నవతెలంగాణ-హైదరాబాద్: ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రోజుతో(మంగళవారం) ఎన్నికల ప్రచారం ముగియనుంది. తాజాగా సదురు ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ఓ సామాజిక వర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్రంలోని తిరుప్పూర్ జిల్లా బోయనాయక్ సామాజిక వర్గం అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. బోయనాయక్ సమన్వయ సంక్షేమ సంఘం మంగళవారం తారాపూర్ రోడ్డులోని కోవిల్వాళి ప్రాంతంలో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సంఘం అధ్యక్షుడు అలగైయన్ అధ్యక్షత వహించారు.
“తిరుప్పూర్ జిల్లాలోని మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాలలో మా సామాజిక వర్గానికి చెందిన 80,000 మంది ఓటర్లు ఉన్నారు. కానీ ఏ పార్టీ కూడా మాకు రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా, ఏ రాజకీయ పార్టీ కూడా మా మద్దతు కోరలేదు. అందువల్ల, మేము ఈ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నాము. ఈ ఎన్నికల్లో మేము ఎవరికీ ఓటు వేయదలచుకోలేదు,” అని ఆ సామాజిక వర్గం పేర్కొంది.



