మానవ చరిత్రలో మనం అత్యంత ఆధునిక కాలంలో ఉన్నామని సంబరపడుతున్నాం. కానీ, అదే సమయంలో మనం అత్యంత ప్రమాదకరమైన శిథిలాల మీద నిలబడి ఉన్నామన్న నిజాన్ని విస్మరిస్తున్నాం. ఏప్రిల్ 22 – ధరిత్రి దినోత్సవం. ఇది కేవలం పచ్చని చెట్ల ఫొటోలు షేర్ చేయడానికో, ఉపన్యాసాలు దంచడానికో పరిమితం కాకూడదు. ప్రకృతిపై మనం సాగిస్తున్న ‘నిశ్శబ్ద యుద్ధం’ గురించి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయమిది. నిన్నటి వరకు మనం ప్రకృతిని ‘వనరు’గా మాత్రమే చూశాం. కానీ నేడు అది ‘బాధితురాలు’గా మారిపోయింది. అడవుల నరికివేత, అపరిమితమైన మైనింగ్, పారిశ్రామిక వ్యర్థాల విషకౌగిలిలో భూమి ఊపిరి సలపక విలవిలలాడుతోంది. సిమెంట్ అడవుల కోసం పచ్చని ప్రాణవాయువుని ఇచ్చే అడవులను బలిపీఠం ఎక్కిస్తున్నాం. కొండలను పిండి చేసి, భూమి గర్భాన్ని తోడేసి మనం నిర్మిస్తున్న భవంతులు.. ప్రకృతి ప్రళయాల ముందు పేకమేడలని ఉత్తరాఖండ్ నుండి నేటి అకాల వర్షాల వరకు నిరూపిస్తూనే ఉన్నాయి.ప్రస్తుత సమాజం ‘వాడి పారేసే’ సంస్కృతికి బానిస అయింది. మనం వాడి పారేస్తున్న ప్లాస్టిక్ భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి, నేలతల్లి సారాన్ని హరిస్తోంది.
సముద్ర గర్భంలో తిమింగలాల కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు దొరుకుతున్నాయంటే, మన విధ్వంసం ఎంత లోతుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్లాస్టిక్ రహిత భూమి వైపు అడుగులు వేయడం ఇప్పుడు మనకు ఇష్టం కాదు, అది మన మనుగడకు సంబంధించిన ‘అవసరం’ అనేది గుర్తించాలి. గ్లోబల్ వార్మింగ్ అనేది ఇప్పుడు కేవలం పుస్తకాల్లోని పదం కాదు. అడవుల్లో కార్చిచ్చు, ఎడారిలా మారుతున్న సాగు భూములు, కరిగిపోతున్న హిమానీనదాలు మన కళ్ల ముందే ఉన్నాయి. ఉష్ణోగ్రతలు ఒక్క డిగ్రీ పెరిగినా, కోట్లాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉంది. ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తే, ఆ ప్రకృతి తిరగబడితే ఏ మానవ సాంకేతికత కూడా మనల్ని కాపాడలేదు అనేది సత్యం. అందుకే మనం భూమిని కాపాడటం అంటే భూమికి ఉపకారం చేయడం కాదు, మనల్ని మనం కాపాడుకోవడం. ప్రతి ఇంటిలో వాన నీటి సంరక్షణ, రసాయన ఎరువుల వాడకం తగ్గించడం, శిలాజ ఇంధనాల (పెట్రోల్, డీజిల్) పై ఆధారపడటం తగ్గించి సౌర శక్తి వైపు మళ్లడం వంటివి తక్షణమే జరగాలి. పర్యావరణ స్పృహ అనేది పాఠశాల సిలబస్‌లో మాత్రమే కాదు, ప్రతి వ్యక్తి జీవనశైలిలో భాగం కావాలి.భూమి మనకు సర్వస్వాన్ని ఇస్తోంది. ప్రతిగా మనం ఇస్తున్నది కాలుష్యాన్ని, విధ్వంసాన్ని మాత్రమే. మన ముందున్నది తక్కువ సమయం. ఈ ధరిత్రి దినోత్సవం రోజున ప్రకృతిని రక్షించుకుంటామని చేసే ప్రతిజ్ఞ, ఆచరణలోకి మారాలి. లేదంటే, రాబోయే తరాలకు మనం ఇచ్చే వారసత్వం.. ఎండిపోయిన నదులు, విషతుల్యమైన గాలి, నిస్సారమైన భూమి మాత్రమే అవుతుంది.
కస్తూరి



