Sunday, April 19, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమేనా?

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమేనా?

- Advertisement -

ష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 2026 జనవరి 31 నాటికి 38,419 మంది కార్మికులు వున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి సుమారు 59 వేల ఉద్యోగులు వుండగా 12 సంవత్సరాలలో 20,500 మంది తరిగిపోయారు. డిసెంబర్‌ 2025 నాటికి 12,878 మంది డ్రైవర్లు, 16,718 మంది కండక్టర్లు, 4,670 మంది మెకానికల్‌ సిబ్బంది, 1332 మంది క్లరికల్‌ సిబ్బంది ఉన్నారు. అద్దె బస్సు డ్రైవర్ల సుమారు 6800 మంది, విద్యుత్‌ బస్సు డ్రైవర్లు సుమారు 1700 మంది ఉన్నారు. వీరుకాక సుమారు పది వేల కాంట్రాక్ట్‌ కార్మికులు పని చేస్తున్నారు. పర్మినెంట్‌ కార్మికులకు 2021, 2025 పే స్కేల్స్‌ ప్రకటించలేదు. 2017 పేస్కేలు అరియర్స్‌ చెల్లించడం లేదు. అద్దె, విద్యుత్‌ బస్సుల డ్రైవర్లు అధిక పని భారం, కనీస వేతనం లేకపోవడం, బోనస్‌, పిఎఫ్‌, ఈఎస్‌ఐ తదితర చట్టబద్ధ సౌకర్యాలు అమలు కాకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ సంస్థ బస్సు డ్రైవర్లు, అద్దె బస్సు డ్రైవర్లు, విద్యుత్‌ బస్సు డ్రైవర్లు, ఆర్టీసీ కండక్టర్లు, ఇతర కార్మికులు, సిబ్బంది, ఎలక్ట్రికల్‌ బస్సు మెయింటెనెన్స్‌ కార్మికులు అందరూ ఐక్యమై పోరాటం చేయకుండా, విజయం సాధించలేరు. ఆర్టీసీలోని అన్ని యూనియన్లతో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పడాలి. మూడు పద్ధతుల్లో నడుస్తున్న బస్సులు ఆర్టీసీ సొంత బస్సుల, అద్దె బస్సుల, ఎలక్ట్రికల్‌ బస్సుల డ్రైవర్లు కలిస్తేనే సమ్మె పోరాటం చేయాలి.

సమ్మె అంటే కార్మికులు పని బంద్‌ చేయడం మాత్రమే కాదు. రవాణా స్తంభించాలి. బస్సు స్టీరింగ్‌, చక్రం ఆగిపోవాలి. ప్రయివేటు డ్రైవర్లు, ప్రయివేటు టికెట్‌ ఇషఉ్యయింగ్‌ వ్యక్తులు, శక్తులు పనిచేయడానికి వస్తే అడ్డుకోవాలి. ప్రేక్షక పాత్ర వహించ కూడదు. సమ్మె అంటే పని బందు చేసి డిపోలో ముందు, బస్టాండ్లలో కూర్చోవడం కాదు. రవాణా బందు జరగాలి. సమ్మె కార్మికుని జన్మ హక్కు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం, యాజమాన్యాలు పోటీ కార్మికులను ప్రోత్సహిస్తే… వారిని అడ్డుకోవడం కూడా కార్మికుల హక్కు అవుతుంది. రవాణా స్తంభించకుండా సమస్యలు పరిష్కారం కావు. టీజీఎస్‌ ఆర్టీసీలో 2026 జనవరి 31 నాటికి ఆర్టీసీ సంస్థ బస్సులు 6594, అద్దె బస్సులు 3396, విద్యుత్‌ బస్సులు సుమారు 810 మొత్తం 10185 బస్సులు ఉన్నాయి. రాబోయే కాలం విద్యుత్‌ బస్సులదే. ఈ విద్యుత్‌ బస్సులను కొనుగోలు చేసే అధికారం ఆర్టీసీ లకు లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎం.వి.యాక్ట్‌-2019, విద్యుత్‌ బస్సుల విధానం వల్ల ఆర్టీసీలు తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొం టున్నాయి. విద్యుత్‌ బస్సుల వల్ల ఆర్టీసిలు కనుమరుగై, ప్రయివేటు కార్పొరేట్‌ కంపెనీలు మాత్రమే ఆర్టీసిలో మిగిలే పరిస్థితి వుంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్‌ బస్సుల పథకాలన్నీ కూడా గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌ (జిసిసి) పద్ధతిలో ఉన్నాయి. బస్సుల కొనుగోలు, నిర్వహణ,ఆపరేషన్‌ అన్ని ప్రయివేటు కార్పొరేట్‌ కంపెనీలే చూస్తాయి.

ఆర్టీసీలకు ఎటువంటి పాత్ర వుండదు. ప్రతి నెలా ఆ విద్యుత్‌ బస్సుల కంపెనీకి డబ్బులు చెల్లించడం మాత్రమే చేయాలి. విద్యుత్‌ బస్‌ విధానంలో మార్పులు చేయాలని, అన్ని ఆర్టీసినే చేసేలా చర్యలు తీసుకోవాలని, ఆర్టీసిల ఆదాయానికి ఖర్చుకు మధ్య వున్న వ్యత్యాసాన్ని ప్రభుత్వాలు రీ-ఎంబర్స్‌ చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. విద్యుత్‌ బస్‌ డ్రైవర్స్‌ పారిపోవ డమా? ఫైట్‌ చేయడమా? ఎన్నో ఆశలతో ట్రైనింగ్‌ తీసుకొని ఎలక్ట్రికల్‌ బస్సు డ్రైవర్లుగా చేరుతున్నారు. తీరా ఉద్యోగంలో చేరిన తర్వాత, అరకొర వేతనాలు అసౌకర్యాలు పని ఒత్తిడి (12 నుండి 14 గంటలు), మానసిక ఒత్తిడి, టార్చర్‌ భరించలేక ఉద్యోగాలు మానేస్తున్నారు. ఈ వ్యవస్థలో తరతమా తేడాలతో ఇంకో చోటికి జాబ్‌ కోసం వెళ్లిన ఇదే పరిస్థితిలో ఉంటాయి. అందుకే ఎలక్ట్రికల్‌ బస్సు డ్రైవర్లు, సిబ్బం ది పని మానేయడం పరిష్కారం కాదు.హక్కుల కోసం పోరాడాలి. ప్రభుత్వ రంగం అంటే ప్రకృతి వనరుల నుండి పనిముట్లను ఉపయోగించి సరుకులను ఉత్పత్తి చేసి, చౌక ధరలకు ఉత్పత్తులను (సరుకులను) ప్రజలకు అందించడం. అందులో పని చేసే కార్మికులకు (ప్రజలలోని ఒక భాగం) ఉన్నత స్థాయి సగటు జాతీయ ఆదాయంగా వేతనాలు, సౌకర్యాలు పొందడం. ఈ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర పాలకులు క్రమ పద్ధతిలో దెబ్బతీస్తున్నారు. ఇప్పటికే 70శాతం దెబ్బతిన్నది.

ప్రభుత్వ రంగ సంస్థలలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానం పెరిగింది. అతి తక్కువ వేతనాలు, నామమాత్రపు సౌకర్యాలతో కార్మికుల పనిచేస్తున్నారు. వీటి ఉత్పత్తుల, సర్వీసుల ధరలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, వనరులు కొద్దిమంది పెట్టుబడిదారుల ప్రయోజన కోసం ఉండాలి. ఉద్యోగాలు పర్మినెంట్‌/ రెగ్యులర్‌ పద్ధతిలో ఉండకూడదు. ఉత్పత్తులు/ సరుకులు అధిక ధరలకు అమ్ముకుని పెట్టుబడుదారులు సొమ్ముచేసుకోవాలి. ఇవే కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వ విధానాలు. ఈ విధానాలకు తిప్పి కొట్టడమే కార్మికవర్గ కర్తవ్యం. ఆర్టీసీ కార్మికులు ప్రస్తుతం పొందుతున్న హక్కులు, కార్మిక చట్టాలు ఏవి కూడా మీరు పోరాడి సాధించినవి కాదు. మీ ముందు తరాల కార్మిక వర్గం పోరాడి సాధించిన చట్టాల ఫలితాలు. ఈ తరం సంఘటిత కార్మిక వర్గం అనుభవిస్తున్నది. 1926కు ముందు ట్రేడ్‌ యూనియన్‌ యాక్ట్‌ (1926) లేదు. అయినా కార్మిక సంఘాలున్నాయి, పోరాటాలు చేశాయి. పారిశ్రామిక వివాదాల చట్టం, బోనస్‌ చట్టం, పిఎఫ్‌ చట్టం, గ్రాట్యూటీ చట్టం, సర్వీస్‌ కండిషన్స్‌ యాక్ట్‌, ఎం.వి యాక్ట్‌ తదితర కార్మిక చట్టాలు మన ముందుతరం కార్మికవర్గం పోరాడి సాధించినవే.

ఈతరం కార్మికులు అనుభవించారు, అనుభవిస్తున్నారు. ఇప్పటికే కార్మిక చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తున్నాయి, సవరణలు చేస్తున్నాయి. కొన్ని సంవత్సరాలలో రిటైర్‌ అయ్యేవాళ్లం మాకెందుకులే అని ఊరుకుందామా! మనకోసం,మన పిల్లల భవిష్యత్తు కోసం, మనముందు తరాల భవిష్యత్తు కోసం పోరాడమా! పెట్టుబడిదారి ప్రయోజక ప్రభుత్వాలముందు మోకరిల్లడమా! తేల్చుకోవాల్సిన సమయం ఆర్టీసీ కార్మికులకు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులకు ఆసన్నమైంది. నిరంతరం ప్రయాణికులతో (ప్రజలతో) ఉంటాం అంటారు కానీ, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ప్రజలను ఎప్పుడైనా చైతన్యం చేశారా? బస్సెక్కిన ప్రజలను ఉద్దేశించి పది నిమిషాలు మాట్లాడండి! ప్రయాణికులకు ప్రతి ఒక్కరికి కరపత్రాలు పంచండి! మీరు తలుచుకుంటే నాలుగు రోజులలో యాభై లక్షల మంది ప్రజలను ఉద్దేశించి మాట్లాడగలరు.

యాభై లక్షల కరపత్రాలు పంచగలరు. ఇది మా పని కాదు, కార్మిక నాయకుల పని అనుకుంటున్నారా? కడుపునొప్పి కార్మికులకు వస్తే! యూనియన్‌ నాయకులు టాబ్లెట్లు వేసుకోవాలా? అయినా సమ్మెలు, కార్మికఉద్యమాలు యూనియన్ల నాయకులు చేస్తే జరగవు. కార్మికులు సిద్ధమైతేనే పోరాటాలు జరుగుతాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఆర్టీసీ కార్మికులారా సమ్మెకు సిద్ధమవుతున్నారా! బస్సు స్టీరింగ్‌, బస్సు చక్రం, టికెట్‌ ఇష్యూయింగ్‌ మిషన్‌ డిపో దాటిబయటకు రాకూడదు. పోలీసులు జోక్యం చేసుకుంటారని, కేసులు పెడతారని, లాఠీచార్జ్‌ చేస్తారని, జైల్లో పెడతారని భయపడుతున్నారా? 28 వేలమంది ఆర్టీసీ కార్మికులను, మరో పదకొండు వేలమంది అద్దె బస్సు, ఎలక్ట్రికల్‌ బస్సు కార్మికులను అరెస్టు చేసి జైల్లో పెట్టే శక్తి రేవంత్‌ రెడ్డి సర్కారుకు ఉన్నదా! బస్సులను ఆపడానికి సిద్ధమైతేనే సమ్మెకు దిగండి. లేదంటే ఆందోళనలు, ఇతర పోరాటాలు నిర్వహించండి. కార్మికుల పోరాడాలి. యూనియన్లు దిక్సూచిగా ఉండాలి.లొంగుబాటు, అవకాశవాద నాయకులను ఎండగట్టాలి.

గీట్ల ముకుందరెడ్డి
9490098857

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -