలో ఉంటుందంటే ర్యామ్‌ లేకపోతే కంప్యూటర్‌ నడవదు. ర్యామ్‌ను వారు రామ్‌ (రాముడు) అని భావిస్తారు. డాటా లేక ప్రపంచం నడవదు. ఇక్కడ డాటాను వారు దాత (ప్రదాత)గా భావిస్తారు. విపరీతమైన పెడర్థాలు తీయడంలో అతితెలివి ప్రదర్శించడంలో అంధభక్తులను మించిన వారుండరు కదా?

ప్రపంచంలో ఎత్తయిన 77 అడుగుల రాముడి విగ్రహాన్ని భారత ప్రధాని మోడీజీ గోవాలో ఆవిష్కరించారు. గత పన్నెండేళ్లలో అతి పెద్ద ఆసుపత్రి, పాఠశాల, కళాశాల లేదా పరిశుభ్రమైన ఒక చిన్న గ్రామాన్ని గానీ ఎందుకు నిర్మించలేదూ? అసలు అలాంటి ఆలోచనే లేనట్టుంది. దేశరాజధానిలోనే ఊపిరి పీల్చుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నా- అలాంటి విషయాలే ఈ ప్రభుత్వం వారి దృష్టికి రావు. ”మనం పక్షుల్లా గాల్లో ఎగరగలుగుతున్నాం. చేపల్లా నీటిలో ఈదగలుగుతున్నాం. కానీ, వాటిలాగా కలిసిమెలిసి సమైక్యంగా ఉండలేకపోతున్నాం’ అని అన్నాడు నోబెల్‌ శాంతి గ్రహీత, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ (1964) ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు ఈ పేరు విని ఉంటారా? అనుమానమే! అయినా ఎదుటివారికి నష్టం కలగజేయాలంటేనే బలం, దౌర్జన్యం, కుట్రలు, కుతంత్రాలు చివరకు అధికారం అవసరమవుతుంది. లేకపోతే ప్రేమతో, జాలి, కరుణలతో శాంతి ఒప్పందాలతో అన్నీ చక్కబడతాయి.
ధర్మం పేరుతో ఎవరైతే మత హింస జరిపిస్తున్నారో, దాడులు చేయిస్తున్నారో, మనుషుల్ని చంపుతున్నారో, వారిది అసలు ధర్మమే కాదు. అదొక మానసిక రోగం. అలాంటి వారంతా మానసిక రోగులు. వాళ్లెంతటి ఉన్నతమైన పదవుల్లో ఉన్నా సరే- ప్రజలు వారికి తగిన బుద్ది చెపుతూ ఉండాల్సిందే! ప్రజాబలం ముందు ఎంతటి ప్రభుత్వాలైనా దిగదుడుపే. చరిత్ర నమోదు చేసిన నిజం అది. ద్వేషం చిమ్మితే, విద్వేష ప్రసంగాలు చేస్తే జైలుకు పంపించే విధంగా దేశంలోని రాష్ట్రాలన్నీ చట్టం చేయాలి! దాన్ని సరైన పద్ధతిలో అమలు చేయాలి!! కర్నాటకలో ఆ ప్రయత్నం జరిగింది. తెలంగాణలో కూడా చట్టం చేస్తున్నారు.
– నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ పూర్వ సలహా సంఘ సభ్యులు, జీవశాస్త్రవేత్త.
డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -