‘కొంతమంది యువకులు రాబోవు యుగం దూతలు.. పావన నవజీవన బృందావన నిర్మాతలు.. బానిస బంధాలను తలవంచి అనుకరించరు.. పోనీ అని అన్యాయపు పోకడలు సహించరు.. వారికి నా ఆహ్వానం.. వారికి నా సెల్యూట్’ అంటూ మహాకవి శ్రీశ్రీ యువతపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, కొంతమంది యువతను, విద్యార్థుల చేష్టలను చూస్తుంటే సమాజం ఎటుపోతుందో అనే ఆందోళన కలుగుతోంది. తోటి వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రెండురోజుల కిందట హనుమకొండకు సమీపంలోని ఓ కార్పొరేట్ కాలేజీలో జరిగిన ఘటనే ఇందుకు కారణం. తోటి విద్యార్థిని పట్ల తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు ఓ విద్యార్థి. ఆమె నగ వీడియోను కాలేజీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి సమాజం తలదించుకునేలా చేశాడు.
ఈ ఘటన పరిశీలిస్తే అనేక ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. ఆ వీడియో బయటకు వెళితే తాను పట్టుబడతానని ఆ విద్యా ర్థికి తెలియదా? లేదా అలాంటి వీడియోలు తీయకూడదని, షేర్ అసలే చేయకూడదనే కనీస ఇంగితం కూడా లేదా? తోటి విద్యార్థినిపై కక్ష తీర్చుకోవాలనే క్రూరమైనా ఆలోచన తప్ప తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో అసలు ఊహించి ఉంటాడా? ప్రస్తుతం వీడియో పోస్ట్ చేసిన విద్యార్థిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చట్టాలు, శిక్షలు ఎలా ఉన్నా.. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే ఇలాంటి దారుణాలు జరక్కుండా ఏం చేయాలనేది ఆలోచించాల్సిన అంశం. అసలు యువత ఈ పెడధోరణులకు పాల్పడటానికి కారణలేంటి? ఇలాంటి దారుణమైన ఆలోచనలు ఎలా వస్తున్నాయి? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? తల్లిదండ్రులా? అధ్యాపకులా? లేదంటే పాలకులా? కచ్చితంగా చెప్పాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరూ వీటికి బాధ్యత వహించాల్సిందే. మరీ ముఖ్యంగా మన నాయకులు.
వాస్తవంగా పరిశీలిస్తే నియంత్రణ లేని టెక్నాలజీ వాడకం దీనికి ఓ ప్రధాన కారణం. నేటి యువత సోషల్ మీడియాకు, టెక్నాలజీకి బానిసగా మారిపోతున్నది. పాతికేండ్లుదాటి న తర్వాత అనుభవించా ల్సినవి పదేండ్లలోపే చవిచూడాల నే ఆశ, ఆలోచన, కోరికలు పుట్టుకొస్తున్నా యి. చివరకు తోటి వాళ్లను బలిచేసైనా సరే తమ కోరిక తీర్చుకోవాలనే ఆవేశం, కసి, ఆక్రోశం పెరిగిపోతున్నది. చిన్నతనంలో తమ పనులకు అడ్డుతగల కూడదని పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి వాళ్లకు టెక్నాలజీని పరిచయం చేస్తున్నారు తల్లిదండ్రులు. తర్వాత అది లేకుండా ఉండలేని స్థితికి వచ్చేస్తున్నారు పిల్లలు. హైస్కూల్ స్థాయికే స్మార్ట్‌ఫోన్ కావాలంటూ పేచీలు పెడుతున్నారు. ఇవ్వకపోతే దారుణాలకు పాల్పడుతున్నారు. చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు లేదా తీస్తున్నారు. దాన్నే వ్యాపారంగా రూ.కోట్లు గడిస్తున్న కార్పొరేట్లు రకరకాల ఫీచర్లతో విచ్చలవిడి యాప్స్‌ను క్రియేట్ చేసి సమాజంపై వదులుతున్నారు. విద్యార్థులు, యువత వాటికి బానిసలైపోతున్నారు. నిజం చెప్పాలంటే నేడు స్మార్ట్‌ఫోన్ డ్రగ్స్ కంటే కూడా ప్రమాదకరమైన వ్యసనంగా మారిపోయిందని చెప్పొచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా సుమారు నలభై శాతం విద్యాసంస్థలు, 79 దేశాలు పిల్లలు స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని నిషేధించాయి. మనకంటే ఎక్కువ జనాభా ఉన్న చైనా తమ పిల్లలు స్మార్ట్ఫోన్లకు బానిసలు కాకుండా ప్రభుత్వమే రకరకాల కార్యకలాపాల్లో శిక్షణ ఇస్తుంది. అత్యంత చిన్న వయసు నుండే పుస్తకాలు చదివేలా, లైబ్రరీలకు వెళ్లేలా, వివిధ ఆటల్లో శిక్షణ తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. ఫలితంగా యువతలో మానవ విలువలు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది చైనా. మరి మన దేశంలో ఆ కృషి చేయలేమా? పక్క రాష్ట్రమైన ఏపీ ప్రభుత్వం పన్నెండేండ్లలోపు పిల్లలకు స్మార్ట్‌ఫోన్ బ్యాన్ చేస్తూ జీవో విడుదల చేసింది. భవిష్యత్తులో పద్దెనిమిదేండ్ల పిల్లల వరకు పరిమితి విధించాలనే యోచన కూడా చేస్తోంది. అయితే ఇది ఆచరణలో ఎలా ఉంటుందో వేచి చూడాలి. మన రాష్ట్రంలో కూడా అలాంటి ప్రయత్నం అవసరం.యువత భవితను దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియా వేదికలు నిర్వహించే యాజమాన్యం కూడా యాప్స్ తయారీలో కొన్ని పరిమితులు పాటించాలి.
కేంద్ర పాలకులు కేవలం తమ అధికారాన్ని కాపాడుకునేం దుకు యువతను వాడుకోకుండా దేశ భవితను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా ఆలస్యం చేస్తే యువత పూర్తిగా మన చేయి దాటిపోతుంది. శ్రీశ్రీ చెప్పినట్టు ‘కొంతమంది కుర్ర వాళ్లు పుట్టుకతో వృద్ధులు.. పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్దులు’ అన్న మాటలు నిజం చేద్దామా? లేదా ‘కొంతమంది యువకులు రాబోవు యుగం దూతలు.. పావన నవజీవన బృందావన నిర్మాతలు’గా తీర్చిదిద్దుకుందామా అనేది ప్రభుత్వాలే కాదు, పౌర సమాజమూ ఆలోచించాలి. అందుకే భావి భారతాన్ని నిర్మించాల్సిన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది.
యువతరం…నైతిక పతనం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



