– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ పిలుపు
నవతెలంగాణ – హైదరాబాద్ : నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట గడ్డ, అనేక భూమి, కూలీ ఉద్యమాలు నడిచిన రామన్నపేట మండల కేంద్రంలో మే 18, 19 తేదీలలో నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని వ్యవసాయ కార్మికుల కూలీ వాడలో మహాసభల ప్రచారం నిమిత్తం ముద్రించిన ” కరపత్రం ” ను సంఘం నాయకత్వం మరియు వ్యవసాయ కార్మికులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా నర్సింహ్మ మాట్లాడుతూ 1936 లో భూమి లేని పేదలకు ప్రభుత్వ మరియు మిగులు భూములు పంచాలని, కూలీ పెంచాలని, కులవివక్షత, అంటరానితనం నిర్మూలించాలని, అసమానతలు లేని సమాజం రావాలని ఉద్దేశంతో మహనీయులు పుచ్చలపల్లి సుందరయ్య వ్యవసాయ కార్మిక సంఘాన్ని నిర్మాణం చేశాడని తెలిపారు. నాటి నుండి నేటి వరకు గ్రామీణ వ్యవసాయ కూలీల, పేదల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భూమిలేని పేదలను సమీకరించి వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను పంచిన చరిత్ర వ్యవసాయ కార్మిక సంఘానికి ఉన్నదని అన్నారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెరగాలని గ్రామాలలో పెద్ద ఎత్తున సమ్మెలు నిర్వహించి కూలీ రేట్ల పెంపులో కూడా సంఘం కీలక పాత్ర పోషించింది తెలిపారు. 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఆనాటి ప్రభుత్వం తీసుకురావడంలో వామపక్ష పార్టీలతో కలిసి అనేక ఉద్యమాలు చేపట్టిందని నర్సింహ తెలియజేశారు. అనేక పోరాటల చరిత్ర కలిగిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలు రామన్నపేటలో నిర్వహిస్తున్న సందర్భంలో మహాసభల జయప్రదం కోసం అన్ని వర్గాల ప్రజలు తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర కమిటీ సభ్యులు జెల్లెల పెంటయ్య మాట్లాడుతు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభల సందర్భంగా ఉపాధి రక్షణ కోసం గ్రామ గ్రామాన ప్రచార జాతాలు నిర్వహించి మే 18న వందలాది మంది వ్యవసాయ కార్మికులతో రామన్నపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, జిల్లా వ్యాప్తంగా 300 మంది ప్రతినిధులతో 18 ,19న మహాసభలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ బహిరంగ సభకు, మహాసభలకు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యండి జహంగీర్ ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారని వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు మేడి ముకుందం, కార్యదర్శి కందుల హనుమంతు, సిఐటియు మండల కార్యదర్శి గొరిగె సోములు, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు గాదె నరేందర్, వ్యవసాయ కార్మికులు మేడి అంజమ్మ, మమత, చంద్రమ్మ , రాములమ్మ , గాదె పద్మ , గోర్ల అండాలు , జాన్సీ , గాదె పద్మ , బందెల ముత్యాలి , గట్టు అనిత పాల్గొన్నారు. అనంతరం ఆహ్వాన సంఘం అధ్యక్షులు, వెల్లంకి గ్రామ మాజీ సర్పంచ్ కూరెళ్ళ నరసింహాచారికి గ్రామ నాయకులు ఆవనగంటి నగేష్ , చెన్ని స్వామి , బర్ల బాబురావుతో కలి మహాసభల బ్రోచర్లను అందించినారు.



