Wednesday, April 22, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిసీఎం గారూ...ఆర్టీసీ వారియర్స్‌ను పట్టించుకోరా?

సీఎం గారూ…ఆర్టీసీ వారియర్స్‌ను పట్టించుకోరా?

- Advertisement -

పాలకుల పుణ్యమా అని ఆర్టీసీ మనుగడ, కార్మికుల భవిష్యత్తు రోజురోజుకూ అగమ్య గోచరంగా మారుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న గత ప్రభుత్వం సగం పని మాత్రమే చేసి వెళ్లిపోయింది.’మేం అధికారంలోకి వచ్చాక కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తాం, పాత బకాయిలను చెల్లిస్తాం, కొత్త బస్సులను కొంటాం’ అన్న కాంగ్రెస్‌ ఇప్పుడు ఆ విషయమే మర్చిపోయినట్లు కనిపిస్తున్నది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో 14వ పేజీలో ప్రకటించింది. రెండు పీఆర్సీలను ఇస్తామంది. 2021 పీఆర్సీకి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు, సర్వీస్‌ కండిషన్లు ఉంటాయని హామీనిచ్చింది.’కొత్త బస్సులను కొంటాం. బస్‌ స్టేషన్లు, డిపోలను ఆధునీకరిస్తాం..యూనియన్లను పునరుద్ధరిస్తాం’ అని నమ్మబలికింది.అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో రేవంత్‌ రెడ్డి ఆర్టీసి కార్మికులను వారియర్స్‌గా పేర్కొన్నారు. తమకు కొంచెం సమయం ఇవ్వమని కోరారు. రెండున్నరేళ్లుగా ఆర్టీసీ జెఎసి ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాలు, ర్యాలీలు, పికెటింగ్‌ వంటి రూపాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సమస్యలు పరిష్కరించలేదు. దీంతో ఈనెల 22 నుంచి మళ్లీ సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ గతంలోనే యాజమాన్యానికి నోటీసు కూడా ఇచ్చింది.

గత ప్రభుత్వం యూనియన్లను తీసేసింది. ‘టెంపరరీగా వెల్ఫేర్‌ కమిటీ వేసుకుందాం’ అని చెప్పింది. 53 రోజుల పాటు ఆర్టీసి కార్మికులు సమ్మె చేయడమే అప్పటి సీఎంకు కోపం తెప్పించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అసెంబ్లీలో బిల్లును పాస్‌ చేయించిన కేసీఆర్‌ గవర్నర్‌ ఆమోదం కోసం పంపితే… కేంద్రం ‘కనుసన్నల్లో’ పనిచేసిన అప్పటి గవర్నర్‌ తమిళిసై కొర్రీలు పెట్టినట్టు ప్రచారం జరిగింది. కార్మికులు ఆందోళన చేయడం… కొద్దిపాటి ప్రభుత్వ వివరణతో చివరికి ఆమోదం తెలిపారు. కానీ, అపాయింటెడ్‌ డే ప్రకటించలేదు. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో ప్రక్రియ ఆగిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఈ సమస్య తమది కాదన్నట్టుగా భావిస్తున్నా ఇప్పటికే గవర్నర్‌ ఆమోదంతో చట్టం అమలులో ఉంది. కొత్తగా ప్రభుత్వం చేయాల్సిందేమీ లేదు. అపాయింటెడ్‌ డేట్‌ ఇస్తే చాలు…ఆర్టీసి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు అయిపోతారు. ఆర్టీసి ప్రభుత్వంలో విలీనం అవుతుంది. ఆ పనిని సీఎం రేవంత్‌రెడ్డి చేయడానికి ఇష్టపడటం లేదు. అలాంటప్పుడు అసెంబ్లీలో ఆ చట్టానికి సవరణలు చేయడమో, రద్దు చేయడమో చేయాలి. ఏ పనీ చేయకుండా, ఇచ్చిన హామీని అమలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్టీసీతో, కార్మికులతో ఆడలాడటం సబబేనా?

ఆర్టీసీ కార్మికులు పొదుపు చేసుకున్న సొమ్మును సైతం గత ప్రభుత్వం సూచనతో ఆర్టీసి యాజమాన్యం వాడుకుంది. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి సర్కారు ఆ డబ్బును ఒకేసారి చెల్లించడం లేదు. కొద్దికొద్దిగా జమచేస్తున్నది. ఆర్టీసీలో తెలంగాణ ఏర్పడినప్పుడు దాదాపు 57 వేల మంది కార్మికులు ఉండేవారు. 12వేల నుంచి 13 వేల మంది దాకా రిటైర్‌ అయ్యారు. వారి స్థానంలో కొత్తవారిని తీసుకోలేదు. ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్‌ కార్మికులతో కలిపి 45 వేల వరకూ కార్మికులున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ఆర్టీసీలో మాత్రమే ఔట్‌సోర్సింగ్‌ వ్యవస్థ ఉంది.పర్యావరణ కాలుష్యం తగ్గించాలనే సాకుతో…ఓలెక్ట్రా, జెబిఎం సంస్థల ఎలక్ట్రిక్‌ బస్‌లను ఆర్టీసీ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయిస్తున్నది. కానీ, ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయడం లేదు. కేంద్రం ఒక్కో బస్‌ పైనా 36 లక్షల రూపాయలను సబ్సీడీగా అందజేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటును ఆర్టీసీకి ఇవ్వడం లేదు. గతంలో జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం స్కీం కింద బస్సుల కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చేవి. ఇప్పుడెందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వడం లేదు. ఒక్కబస్‌పై ఆధారపడి ఐదుగురు కార్మి కులు ఉపాధి పొందుతారు. దీనికి భిన్నంగా ఎలక్ట్రిక్‌ బస్సుల డ్రైవర్లు, సూపర్‌వైజర్లు, మేనేజర్లు ప్రయివేటు వారే ఉంటున్నారు. హైదరాబాద్‌ సిటీ మినహాయిస్తే, జిల్లాల్లో కండక్టర్లు కూడా లేరు. టిమ్స్‌ ద్వారా ప్రయివేటు డ్రైవర్లే టిక్కెట్లు ఇస్తున్నారు. చాలాచోట్ల డిపోలనే ఎలక్ట్రిక్‌ బస్‌ కంపెనీలకు అప్పగించేశారు. ఇదంతా చూస్తే భవిష్యత్‌లో ఆర్టీసీ ప్రయివేటుపరం చేసే కుట్ర కనిపిస్తున్నది!

ఇప్పటికైనా కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలి. దీనికోసం అపాయింటెడ్‌ డేను ప్రకటించాలి.ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. ప్రభుత్వ పథకాల రీయింబర్స్‌మెంట్‌ డబ్బును ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. ఇప్పటివరకూ ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిన బకాయిలు వివరాలు వెల్లడించాలి. బడ్జెట్‌లో ప్రభుత్వ పథకాల అమలు కోసం ఆర్టీసీకి నిధులను కేటాయించాలి. లేబర్‌ చట్టాల ప్రకారం పని గంటలు అమలయ్యేలా చూడాలి. ఎలక్ట్రిక్‌ బస్సులను పూర్తిగా ఆర్టీసీనే నడిపేలా చూడాలి. కొత్త బస్సుల కొనుగోలు కోసం ఆర్టీసీకి గ్రాంట్‌ ఇవ్వాలి. ఔట్‌ సోర్సింగ్‌ విధానానికి స్వస్తి పలకాలి. ఇవన్నీ చేస్తే తప్ప ఆర్టీసీకి పూర్వవైభవం తిరిగి రాదని ప్రభుత్వం గుర్తించాలి. మలి దశ తెలంగాణ ఉద్యమంలో చేపట్టిన సకల జనుల సమ్మెలో ఆర్టీసి కార్మికుల పాత్ర కీలకమైనది. ఇది అప్పటి ప్రభుత్వాన్ని కూడా గద్దెదించింది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడం ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల్లోనే ఉంది.

వంగ మహేందర్‌ రెడ్డి
9963155523

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -