2026 ఏప్రిల్ 11 జ్యోతిబా ఫూలే జయంతి. ఆయన అభిమానులు ఫూలే జయంతిని ఘనంగా జరుపుకున్నారు. పాలకవర్గాలు ఈ అవకాశాన్నీ తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో లబ్ధికి వాడుకున్నాయి. మోడీ అన్ని దినపత్రికల్లో ఫూలేపై వ్యాసాన్ని రాశారు. ఫూలేలను పొగిడారు. వారి పద్ధతులే తన విధానాలని రాశారు. ఈ తాత్వికత విద్యాసంస్థలకూ పాకింది. నాగార్జున విశ్వవిద్యాలయం జ్యోతిరావు ఫూలే కేంద్రం కార్యక్రమంలో ఒకతను తన రచనను సమర్పించారు. ”మోడీ ఆచరణలన్నీ జ్యోతిరావు ఫూలే కార్యక్రమాలే. ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేయడం, జాతీయ విద్యా విధానం-2020 సావిత్రిబాయి ఫూలే ప్రభావంతోనే” అన్నారు.
జియోవని జెన్టైల్ రోమ్ విశ్వవిద్యాలయ మతాచార్యుడు, ఊహావాద తత్వవేత్త. ఇటలి ఫాసిస్టు పార్టీ స్థాపకుడు, నియంత బెనిట్ అమిల్కేర్ ఆండ్రియా ముసోలిని మొదటి మంత్రివర్గంలో విద్యామంత్రి. జెన్టైల్ ఫాసిస్టులకు ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టారు. ముసోలిని ఇటలి విద్యావ్యవస్థను జెన్టైల్ సంస్కరణలతో సవరించారు. ”మానవ జీవితం విజ్ఞానశాస్త్రానికి తెలియని ఆధ్యాత్మిక భావాలతో ఉంది. భావజాల నిర్మాణంలో విద్య, సంస్కృతి ప్రాథమికాలు. ఉపాధ్యాయ-విద్యార్థి భావఐక్యత ముఖ్యం. విద్యలన్నీ ఆత్మసేవలే. ఆత్మాభివృద్ధి సాధనాలే. ఆత్మవికాసానికి మతతాత్వికత అవసరం. పిల్లలకు పిన్నవయసులోనే మతాన్ని బోధించాలి. విజ్ఞానశాస్త్రాలను ఐచ్ఛికాంశాలుగా మార్చాలి.”ఇవీ జెన్టైల్ భావాలు.
జెన్టైల్ 21 తప్పుడు విశ్వవిద్యాలయాలను అధికారికంగా గుర్తించారు. ఫాసిస్టు విజయానికి విద్య ఆయుధమని ఇటలి ఫాసిస్టుల ఆలోచన. 6 మే1923న జెన్టైల్ మాధ్యమిక విద్యాచట్టాన్ని చేశారు. అందరికీ విద్య అనే ప్రజాస్వామ్య భావనను తొలగించారు. ఉపాధ్యాయుని బోధనా స్వేచ్ఛను నియంత్రించారు. మాధ్యమిక విద్యను రెండుగా చీల్చారు. ఉన్నతవర్గ విద్యలో లాటిన్, గణితం, భౌతికశాస్త్రం బోధిస్తారు. రెండవది విశ్వవిద్యాలయ ప్రవేశానికి, వృత్తి విద్యలకు పనికిరాని ద్వితీయశ్రేణి విద్య. బాలికలకు గణితం, విజ్ఞానశాస్త్రాలను బోధించరు. విశ్వ విద్యాలయాలను మూడుగా విభజించారు. ప్రథమశ్రేణిలో అన్ని విద్యావిభాగాలు ఉంటాయి. బోధన, పరిశోధన, జీతాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. ద్వితీయ శ్రేణి విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వ సాయం తక్కువ. తృతీయశ్రేణిలో సొంత నిధులతో, ప్రభుత్వ ఆజ్ఞల ప్రకారం, ఉచిత విద్యను బోధించాలి. లేకుంటే ఈ విశ్వవిద్యాలయాలను రద్దుచేస్తారు.
జెన్టైల్ విధానంలో రాజ్యసిద్ధాంతాలనే బోధించాలి. రాజ్యా దేశాలే ప్రజాభిప్రాయాలు. ఒకే ఉపాధ్యాయుడు బహుళ తాత్వికతలను బోధిస్తాడు. తత్వశాస్త్రం ప్రధాన ఆలోచనావిధానం. అన్ని అంశాలకు అనుబంధం. దేవుడొక్కడే సూత్రంతో అన్ని జ్ఞానాలను విద్యార్థులు అభ్యసించాలి. ఈ నమ్మకాల పురుషులే అధ్యాపకులు. మగాళ్ల తయారీ విద్య లక్ష్యం. మగపిల్లలు (బాలికల ప్రస్తావన లేదు) గురువు నుండి ఆధ్యాత్మిక ప్రకాశాన్ని ఆశించాలి. ఇటాలియన్ తప్ప ఇతర భాషా మాధ్యమాలను నిషేధించారు. ఇతర మాతృభాషల పిల్లలు చదువు మానేశారు. స్వజాతి గొప్పది. పితృభూమి కోసం స్వీయబలికైనా సిద్ధపడాలి. విద్యార్థుల విధేయత బోధనలో సమ్మిళితం. విజ్ఞానశాస్త్రాల కంటే జాతీయత ముఖ్యం.
గురువు బాహ్యప్రపంచ లక్షణాలను వదలాలి. విద్యార్థులకు దైవాకర్షణ, దైవీకరణ చట్రంలో పురాణాలను బోధించాలి. ఆధ్యాత్మిక సారం, క్రమశిక్షణ నేర్పాలి. వారి రూపురేఖలను మార్చాలి. ఉపాధ్యాయుల, విద్యార్థుల ఆధ్యాత్మిక జీవితాలు ఏకమైతేనే క్రమశిక్షణ, అధికారం పట్ల గౌరవం సాధ్యం. ఈ ఐక్యతాసాధనే గురువు కర్తవ్యం. ఆత్మ మనుషులను కలుపుతుందని నమ్మాలి. క్రైస్తవంతో ప్రకృతి నుంచి ఆత్మ విడివడింది. ప్రాకృతిక ప్రేరణ ఆధ్యాత్మిక లక్ష్యానికి అడ్డంకి. మతం, గణితం, ఆర్థికం మగాళ్లకే పరిమితం. చదువుకున్న మగాడే ఆత్మను గుర్తిస్తాడు. విద్యాలయ పవిత్రత, విద్యుక్త ధర్మాలను అనుభూతి చెందని మగాడు ఉపాధ్యాయునిగా అనర్హుడు. పరిశోధనలతో ఆత్మను పగులకొట్టరాదు. దృఢమైన ఆత్మతో భావపరాధీనతలను నిరోధించేదే ఆదర్శ విద్య.
జెన్టైల్ ఫాసిస్టు విద్యావ్యవస్థకు ముసోలిని మద్దతిచ్చాడు. మతవాద ఉపాధ్యాయవర్గం, పత్రికలు ఈ సంస్కరణలను ఆహ్వానించాయి. ఫాసిస్టు పత్రిక సంపాదకుడు, కార్పొరేషన్ల పూర్వ మంత్రి గిసెప్ బొట్టాయి జెన్టైల్ సంస్కరణలను విమర్శించాడు. విద్యావేత్తలు, విజ్ఞానశాస్త్ర సంఘాలు వీటిని ఫాసిస్టు విధానాలన్నాయి. ”ఈ విద్యావిధానంతో గ్రామీణ విద్యాలయాలు మూతపడతాయి. గ్రామీణ ప్రాముఖ్యత గల మన దేశంలో గ్రామీణుల ప్రగతి కుంటుబడుతుంది.” అని 1923-24 విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తూ మాసెరట విశ్వవిద్యాలయ పీఠాధిపతి రికార్డొ బాచి అన్నారు. జెన్టైల్ సంస్కరణలు ఆధునీకరణ, సాంకేతికాభివృద్ధికి ఆటంకాలని, పొరుగు దేశాలతో పోటీలో ఇటలి వెనుకబడుతుందని తర్వాతి ఇటలి విద్యామంత్రులు వాదించారు. ప్రగతిశీలురు, వామపక్షవాదులు ఇవి తప్పుడు విధానాలన్నారు. జెన్టైల్ సంస్కరణలు విద్యకు నష్టం కలిగించాయి. ఫాసిజాన్ని బలపర్చాయి. 1928 తర్వాత ఈ విద్యావిధానం బలహీనపడింది.
1882లో విద్యా కమిషన్ అధ్యక్షులు సర్ విలియం హంటర్‌కు జోతిబా సమర్పించిన వినతిపత్రంలోని అంశాలు – విద్య ప్రభుత్వ అధీనంలో ఉండాలి. ప్రాథమిక విద్యను తప్పనిసరి చేయాలి. వంచిత శిశువులకు విద్యనందించాలి. విద్యకు స్త్రీలను ప్రోత్సహించాలి. భారతీయుల అవసరాల అంశాలతో విద్య ఉండాలి. వ్యవసాయాన్ని బోధనాంశాల్లో చేర్చాలి. దిగువ స్థాయి పిల్లలకు విద్యను అందించడానికి అడ్డంకులు కల్పిస్తున్న ‘వడబోత సిద్ధాంతాన్ని’ తొలగించాలి. (వడబోత విద్యా సిద్ధాంతాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెని విద్య, న్యాయ శాఖ మంత్రి లార్డ్ మెకాలే 1835 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. దీని ప్రకారం కొద్దిమంది అనుకూల ఉన్నత కులాల వారికి ప్రభుత్వం చదువు చెపుతుంది. వీళ్లు తక్కువ కులాలవారికి విద్యను అందిస్తారు) బడుగుల పిల్లలు బడి మానడానికి వారి సామాజిక స్థితులు, పేదరికం కారణాలు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి విద్యలో వృత్తి నైపుణ్యతలు బోధించాలి. ఉపాధ్యాయులు సుశిక్షితులయి ఉండాలి. కింది తరగతుల పిల్లలకు కింది తరగతి ఉపాధ్యాయులే విద్య నేర్పాలి. ఉపాధ్యాయులకు వ్యవసాయ, ఆరోగ్య, పరిశుభ్రతల కనీస సమాచారం ఉండాలి. గ్రామీణ ఉపాధ్యాయులకు జీతంతో పాటు విద్యార్థుల ఉత్తీర్ణత, సామర్థ్యాలను బట్టి ప్రత్యేకభత్యం ఇవ్వాలి. వ్యవసాయదారుల పిల్లలకు విద్యలో రాయితీలివ్వాలి. పేదలు, వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఉచిత గృహవసతి కల్పించాలి. ఈ సూచనలను జ్యోతిబా తమ పాఠశాలల్లో అమలుచేశారు. విలువలతో కూడిన జీవిత, నీతి, నియమ నిబద్దతల విద్య నేర్పారు.
2020-జాతీయ విద్యావిధానం జెన్టైల్ విద్యాసంస్కరణల సారాంశం. విద్యను ధార్మికసంస్థలకు అప్పజెప్పాలని ప్రతిపాదించారు. నేటి పాలకుల దృష్టిలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ును మించిన ధార్మికసంస్థ లేదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భారత విద్యను సంఫ్‌ుకు అప్పజెప్పవచ్చు. వైదికవాదమే మన విద్యావిధానంగా మారగలదు.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి
9490204545



