డిలిమిటేషన్ ప్రక్రియ పార్లమెంట్లో వీగిపోయినా, దేశ రాజకీయ, రాజ్యాంగ చర్చలకు కేంద్ర బిందువైంది. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ”ఒక మనిషి – ఒక ఓటు – ఒకే విలువ” అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని బలపరచడం దీని ప్రధాన లక్ష్యం. అయితే భారతదేశంలాంటి విభిన్నతలతో కూడిన సమాఖ్య వ్యవస్థలో ఈ ప్రక్రియ కేవలం గణిత సమీకరణంగా మిగిలిపోకుండా, ప్రాంతీయ సమతుల్యం, అభివృద్ధి అసమానతలు వంటి అంశాలను ముందుకు తెస్తోంది. డిలిమిటేషన్ అంటే జనాభా మార్పులకు అను గుణంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్ణయిం చడం. సిద్ధాంతపరంగా ఇది సమాన ప్రతినిధిత్వాన్ని నిర్ధారిస్తుంది. కానీ, ఆచరణలో దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల, అభివృద్ధి స్థాయి, వలసల ధోరణి సమానంగా లేవు. ఈ అసమానతలే డిలిమిటేషన్‌ను క్లిష్టమైన అంశంగా మారుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఉత్తర-దక్షిణ విభేదం. దక్షిణ భారత రాష్ట్రాలు- తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్-గత కొన్ని దశాబ్దాల్లో విద్య, ఆరోగ్యం, కుటుంబ నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించాయి. ఫలితంగా అక్కడ జనాభా వృద్ధి తక్కువగా ఉంది. అదే సమయంలో ఉత్తర భారత రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల అధికంగా కొనసాగుతోంది.జనాభా ఆధారంగా సీట్ల పునర్విభజన జరిగితే ఉత్తర రాష్ట్రాలకు అధిక లోక్‌సభ స్థానాలు దక్కే అవకాశం ఉంది.ఇది ఒక విరుద్ధ పరిస్థితిని సృష్టిస్తుంది. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోయే అవకాశం ఉండగా, అధిక జనాభా పెరుగుదల ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రజాస్వామ్య న్యాయసూత్రాలకు విరుద్ధంగా మారే ప్రమాదం ఉంది.
మరో ముఖ్య అంశం గ్రామీణ-పట్టణ అసమానత. పట్టణ ప్రాంతాల్లో జనాభా సాంద్రత ఎక్కువగా ఉండగా, గ్రామీణ ప్రాంతాలు విస్తీర్ణంగా ఉండి తక్కువ జనాభాను కలిగి ఉంటాయి. పూర్తిగా జనాభా ఆధారంగా డిలిమిటేషన్ జరిగితే పట్టణ నియోజకవర్గాల ప్రాధాన్యం పెరిగి, వ్యవసాయం, గ్రామీణ మౌలిక సదుపాయాల సమస్యలు పక్కన పడే ప్రమాదం ఉంది.అయితే డిలిమిటేషన్ అవసరం లేదని చెప్పడం సరైంది కాదు. చాలా కాలంగా స్థిరంగా ఉన్న నియోజకవర్గాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యేకు అసమానంగా అధిక జనాభా ప్రాతినిధ్యం వహించాల్సి వస్తోంది. ఇది ప్రజాస్వామ్య సమానత్వాన్ని దెబ్బతీస్తోంది. కాబట్టి డిలిమిటేషన్ అనివార్యం.ప్రధాన ప్రశ్న ఏమిటంటే-ఇది ఎలా అమలు కావాలి? కేవలం జనాభా ఆధారంగా కాకుండా, భౌగోళిక విస్తీర్ణం, అభివృద్ధి సూచికలు, పరిపాలనా అవసరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే సమగ్ర విధానం అవసరం. ఇది గణిత సమానత్వాన్ని కొంతవరకు తగ్గించినా, సమగ్రన్యాయాన్ని అందించగలదు. అలాగే ప్రతి రాష్ట్రానికి కనీస ప్రాతినిధ్యాన్ని నిర్ధారించే విధంగా రాజ్యాంగ పరిరక్షణలు అవసరం. దీని వల్ల రాష్ట్రాల మధ్య రాజకీయ సమతౌల్యం కాపాడబడుతుంది. రాష్ట్రాల అంతర్గతంగా మాత్రం జనాభా ఆధారంగా సర్దుబాట్లు చేయవచ్చు. మరో ముఖ్య అంశం-జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలను రాజకీయంగా నష్టపరచకూడదు. ఇందుకోసం ఆర్థిక వనరుల పంపిణీ, కేంద్ర నిధుల కేటాయింపులో సముచిత మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ అంశంపై రాజకీయ స్థాయిలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణ రాష్ట్రాలకు సంభవించే ప్రభావాలపై చర్చ జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వంలో ఉన్న దక్షిణ రాష్ట్రాలకు చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు స్పష్టమైన వైఖరి వ్యక్తం చేయడంలో మౌనం పాటిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్షం ఈ అంశాన్ని బలంగా వ్యతిరేకిస్తోంది. ఈ పరిస్థితుల్లో, పార్టీలకు అతీతంగా ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడం ప్రజాప్రతినిధుల బాధ్యతగా మారుతుంది.డిలిమిటేషన్ వల్ల ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ వ్యయం కూడా పెరిగే అవకాశాన్ని నిర్లక్ష్యం చేయలేము. కాబట్టి సభ్యుల సంఖ్య పెంపుతో పాటు పరిపాలనా వ్యయాల నియంత్రణపై కూడా స్పష్టమైన విధానం అవసరం. భారతదేశంలాంటి విభిన్నతల దేశంలో ఒకే ప్రమాణంతో నిర్ణయాలు తీసుకోవడం కంటే, సమగ్రదృష్టితో ముందుకు సాగడం ముఖ్యం.
– సయ్యద్ రఫీ, 9966025325
డిలిమిటేషన్-సమతుల్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



