Wednesday, April 22, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఇరాన్‌ మెడమీద కత్తి పెట్టి చర్చలా?

ఇరాన్‌ మెడమీద కత్తి పెట్టి చర్చలా?

- Advertisement -

బుధవారం నాడు జరుగుతాయని భావిస్తున్న రెండవ దఫా అమెరికా-ఇరాన్‌ చర్చల గురించి మంగళవారం రాత్రి వరకు ఎలాంటి పురోగతి లేదు. ఇస్లామాబాద్‌ వచ్చేదీ లేనిదీ ఇరాన్‌ చెప్పలేదు. తమ ప్రతినిధి వర్గం ఎలాంటి ప్రయాణ సన్నాహాలు చేయలేదని ఇరాన్‌ మీడియా పేర్కొన్నది. అయితే నాటకీయంగా నిర్ణయం మార్చుకున్నా ఆశ్చర్యం లేదు. చర్చలు జరుగుతాయనే అంచనాతోనే వేలాది మంది సిబ్బందితో పాక్‌ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేసింది. తమ మెడమీద కత్తి పెట్టి చర్చలంటే కుదిరేది కాదని టెహరాన్‌ స్పష్టం పేర్కొంది.ఈ పరిణామంతో ప్రపంచ చమురు మార్కెట్‌లో ధరలు స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ ఒప్పందం కుదురుతుందనే ఆశాభావంతో మనదేశ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. గడువు ముగిసేలోగా తాము చెప్పినట్లు ఒప్పందం జరగకపోతే పెద్ద ఎత్తున దాడులు చేస్తామని ట్రంప్‌ మరోమారు బెదిరించాడు. తాను విజయం సాధించినట్లు మరోమారు చెప్పుకున్నాడు. గడువు పొడిగించేది లేదన్నాడు. తాము ఇప్పటికే 27 నౌకలను వెనక్కు తిప్పి పంపినట్లు అమెరికా మిలిటరీ చెప్పుకుంది.దీని వలన ఇరాన్‌ రోజుకు 50కోట్ల డాలర్ల మేర నష్టపోతున్నదని ట్రంప్‌ చెప్పాడు. ఉభయ దేశాలూ కాల్పుల విరమణ గడువును పొడిగించే అవకాశం ఉన్నట్లు అమెరికన్‌ మిలిటరీ సెంట్రల్‌ కమాండ్‌ మాజీ అధిపతి డేవిడ్‌ పెట్రాస్‌ చెప్పాడు. మరోవైపు ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ బృందం సూట్‌కేసు సర్దుకొని వాషింగ్టన్‌లో సిద్ధ్దంగా ఉన్నట్లు వార్తలు రాగా, ఒప్పందం కుదిరేట్లయితే స్వయంగా డోనాల్డ్‌ ట్రంపే వచ్చి సంతకాలు చేస్తాడని లేదా వీడియో సమావేశంలో పాల్గ్గొంటారని మరోవైపు రాయిటర్స్‌ పేర్కొన్నది. ఉభయ పక్షాలు తమ తమ ఎత్తుగడలతో కొనసాగుతున్నాయి. ఆదివారం తమ నౌకను దిగ్బంధించటం ఓడదొంగల దుశ్చర్య వంటిదేనని ఇరాన్‌ పేర్కొన్నది.ఆ నౌకలో క్షిపణుల తయారీకి అవసరమైన రసాయనాలు చైనా నుంచి వచ్చాయని మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ పార్లమెంటు సభ్యురాలు నికీ హేలీ ఆరోపిం చారు. నిజమే చాలా ప్రమాదకరంగా చైనా వ్యవహరిస్తోం దంటూ అమెరికా అనుకూల మీడియా వ్యాఖ్యాతలు భజన ప్రారంభించారు. ఆ కంటెయినర్‌ నౌకతో తమకు సంబంధం లేదని అతిశయోక్తులు ప్రచారం చేస్తున్నారని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి ఖండించాడు.ఒక వైపు అమెరికా దిగ్బంధనం కొనసాగుతుండగానే ఇరాన్‌ నౌక ఒకటి హార్ముజ్‌ జలసంధి నుంచి ఓమన్‌ గల్ఫ్‌ వైపు ప్రయాణించినట్లు వార్తలు, మరో రెండు నౌకలు కూడా దాటినట్లు చెబుతున్నా, అవి ఏ దేశానివో స్పష్టం కాలేదు.

ఎరక్కపోయి ఇరుక్కున్న ట్రంప్‌!
పశ్చిమాసియా సంక్షోభం మంగళవారం నాటికి 53వ రోజులో ప్రవేశించింది. నాలుగు నుంచి ఆరువారాల్లో ఇరాన్‌ను నాశనం చేసి తమ లక్ష్యాలను సాధిస్తానని ప్రగల్భాలు పలికిన డోనాల్డ్‌ట్రంప్‌ పరిస్థితి ఇప్పుడు ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను అన్నట్లుగా ఉందంటే అతిశయోక్తి కాదు. శుద్ది చేసిన యురేనియం బాంబుల తయారీకి దగ్గరలో ఉందని ఒకసారి చెబుతారు. దాన్ని తమకు స్వాధీనం చేయాల్సిందే అంటారు. గతేడాది తాము జరిపిన దాడుల్లో ఇరాన్‌ అణుకేంద్రాలు ధ్వంసమయ్యాయని ఇప్పుడు వాటి నుంచి యురేనియాన్ని సేకరించటం చాలా కష్టం, దీర్ఘకాలం పడుతుందని సోమవారం నాడు ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. ఏదో ఒకసాకుతో కాల్పుల విరమణ చర్చలకు వస్తాడనే సంకేతం దీన్లో ఉంది, దానికి బదులు దిక్కుతోచక పిచ్చిపనులకు పాల్పడినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే ఇబ్బందులు పడుతున్న అనేక దేశాలు వత్తిడిని పెంచటం అనివార్యం. ఇంతకు ముందు చైనా నుంచి భారీ విమానాల్లో ఆయుధాలు దిగాయని చీకట్లో బాణాలు వేసినట్లు ప్రచారం చేశారు.దానికి ఎలాంటి ఆధారాలను చూపలేదు. ఇప్పుడు క్షిపణుల తయారీకి అవసరమైన రసాయనాలు పంపుతున్నారంటూ ప్రచారం మొదలు పెట్టారు. నిజమేమిటి ? అమెరికా స్వాధీనం చేసుకున్న నౌకలో ఏమున్నాయో తెలియదు. అమెరికన్లు చెప్పిన ప్రతిమాటను నమ్మాల్సిన అవసరం లేదు. అయితే బీజింగ్‌ నుంచి టెహరాన్‌కు రసాయనాలు పంపటం కొత్త కాదు, రహస్యమూ కాదు.మనతో సహా అనేక దేశాలు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి, మనమూ కొన్ని రసాయనాలను ఎగుమతి చేస్తున్నాము. వాటిని దేనికి వినియోగించు కోవాలనే షరతులేమీ దిగుమతి చేసుకొనే దేశాలకు ఉండవు. ఉదాహరణకు అమెరికా కంపెనీలు చిప్స్‌ను ఎగుమతి చేస్తున్నాయి. వాటిని శాంతియుత ప్రయో జనాలకు వినియోగించవచ్చు, ఆయుధాల తయారీలో చొప్పించవచ్చు. చైనా సరఫరా చేస్తున్నదని చెబుతున్న రసాయనాలు కూడా అలాంటివే. ఉదాహరణకు చైనా నుంచి అమెరికాకు నచ్చని లేదా వ్యతిరేకించే దేశం చాకులను దిగుమతి చేసుకుంటే తమను పొడవటానికే అని నికీ హేలీ వంటి వారు గుండెలు బాదుకుంటారు. ఇదంతా అమెరికా ఆడించే నాటకంలో భాగం తప్ప మరొకటి కాదు.

ఇరాన్‌ చర్చలకు వస్తుందా?
తన నౌక ఎంవి టౌస్కాను ఓమన్‌ జల సంధిలో దిగ్బంధించిన తరువాత ఆ ఉదంతాన్ని విస్మరించి ఇరాన్‌ చర్చలకు వస్తుందని ఎవరూ భావించరు. అయితే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించే పరిస్థితి ఉండదు. అందుకే చర్చల తలుపులను పూర్తిగా మూసివేయకుండా ఎటూతేల్చకుండా పరిణామాలను గమని స్తున్నది. ఒప్పందం కుదిరితేనే ఇరాన్‌ నౌకలపై దిగ్బంధనాన్ని ఎత్తివేస్తానంటూ ట్రంప్‌ పదే పదే ప్రకటనలు చేస్తున్నాడు. ఉభయదేశాలూ ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు భారతీయ కాలమానం ప్రకారం గురువారం ఉదయానికి ముగియనున్నది. అమెరికా స్వాధీనంలో ఉన్న నౌక గత ఆరువారాల్లో రెండుసార్లు ఇరాన్‌-చైనాల మధ్య రాకపోకలు సాగించినట్లు చెబుతున్నారు. అయితే నౌకల తీరుతెన్నులను గమనించినపుడు ఒకదేశ రేవు నుంచి బయలుదేరిన, అక్కడ నింపిన సరకులను మధ్యలో దించి మరోనౌక నుంచి తెచ్చిన వాటిని రవాణా చేయటం సాధారణంగా జరిగేదే. సదరు వస్తువులపై వేరే దేశాల తయారీ అనే స్టిక్కర్లు కూడా వేస్తారు. అసలు ఎక్కడ తయారైందనే ఆనవాలు లేకుండా లేదా మరోదేశ తయారీ అని ముద్రలు వేస్తారు. ఇరాన్‌ నౌకను ఒమన్‌ జలసంధిలో అమెరికా యుద్ధనౌక నుంచి ఆరుగంటలపాటు చేసిన హెచ్చరికలను నౌకా సిబ్బంది ఖాతరు చేయలేదు, ఇరాన్‌వైపు ప్రయాణించేందుకు చూశారు. దాంతో అమెరికా నౌకాదళం కాల్పులు జరిపి ఇంజన్‌ గది నుంచి సిబ్బంది బయటకు రావాలని హెచ్చరించింది. ఆమేరకు సిబ్బంది ఎలాంటి ప్రతిఘటనకు పాల్పడకపోవటంతో నౌకను అదుపులోకి తీసుకున్నారు.ఒకవేళ అమెరికా గనుక తిరిగి దాడులకు పాల్పడితే తమ దగ్గర ఉన్న కొత్త అస్త్రాలను బయటకు తీస్తామని ఇరాన్‌ హెచ్చరించింది.

అమెరికా, ఇజ్రాయిల్‌ అంచనాలు తలకిందులు
అమెరికా అనుసరించిన వైఖరితో హార్ముజ్‌ జలసంధి మీద ఇరాన్‌ పట్టుబిగిసిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎన్నటికీ అణ్వాయుధాలను తయారు చేయకుండా చూడటమే తన లక్ష్యం అన్న ట్రంప్‌ గడచిన 53 రోజుల్లో రోజుకో కొత్త లక్ష్యాన్ని ప్రకటిస్తుండగా టెహరాన్‌ మొదటి నుంచి చెబుతున్నదానికే కట్టుబడి ఉంది.జలసంధి మీద ఇరాన్‌ అదుపు కలిగి ఉన్నప్పటికీ గతంలో దాన్ని ఒక ఆయుధంగా చేసుకోలేదు. అదే మాదిరి ఇప్పుడు కూడా ఉంటుందని అమెరికా, ఇజ్రాయిల్‌ వేసుకున్న అంచనాలు తప్పాయి.దాన్నే కాదు, ఎమెన్‌ జలసంధిని కూడా అవసరమైతే మూసివేయిస్తామని ఇరాన్‌ నేతలు ప్రకటించారు. జూఅదే జరిగితే సూయజ్‌ కాలువ ద్వారా మధ్యధరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం ద్వారా హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించే రవాణా కూడా నిలిచిపోవటం అనివార్యం. ఇరాన్‌ వైఖరిని చూస్తుంటే రానున్న రోజుల్లో కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించుకుని హార్ముజ్‌ను తన అదుపులో ఉంచుకొనేందుకు పూనుకున్నదని చెప్పవచ్చు. పట్టుసాధించ టమేగాక అమెరికా దాడులతో తమకు కలిగిన నష్టాలను పూడ్చుకొనేందుకు ఆ మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి సుంకం వసూలు చేసి పునరుద్ధరణకు వినియోగిస్తామని కూడా ప్రకటించింది. పీపాకు ఒక డాలర్‌ వంతున పన్ను విధిస్తే ఒక్కో టాంకర్‌ ద్వారా ఇరవైలక్షల డాలర్ల రాబడి వస్తుంది. సాధారణ సమయంలో రోజుకు 120 నుంచి 150 నౌకలు ఆ మార్గంలో ప్రయాణిస్తాయి. ప్రపంచవ్యాపితంగా వందల కోట్ల మంది జనాలను ఇబ్బందుల పాలు చేయటం తప్ప ఇంతవరకు అమెరికా సాధించిందేమీ లేదు. గతంలో అన్ని దుర్మార్గాల్లోనూ పాలుపంచుకున్న ఐరోపా మిత్రదేశాలు ఈసారి ముఖం చాటేశాయి. ఇరాన్‌ దాడులతో తాము కూడా నష్టపోతున్నప్పటికీ ప్రత్యక్ష పోరుకు దిగేందుకు గల్ఫ్‌ దేశాలు ఇప్పటి వరకు నిరాకరించాయి. రానున్న రోజుల్లో అమెరికాకు అనుకూలంగా వ్యవహరిస్తే గల్ఫ్‌ దేశాలను కూడా ఎలా దెబ్బతీయగలదో ఇరాన్‌ నిరూపించింది.అది మరింత దూరం ప్రయాణించి దాడి చేసే క్షిపణులను రూపొందిస్తున్నది.ఈ రీత్యా కూడా పశ్చిమాసియాలో ఇరాన్‌ పట్టు పెరగనుంది.

వర్దమాన దేశాల్లో చైనా పలుకుబడి
పశ్చిమాసియా సంక్షోభం తలెత్తిన తరు వాత చైనా గురించి కూడా చర్చ జరుగుతున్నది. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుం టున్నదంటూ ఆరోపణలు, ఉక్రోషాన్ని వెళ్లగక్కు తున్నారు. అసలు కారకులైన అమెరికా, ఇజ్రాయిల్‌ను వదలి బీజింగ్‌పై కేంద్రీకరించటం ఒక ఎత్తుగడలో భాగమే. తన ఇంథన భద్రతా చర్యల్లో భాగంగా ఇరాన్‌, గల్ఫ్‌ దేశాలతో సఖ్యతో ఉండటమే గాక పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెడుతోంది.ఇరాన్‌-సౌదీ మధ్య ఉన్న దీర్ఘకాలిక విబేధాలను మధ్యవర్తిత్వంతో పరిష్కరించింది.అనేక దేశాలకు భరోసా ఇస్తున్నది. అమెరికా దుశ్చర్యలను ఖండిస్తున్నది తప్ప ఇరాన్‌ మీద పెద్దగా వత్తిడి తేవటం లేదు, భద్రతా మండలిలో దానికి అనుకూలంగా రష్యాతో కలసి వీటోను కూడా ప్రయోగించి రక్షించింది. తన ఇంథన భద్రతలో భాగం ఒకటో, రెండో దేశాలపై ఆధారపడటంలేదు. అమెరికా కుట్రలను ముందుగానే గ్రహించిన కారణంగా కొన్ని నెలల పాటు సరఫరా ఆగినా తట్టుకొనేందుకు అవసరమైన నిల్వలను చేసుకున్నది. ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన తరువాత స్వల్పంగా చమురు ధరలను పెంచిన చైనా తాజాగా అంతకంటే ఎక్కువగా ధరలను తగ్గించింది. మరోవైపు గల్ఫ్‌ దేశాలతో వాణిజ్య సంబంధాలను గణనీయంగా పెంచుకుంది. ఆ ప్రాంత దేశాలతో 2024లో 257 బిలియన్‌ డాలర్ల లావాదేవీలను నిర్వహించింది. ఈ మొత్తం పశ్చిమదేశాలతో సాగించిన మొత్తం వాణిజ్యం కంటే ఎక్కువ. అమెరికా బెదిరింపులకు లొంగకుండా ఇరాన్‌కు అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్న తీరును చూసిన తరువాత పేద, వర్ధమాన దేశాల్లో చైనా పలుకుబడి పెరగటం, అమెరికా ప్రభావం తగ్గటం అనివార్యం!

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -