Thursday, April 23, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిగుట్టలు కరుగుతున్నాయి...

గుట్టలు కరుగుతున్నాయి…

- Advertisement -

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకలో అభివృద్ధి పేరుతో వెలసిన స్టోన్‌ క్రషర్‌ యూనిట్‌ గ్రామాన్ని ధ్వంసం చేస్తోంది. లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌ పనులు అక్కడి పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నది. దీనికి తోడు మరో గుట్టకు నూతనంగా మరో క్రషర్‌ పెట్టడానికి సన్నాహాలు చేయటం మూలిగే నక్కపై తాటికాయ వేయటమే అవుతుంది. గ్రామశివారులో ఉన్న గుట్టలు ఒకప్పుడు ఆ ప్రాంతానికి రక్షణ కవచాలుగా ఉండేవి. కానీ, నేడు క్రషర్ల దౌర్జన్యం వల్ల ఈ గుట్టలు క్రమంగా కరిగిపోతున్నాయి. నిరంతరం జరుగుతున్న భారీ పేలుళ్ల కారణంగా గుట్టలు ధ్వంసమవుతున్నాయి. ఈ గుట్టల తొలగింపు వల్ల కేవలం ప్రకృతి అందం దెబ్బతినడమే కాకుండా, భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోతోంది. ఇది భవిష్యత్తులో తీవ్ర నీటిఎద్దడికి దారితీస్తుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం ఆ హెచ్చరికలు పట్టించుకునే నాధుడే లేడు.

ఇక పత్తిపాక రైతాంగం నేడు ఆ క్రషర్‌ వల్ల తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. క్రషర్‌ యూనిట్‌, డాంబర్‌ ప్లాంట్‌ నుంచి వెలు వడే విపరీతమైన దుమ్ము, సూక్ష్మ రసాయన కణాలు గాలిలో కలిసి పొరుగున ఉన్న పంట పొలాలపై పేరుకుపోతున్నాయి. దీనివల్ల మొక్కల ఆకులపై దుమ్ము చేరి కిరణజన్య సంయోగక్రియకు ఆటంకం కలుగుతోంది. పంటల పెరుగుదల ఆగిపోయి, దిగుబడి గణనీయంగా తగ్గుతోంది. నాణ్యత లేని దిగుబడి వల్ల మార్కెట్‌లో రైతులకు సరైన ధర లభించడం లేదు. రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలోని చెరువులు క్రషర్‌ వ్యర్థాలకు నిలయాలుగా మారుతున్నాయి. యూనిట్ల నుంచి వచ్చే మట్టి, రాతి పొడి వర్షపు నీటితో కలిసి చెరువు, కుం టలలో చేరుతుండటంతో నీరు విషతుల్యమవుతోంది. దీనివల్ల జల జీవవ్యవస్థ దెబ్బతిని, చేపలు తదితర జీవరాశులు మఅత్యువాత పడు తున్నాయి. నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో సాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ సమస్య కేవలం పత్తిపాకకే పరిమితం కాలేదు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో స్టోన్‌ క్రషర్ల కారణంగా రోడ్లు ధ్వంసమవుతున్నాయి, ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు, బాధితులు ఏకమై తమ గళాన్ని వినిపిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవకపోవటం సరైనది కాదు.

నిబంధనలు ఉల్లంఘిస్తున్న స్టోన్‌ క్రషర్లపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. గుట్టల మనుగడను కాపాడటానికి భారీ పేలుళ్లను నిలిపివేయాలి. కలుషితమైన చెరువులను ప్రక్షాళన చేసి, వ్యర్థాలు చేరకుండా రక్షణ చర్యలు చేపట్టాలి. ప్రతి యూనిట్‌లో దుమ్ము నివారణకు శాస్త్రీయ పరికరాలను ఏర్పాటు చేయాలి. పత్తిపాక ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న స్టోన్‌ క్రషర్‌, డాంబర్‌ ప్లాంట్‌ను ఎందుకు మూసివేయకూడదో అధికారులు సమాధానం చెప్పాలి. పత్తిపాక ప్రజల ఆవేదనను ఆలకించి, అక్కడి గుట్టలు, చెరువులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. లేనిపక్షంలో భవిష్యత్‌ తరాలకు మనం కేవలం కాలుష్యాన్ని, ఎడారిని మాత్రమే మిగిల్చిన వారమవుతామనేది గుర్తించాలి.

పల్లెబోయిన సుధాకర్‌
9949279802

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -