ఉత్పత్తి చక్రాలు తిరుగుతుంటే, లాభాల గణాంకాలు పెరుగుతుంటే, స్టాక్ మార్కెట్లు ఎగబాకుతుంటే వాటి వెనుక కనిపించని చేతులు కార్మికులవే. ఫ్యాక్టరీ గేట్ల వద్ద చెమటోడ్చే ఆ చేతులు లేకుండా యంత్రం కదలదు. పరిశ్రమ నడవదు. ఆర్థిక వ్యవస్థ నిలబడదు. కానీ, అదే కార్మికుడి జీవితం మాత్రం కనీస వేతనం లేక, హక్కులు లేక, భద్రత లేక అవమానాలతో నిండిపోవడం దేశంలోని అభివృద్ధి నమూనాకు మచ్చ. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా కార్మికులు చేపట్టిన పోరాటం ఈ అవమానాలకు, అసమానతలకు గట్టిగా ఇచ్చిన సమాధానం. ఓవైపు యాజమాన్యం బెదిరింపులు, మరోవైపు సర్కార్ అరెస్టులు, ఇంకోవైపు అణచివేతల సవాళ్లు- ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎత్తిన పిడికిలి దించకపోవడం అభినందనీయం. కార్మిక ప్రభంజనాన్ని చూసి ప్రభుత్వానికే వణుకు పుట్టింది. చివరకు చర్చలకు దిగొచ్చింది. అయితే, కేంద్ర బీజేపీ సర్కార్ లేబర్‌కోడ్స్ అమలు నేపథ్యంలో ఉవ్వెత్తున ఎగిసిన ఈ ఉద్యమం పాలకులకు ఓ గుణపాఠం. కాగా, కార్మికవర్గానికి ఇదొక పాఠం.
ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న నోయిడా దేశంలోనే పేరెన్నికగల పారిశ్రామిక ప్రాంతం. దేశీ, విదేశీ కంపెనీలకు లాభాల కేంద్రంగా నిలుస్తోంది. మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి, మొబైల్లో వాడే పరికరాల వరకు అక్కడి నుంచే సరఫరా అవుతాయి. ఆటో మొబైల్స్, టెక్స్టైల్, గిడ్డంగులు, లాజిస్టిక్, చిన్న పరిశ్రమల తయారీ యూనిట్లు- ఇలా ఎన్నో రంగాల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. కానీ, వీరిలో శాశ్వత కార్మికులు చాలా తక్కువ. కాంట్రాక్టు కార్మికులు ఎక్కువ. పొడిగించిన పని గంటలు, కనీస వేతనం చెల్లించకపోవడం, ఈఎస్ఐ-పీఎఫ్ మోసాలు, హక్కుల అణిచివేత, మహిళా కార్మికులపై అవమాన ప్రవర్తన, చిన్నతప్పుకే తొలగింపులు వంటి సమస్యలతో ఈ పారిశ్రామిక ప్రాంతం నిత్యం సతమతమవుతోంది. కంపెనీలకు లాభాలు పెరిగినా కార్మికుల ఆకలి-వ్యవస్థ నిజస్వరూపాన్ని వెల్లడిస్తోంది. కనీస వేతనం అనే పదం చట్టంలో ఉన్నా అది కాగితాలకే పరిమితమవ్వడం ఓ భౌతిక వాస్తవం. పైగా ఓవర్ టైమ్ పనిచేసినా సరైన చెల్లింపులు లేకపోవడం, సెలవులు నిరాకరించడం శ్రమదోపిడీకి తార్కాణం.
ఈ అసమానతల పర్వమే వారిని ఉద్యమానికి ఉసిగొల్పింది. పెరిగిన ద్రవ్యోల్బణం, ఇళ్ల అద్దెలు, ఆహార ధరలు, పిల్లల చదువులు, వైద్యం ఖర్చులు కార్మికులకు మోయలేని భారాలైన నేపథ్యంలో కార్మికులు సంఘటితమై, తమ బతుకులు మార్చుకోవాలని పోరుబాట పట్టారు. మే తొమ్మిదిన వందలాది మందితో ప్రారంభమైన ఈ సమ్మె పదమూడో తేదీ వరకు యాభైవేలకు చేరి ఉగ్రరూపం దాల్చింది. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ యాజమాన్యం బెదిరింపులకు దిగింది. మూడువందల మందిని నిర్భందించింది. వారిపై అల్లర్ల కేసులు పెట్టింది. ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయించింది. అయినప్పటికీ ఉద్యమం వెనుకడుగు వేయకపోగా, మరింత ముందుకు కదిలింది. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ స్వయంగా కార్మికులను విడుదల చేయాలని నడిరోడ్డుపై ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి భయం పట్టుకుంది. నిర్భంధించిన వారిని విడుదల చేయకతప్పలేదు. అయినా, జీతం పెంచాలని, చట్టబద్ధ హక్కులు కల్పించాలని అడగడం నేరమా? ఆద్యంతం యాజమాన్యాల తీరు అణచివేతకు పరాకాష్టగా నిలిచింది. కార్మికులు ప్రశ్నిస్తే బెదిరింపులు, సస్పెన్షన్లు, గేట్పాస్ల నిలిపివేత, బ్లాక్ లిస్టులు, ప్రయివేట్ భద్రతా దళాల ద్వారా హెచ్చరికలు.. ‘ఉద్యోగం కావాలంటే నోరుమూసుకుని పనిచేయి’ అన్న ధోరణినే ఇది ప్రతిబింబిస్తోంది.
ఇక్కడ డబులింజన్ సర్కార్ పాత్ర మరింత ప్రశ్నార్థకం. రాజ్యాంగం ఇచ్చిన సంఘటితమయ్యే హక్కు, నిరసన హక్కు, సమ్మె హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వాలు యాజమాన్యాలకు భద్రతా కవచాలుగా మారడం శోచనీయం. కార్మికులు హక్కుల కోసం అడిగినా, కార్మికశాఖకు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా చర్యలు శూన్యం. అదే సమ్మెకు దిగితే మాత్రం అరెస్టులు, కేసులు. కనీస వేతనం ఇప్పించడంలో విఫలమయ్యే పాలకులు కార్మికుల నిరసనను అణచడంలో మాత్రం అత్యుత్సాహం చూపటం ఎవరి ప్రయోజనాలకు? లేబర్‌కోడ్స్ నేపథ్యంలో ఈ పోరాటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కార్మికచట్టాలను సరళీకరణ పేరుతో ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చిన కేంద్రం, వాస్తవానికి యాజమాన్యాలకు తొలగింపుల స్వేచ్ఛ, తనిఖీల సడలింపు, కాంట్రాక్టు విధానాలకు మార్గం సుగమం చేసింది. పనిగంటలు పెంచడం, యూనియన్ ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించడం, సమ్మెలపై పరిమితులు, ఇవన్నీ కార్మికుల హక్కులపై దాడులే. ఇప్పుడు చర్చల పేరుతో రంగంలోకి దిగిన సర్కార్ సమస్యల్ని పరిష్కరిస్తుందా? అన్నది కూడా అనుమానమే. కానీ, అణచివేతలు, అవమానాల నుంచి పుట్టిన ఉద్యమం సంఘటిత శక్తి మారడమే ఒక విజయం. ‘పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప’ అన్న కార్ల్‌మార్క్స్ నినాద స్ఫూర్తికి ఇదొక నిదర్శనం. అందుకే, నోయిడా కార్మికుల పట్టుసడలని పోరాట దీక్షకు అభినందనలు.
నోయిడా సందేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



