Sunday, April 19, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఉత్త ''రాగాలు''…

ఉత్త ”రాగాలు”…

- Advertisement -

కూడి ఎడమైతె పొరబాటు లేదోరు అని రాశారట సీనియర్‌ సముద్రాలవారు, దేవదాసు పాడే పాట అది. సంగీత దర్శకుడు సుబ్బరామన్‌ కుడి ఎడమైతే పొరబాటు లేదోరు అని గాయకుడు ఘంటసాలతో పాడించారు, రికార్డింగు కూడా ఐపోయింది. పాట విందామని గీత రచయిత సాయంకాలం వచ్చి వింటే ఇంకేముంది కూడి ఎడమైతె బదులు కుడి ఎడమైతే అని ఉండడం విని అది కాదయ్యా సుబ్బరామనూ, కలిసి విడిపోతె అనే అర్థంలో నేను రాస్తే కుడి ఎడమలుగా పాడించావే అని, ఐనా తాగి తాగి చనిపోయేవాడికి ఎలాగున్నా ఫరక్‌ పడదులే అనేసి పోయారట. కుడి అంటే దక్షిణం అని మరో అర్థముంది. అందువల్ల కుడి ఎడమైతే పొరబాటు లేదనడంలో అర్థంలేదిప్పుడు. పొరబాటు చాలాచాలా ఉంది.

ఇప్పుడు ప్రపంచంలో కాని, దేశంలో కాని ఉత్తర గాలులు బలంగా వీస్తున్నాయి. అక్కడేమో ఉత్తర అమెరికా ఏది చెబితే అది వేదం, ఇక్కడేమో ఉత్తర భారతం ఎంత చెబితే అంత, ఎవరో అంటున్నారని కాదు చూస్తే తెలిసిపోతోంది. ఒక పక్క యుద్ధాలు, ఇంకో పక్క మాటల యుద్ధాలు. ఇప్పటికి పది యుద్ధాలనాపాను అని చెప్పుకునే ముసలాయన లాయిరి నడి సంద్రములోనా లంగరుతో పనిలేదోరు అని హార్ముజ్‌ పై దాడిచేద్దాం కమాన్‌ బార్సు అని వెనక్కి తిరిగి చూశాడు. ఎవ్వరూ లేరు తాను తప్ప. ఒక్కరితో కాదుకాని ఈ యుద్ధాన్ని కూడా ఆపారన్న సాటిస్‌ఫాక్షన్‌తో వెనక్కుపోదాం సార్‌ అన్న సెక్రెటరీ మాటలు మొదటిసారి కరెక్టుగా తోచాయి సారువారికి. ఐతే పద వెనక్కు అన్నాడు. అటు ఇరాన్‌ మాత్రం తగ్గకుండా గురజాడవారి లంగరెత్తుము గేయాన్ని పాడుకుందిలా….

ఉసురులకు విసికితివొ? యుద్ధము
కలదు; దేశము కొరకు పోరుము.”
యుద్దమా? ఇకనేమి లోకము!
చాలు! చాలును! లంగరెత్తుము, అని. ఉత్తరగాలులకు పెద్ద దెబ్బే ఇది.

దేశంలో ఉత్తరగాలుల విషయానికొస్తే, మేము చెప్పిందే వేదమనే రోజులు ఇక చెల్లవని చెప్పారు. దక్షిణలాగ ఇస్తే తీసుకోవాలి కాని దిమాండ్‌ చేసే వీలు దక్షిణాణికి లేదా అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడి ముఖ్యమంత్రులు. మా హక్కులు, మా ఓట్లు రక్షించుకుంటాం అని భీష్మించుక్కూర్చున్నారు కూడా. భక్తులు మాత్రం తమ నిబద్దతను తెలుపుకుంటున్నారు, నిలుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో వీళ్లకూ ఎదురవుతాయి గుణపాఠాలు. ఇప్పుడు అన్యాయాన్ని ప్రశ్నించనివాళ్లను అంతే న్యాయంగా ఇళ్లకు పంపుతారు. మహిళల బిల్లులో బోల్తా పడ్డ అమాత్యులు ఇక తమ ఎత్తుగడలు మార్చారు. ఒకపక్క ఎన్నికలు జరుగుతుంటే రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా బిల్లుపెట్టి బొక్కబోర్లాపడి తాము కోరుకున్న బిల్లులను పక్కన పెట్టారు. మహిళలకు అన్యాయం చేస్తారా అని కొత్త పాట ఎత్తుకుంటారట. అధికారశక్తి కోసం మహిళాశక్తి అని నాటకాలు ఆడబోతే దేశప్రజలందరికీ మణిపూర్‌ మహిళ ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. ఉత్తరాదిలో సీట్లు పెంచుకొని దక్షిణాన అందరూ నోరు లేనోళ్లే అనుకున్నట్టుంది. అందుకే అందరూ గళం విప్పారు ప్రధాన ప్రతిపక్షంతో సహా. ఇప్పుడు నోర్లకు పనిపెడతారు నినాదాల మీద నినాదాలిస్తారు.

కార్మికులపై నల్లచట్టాలు తెచ్చి వాటిని అమలుపరుస్తామని చెప్పినోళ్లకు బ్లాక్‌ డేలు దర్శనమిచ్చాయి. దేశం నిండా ఎర్రజెండాలు రెపరెపలాడాయి. తమ ఉత్తర రాష్ట్రంలోని నోయిడాలోనే కార్మికులు రోడ్లమీదికొచ్చి ఉద్యమాలు చేస్తున్నారు, ఎండల్ని సైతం లెక్కచేయకుండా. ఆ ఉద్యమకారులనే కాదు వాటిని చూస్తున్న జనంపైన, మహిళలపైన కూడా దాడులు చేస్తున్నవారికి మహిళాశక్తి పై గౌరవముందంటే ఎవరైనా నమ్ముతారా? కొన్ని కోర్కెలు అంగీకరించామని పైకి చెబుతూ ఇంకా మోసం చేస్తే జనం ఊరుకోరు ముఖ్యంగా కార్మికులు. ఉత్తర గాలులకు ఇదీ ఓ పెద్ద ఎదురు దెబ్బే.
దక్షిణ గోగ్రహణం లాగా చేయతలపెట్టిన దక్షిణ ఓట్ల గ్రహణాన్ని తిప్పికొట్టి ఉత్తర ఓట్లగ్రహణం సంఘటితంగా చేశారు. తమ మిత్రుడు ఆసియా ఖండంలోనే అత్యంత ధనికుడైనరోజే ప్రపంచంలో మన జి.డి.పి ర్యాంకు ఆరోస్థానానికి పడిపోయింది. దీనికి కారణం యుద్ధం చేస్తున్న మిత్రుడేనని మరువరాదు.

అది చాలదన్నట్టు పార్లమెంటు సాక్షిగా జరగరాని ఘోరం జరిగిపోయింది. కాగల కార్యం గంధర్వులే చేస్తారని ఎవ్వరూ ఎదురు చూడలేదు, కలిసికట్టుగా గర్వమణచారు. మాకు ప్రజల మద్దతు ఉంది, రానున్న కాలంలో కూడా కాగల కార్యం మేమే చేస్తాం అని మునుముందుకు సాగుతున్నారు. ఆవైపుగా ఇది విజయమే కాదు పెద్ద పాఠం నేర్పారు. అక్కడ ఉత్తర అమెరికాలో కూడా పెద్దపెద్ద ఉపన్యాసాలిస్తున్న ట్రంపులవారు కూడా తోక ముడిచి ఇంటిదారి పట్టాడు. కుస్తీ పోటీలో కిందపడ్డవాడు పైనున్నవాడిపైన చేయి పెట్టి నాదే పైచేయి అన్నాడట పాత కాలంలో. అలాగుంది ఆయన పరిస్థితి. మిత్రులు కూడా ఎన్నోరోజులు అన్యాయానికి వంతపాడరని తెలిసిపోయింది. ఈ సూత్రం ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుందని గుర్తుంచుకోవాలి. వల్చర్‌ ఈటింగ్‌ హండ్రెడ్‌ బఫెల్లోస్‌ వన్‌ సైక్లోన్‌ ఫినిష్‌ అన్నట్టు వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క తుపానులో కొట్టుకుపోయింది, అన్నది శంకర్‌దాదా ఇంగ్లీషు డైలాగు.

జంధ్యాల రఘుబాబు
9849753298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -