‘స్వాతంత్య్రానంతరం కూడా మన దేశ సామాజిక, మేధో ప్రపంచంలో కొద్దిమంది ఇంగ్లీషు మాట్లాడే ఉన్నత తరగతుల వ్యక్తుల ఆధిపత్యం చాలాకాలం పాటు కొనసాగింది. స్థానికంగా ఎప్పటి నుంచో ఆధిపత్య వర్గాలుగా ఉంటూ స్థానిక భాషలను ఉపయోగించేవారిలో ఒక తరగతిలో దీనిపట్ల వ్యతిరేకత తలెత్తింది. తమను చిన్నచూపు చూస్తున్నారని, పక్కకు నెట్టివేస్తున్నారని వారిలో కలిగిన భావాలు వారిని భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గేందుకు దోహదం చేశాయి.’…సామాజిక ఆలోచనాపరుల్లో కొందరిలో ఈ విధమైన అభిప్రాయం ఉంది. అంటే కొద్దిమంది ఇంగ్లీషుభాష మాట్లాడుతూ దేశ వ్యవహారాల మీద ఆధిపత్యం చెలాయిస్తున్న ఉన్నత వర్గాల వారిమీద తిరుగుబాటుకు బీజేపీ ప్రాతినిధ్యం వహించగలిగింది అని అనుకోవాలి. ఈ అభిప్రాయంలో కొంత వాస్తవం ఉండవచ్చు కూడా. మన చర్చ కోసం ప్రస్తుతానికి ఈ వాదనతో మనమూ అంగీకరిద్దాం.
కొద్దిమంది ఆంగ్లభాష మాట్లాడుతూ పెత్తనం చెలాయించే వారి ఆధిపత్యాన్ని బద్దలు కొట్టడానికి మార్గం విద్యను, ముఖ్యంగా ఉన్నత విద్యను ప్రజాస్వామీకరించడం. అప్పుడు చాలా ఎక్కువ మందికి నాణ్యత కలిగిన చదువు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు కొద్దిమంది ఆధిపత్యం బలహీనపడిపోతుంది. ఇంతవరకూ అటువంటి నాణ్యత కల చదువుకు దూరంగా నెట్టబడ్డవారి భావోద్వేగాలను బీజేపీ ఉపయోగించు కున్నప్పుడు ఆ పార్టీ నాణ్యతగల విద్యను అంతకంతకూ విస్తృతంగా ఎక్కువమంది ప్రాంతీ య భాషల వారికి అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకుని వుండాలి. తనవైపు ఆకర్షించబడిన వారికి అందుబాటు లో ఉండేలా మరెన్నో నాణ్యత కలిగిన విద్యా సంస్థలను ప్రారంభించి వుండాలి. కాని బీజేపీ ప్రభుత్వం ఈ పని మాత్రం చేయడం లేదు. దాని దృష్టి యావత్తూ నాణ్యత కల విద్యను నాశనం చేయడం మీదే ఉంది తప్ప విద్యను ప్రజాస్వామీకరించడం మీద లేనేలేదు.
ఉన్నత విద్యారంగంలో ఉన్న కొద్దిపాటి నాణ్యతగల సంస్థల్లో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఒకటి. దానిలో విద్యార్థు లను చేర్చుకునే విధానం అన్ని తరగతులవారికీ అవకాశాలు కల్పించేదిగా ఉంది. అందుచేత అది కేవలం కొద్ది మంది ఉన్నత వర్గాల వారికి మాత్రమే కాక ప్రాంతీయ భాషలలో చదువుకున్నవారికి కూడా ఎక్కువ అవకాశాలు కల్పించగలిగింది. అటువంటి సంస్థలను ప్రోత్సహించడం పోయి, దాన్ని ధ్వంసం చేయడానికి పూను కుంది బీజేపీ ప్రభుత్వం. విద్యారంగాన్ని ప్రజాస్వామీకరించాలంటే అందుకు బడ్జెట్లో కేటాయింపులు పెంచాలి. కాని బీజేపీ ప్రభుత్వం విద్యారంగానికి తన బడ్జెట్లలో పెద్ద మొత్తాల్లో కోతలు పెడుతోంది. విద్యను ప్రయివేటీకరించడం దాని లక్ష్యంగా ఉంది. ఆ ప్రయివేటు చదువు ఎంత ఖరీదైనదిగా అయిపోయిందంటే కొద్దిమంది ఉన్నత తరగతులకు చెందినవారు తప్ప తక్కిన సామాన్య తరగతుల నుంచి వచ్చిన విద్యార్థులకు ఆ విద్యాసంస్థల పొలిమేరల్లోకి కూడా అడుగుపెట్టగల స్థోమత లేకుండా పోయింది.
గతంలో కొద్దిపాటి సంఖ్యలో మాత్రమే ఉన్నత విద్యా సంస్థలుండేవి. అవి కొద్దిమంది ఉన్నత వర్గాల వారికి మాత్రమే నాణ్యతగల చదువును అందించేవి. ఇప్పుడు అటువంటివి మరికొన్ని వచ్చాయి. అవి కూడా కేవలం ఉన్నత వర్గాల వారికి మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఇవి తయారు చేస్తున్న ఉన్నతవర్గ మేథావులు గతంలోని వారికన్నా కొంత విభిన్నంగా ఉంటారు. కావాలనే అటువంటివారిని ఈ సంస్థల్లో తయారు చేస్తున్నారు. ఉన్నత విద్యకు దూరంగా నెట్టబడిన వర్గాలవారు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గితే ఇప్పుడు బీజేపీ మరింత కచ్చతో వారిని నాణ్యత కలిగిన ఉన్నత విద్యకు మరింత దూరంగా నెట్టివేస్తోంది. స్వాతంత్య్రానంతర కాలంలో కన్నా మరింత అన్యాయంగా వారి పరిస్థితి బీజేపీ హయాంలో తయారైంది.
విద్యారంగాన్ని ప్రజాస్వామీకరించే ఎజెండా అటకెక్కింది. ప్రభుత్వ విద్యాసంస్థలు నిధుల లేమితో కునారిల్లు తున్నాయి (వాటిలో చాలాకాలం నుంచీ నియామకాలు జరగకపోవడంతో అక్కడ బోధన దాదాపుగా జరగడమే లేదు). ఎక్కడైనా బోధనా సిబ్బందిని నియమిస్తే వారిని ఎంపిక చేయడానికి వారి సామర్ధ్యం, అర్హతలు ప్రాతిపదికగా కాక వారు హిందూత్వ ఎజెండా పట్ల ఎంత విధేయతతో ఉంటారన్న ప్రాతిపదిక పాటించడం జరుగుతోంది. దానితో బాటు బోధనాంశాల్లోంచి చాలాఎక్కువ భాగాలను తొలగించివేస్తున్నారు. అలా తొలగించ డానికి విద్యావిషయిక ప్రమాణాలు ప్రాతిపదికగా లేవు (చాలా పాఠశాలల్లో మొఘల్ పాలనా కాలాన్ని చరిత్ర పాఠాల్లోంచి తొలగించివేశారు). దాంతో ప్రభుత్వ విద్యాసంస్థల విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. ఇక ప్రయివేటు విద్యా సంస్థల విషయాన్ని చూస్తే వాటిలో చాలా పేరు ప్రతిష్టలున్నవి, ఖరీదైనవి సైతం ఉద్యోగాల మార్కెట్ అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నాయి తప్ప విద్యార్థులకు అవసరమైన విజ్ఞానాన్ని బోధించడం మీద కాని, వారిలో ఒక విమర్శనాత్మక దృక్పధాన్ని పెంపొందించడం మీద కాని దృష్టి పెట్టడమే లేదు. దాని ఫలితంగా దేశంలో విమర్శనాత్మక ఆలోచనా ధోరణి నాశనం అయిపోతోంది. దానర్థం మొత్తం విద్యంతా నాశనమైపోతోందని మౌలికంగా గ్రహించాలి.
ఇంగ్లీషు మాట్లాడే కొద్దిమంది బడాబాబులను మాత్రమే తయారుచేసే విద్యావిధానాన్ని ఇంతకు ముందున్న ప్రభుత్వాలు అమలు చేశాయని, అత్యధిక ప్రజానీకాన్ని నాణ్యతగల విద్యకు దూరం చేశాయని చెప్పి మద్దతు కూడగట్టుకున్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యను ప్రజాస్వామీకరించే బదులు మొత్తం విద్యావ్యవస్థనే నాశనం చేసే విధంగా ఎందుకు వ్యవహరిస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం నయా ఫాసిజంలో ఉండే ప్రాథమికమైన స్వభావంలో ఉంది. కొద్దిమందికి మాత్రమే ఆధిక్యత ఉందంటూ ప్రజల్ని కూడగట్టుకోవడం, ఆ తర్వాత ఆ కొద్దిమంది ఉన్నత తరగతులకు మాత్రమే అనుకూలంగా వ్యవహరించడం నయా ఫాసిజం లక్షణం. దేశంలో కొద్దిమందిగా ఉన్న గుత్తపెట్టుబడిదారుల కోసం మాత్రమే పని చేయడం ఫాసిస్టు, నయా ఫాసిస్టు శక్తుల స్వభావం. అంటే బొత్తిగా నిజాయితీ లేకుండా వ్యవహరించడమే నయా ఫాసిజపు మౌలిక విధానం.
1930ల నాటి జర్మన్ ఫాసిజం తన సిద్ధాంతాన్ని ”జాతీయ సోషలిజం” అని ప్రకటించుకుంది. బడా పెట్టు బడిదారులతో చాటుమాటుగా కుమ్మక్కు అవుతూనే, బయటకు మాత్రం వారి మీద కారాలూ మిరియాలూ నూరింది. ఒకసారి అధికారం రాగానే బహిరంగంగానే అదే బడా పెట్టుబడిదారులతో లింకులు పెంచుకుంది. అంతవరకూ అదే వర్గం మీద విరుచుకుపడిన ఫాసిజం ఒక్కసారి ఇలా నిజస్వరూపాన్ని బయటపెట్టగానే, దాన్ని ప్రశ్నించిన మద్దతు దారులనందరినీ కట్టగట్టుకుని అంతం చేసింది. ”విచ్చుకత్తుల రక్తపాతపు రాత్రి”గా ఆ సంఘటన చరిత్రలో నమోదైంది.
ఇప్పుడు మన దేశంలో విద్యారంగంలో అదే తరహా నయవంచన అమలౌతోంది. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తు తుంది. గుత్త పెట్టుబడిదారీ వర్గం కోరిన ఎజెండాను మాత్రమే బీజేపీ అమలు చేస్తున్నప్పుడు విద్యారంగాన్ని నాశనం చేయాలని గుత్తపెట్టుబడిదారీ వర్గం ఎందుకు కోరుకుంటోంది? అసలు ఇప్పుడు విద్యారంగంలో నాశనం అవుతున్నది ఏమిటి? ప్రస్తుతం సాంకేతిక విద్య, నైపుణ్యం నేర్పడం అనేది ఉరుకులు, పరుగులమీద కొనసాగుతోంది. అదే సమయంలో సమాజం గురించి, దాని నడక గురించి ఎటువంటి పరిజ్ఞానాన్నీ కల్పించడం లేదు. ఇప్పుడు ఉనికిలో ఉన్న వ్యవస్థ గురించి భజన చేయడం తప్ప సమాజంలో జరుగుతున్న పరిణామాలను విమర్శనాత్మకంగా ప్రశ్నించడానికి విద్యావ్యవస్థలో చోటు లేకుండా పోతోంది. అలా ప్రశ్నించడం పట్ల కన్నెర్ర చేస్తున్నారు.
గుత్త పెట్టుబడికి నైపుణ్యం ఉన్న కార్మికులు కావాలి. ఆ అవసరాన్ని తీర్చడానికే ప్రయివేటు సంస్థలు పని చేస్తున్నాయి. కాని గుత్తపెట్టుబడికి సామాజిక చైతన్యం అంటే ఎంత మాత్రమూ సహించదు. సామాజిక చైతన్యం అంటేనే ప్రస్తుత స్థితిగతులను విమర్శనా త్మకంగా పరిశీలించడం, వాటిని ఏ దిశగా, ఎలా మార్చాలా అన్నది చర్చించడం. అందుచేత దానిని అత్యంత ప్రమాదకర మైనదిగా గుత్త పెట్టుబడిదారీ వర్గం పరిగణిస్తుంది. ప్రముఖ మార్క్సిస్టు మేధావి పాల్బరన్ ఒక సందర్భంలో ”మేధావులు” వేరు, ”తెలివిగల కార్మికులు” వేరు అంటూ ఒక తేడాను సూచించారు. గుత్త పెట్టుబడి పెత్తనం కింద ఉన్నత విద్యాసంస్థలు నడుస్తున్న కాలంలో అవి ”మేధావులను” తయారు చేసే బదులు ”తెలివైన కార్మికులను” మాత్రమే తయారు చేస్తాయి. ఈ ”తెలివైన కార్మికులు” గుత్త పెట్టుబడి అవసరాల మేరకు మాత్రమే నడుచుకుంటారు. అదే ”మేధావు” లైతే ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. ఆ ప్రజానీకం నిజమైన స్వేచ్ఛ పొందే మార్గాలను చూపిస్తారు. ఈ రెండు రకాల వారి మధ్య ఉన్న కీలకమైన తేడా ఏమిటంటే విమర్శనాత్మకంగా సమాజాన్ని పరిశీలించడం. ఈ విమర్శనాత్మక చైతన్యాన్ని చంపేయడమే గుత్త పెట్టుబడిదారులకు అవసరం. అందుచేత వాళ్ల హయాంలో నడిచే విద్యాసంస్థలకు విమర్శనాత్మక చైతన్యాన్ని కాలరాయడమే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది.
మన దేశంలో నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం మొదలు పెట్టడంతోబాటే విద్యా వ్యవస్థను ధ్వంసం చేయడం అనేది మొదలైపోయింది. వాస్తవానికి నయా ఉదారవాదానికి అదే ప్రధాన ఎజెండాగా ఉంది. వైద్య సేవలను, విద్యను ప్రయివేటీకరించడం నయా ఉదారవాద విధానాలలో చాలా ముఖ్యమైనది. ఇక్కడ విద్య ప్రయివేటీకరణ అంటే అంతవరకూ ప్రభుత్వం ద్వారా అభించే ఒకానొక వస్తువు ఇప్పుడు ప్రయివేటురంగం ద్వారా పొందడమే అని భావించడం తప్పు. విద్యను ప్రయివేటీకరించడం అంటే ఆ విద్య అనే వస్తువు స్వభావాన్నే పూర్తిగా మార్చివేయడం అని గ్రహించాలి (ఎప్పటి నుంచో సేవా దృక్పథంతో స్థాపించబడి నడుస్తున్న పాత విద్యా సంస్థలు మాత్రం దీనికి మినహాయింపు). విద్య ప్రయివేటీకరిం చబడడం అంటే లాభాలను తెచ్చిపెట్టే సరుకును ఉత్పత్తి చేయడం. అలా వచ్చిన లాభాలను తిరిగి అదే విద్యా సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టవచ్చు. అంతమాత్రాన ఆ విద్యా సంస్థల స్వభావం మారిపోదు. అవి లాభాల కోసం చదువును ఒక సరుకుగా అమ్ముకునే సంస్థలుగానే ఉంటాయి.
ఒకసారి విద్య నేర్పడం అన్నది సరుకు అయిపోయాక, అలా నేర్పడం ద్వారా ఉత్పత్తి అయ్యేవి (చదువు పూర్తి చేసుకున్నవారు) కూడా సరుకులుగానే మార్కెట్లోకి అడుగుపెడతాయి. వాళ్లు పొందిన జ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయడం అనే లక్ష్యం పోయి, పూర్తిగా స్వప్రయోజనాల కోసమే పని చేయడం, స్వంతం గురించి మాత్రమే ఆలోచించడం, మరింత ఎక్కువ ఖరీదుకు తమ శ్రమను కొనగలిగేవారికి తమనుతాము ఎలా అమ్ముకోవడమా అని వెంపర్లాడడం వారి లక్షణాలుగా ఉంటాయి. ఆ విధంగా విద్యావ్యవస్థ స్వభావంలోనే మౌలికమైన మార్పు వస్తుంది. విద్యారంగం నుంచి విమార్శనాత్మక దృష్టి అనేది నిష్క్రమిస్తుంది.
నయాఫాసిజం ఈ పరిస్థితిని మరింత ముందుకు కొనసాగిస్తుంది. నిజానికి నయా ఉదారవాద వ్యవస్థ నడకే అంతిమంగా నయాఫాసిజానికి దారితీస్తుంది. నయా ఉదారవాద విధానాల ఫలితంగా ఆదాయాల్లో, సంపదలో అసమానతలు చాలా తీవ్రంగా పెరిగిపోతాయి. తమ వద్ద సంపద అపరిమి తంగా పోగుబడినా, దానిలో అతికొద్ది భాగాన్నే వాళ్ళు ఖర్చు చేయగలుగుతారు. కనుక సమాజంలో సరుకులు కొనగలిగే శక్తి సంపద కేంద్రీకరణ ఫలితంగా తగ్గిపోతూ వుంటుంది. అందు వలన అధికోత్పత్తి సంక్షోభం, ఆర్థిక మాంద్యం తలెత్తుతాయి. దానితోబాటే నిరుద్యోగమూ తీవ్ర స్థాయికి చేరుతుంది. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడే నయా ఉదారవాదానికి నయా ఫాసిజంతో దోస్తీ అవసరం అవుతుంది. ఆ దోస్తీ ద్వారా తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని గుత్తపెట్టుబడి కోరుకుంటుంది. అది నయా ఫాసిజం అధికారంలోకి రావడానికి దారితీస్తుంది.
నయా ఉదారవాద విధానాల ఫలితంగా ప్రారంభమైన విద్యావ్యవస్థ విధ్వంసాన్ని నయా ఫాసిజం మరింత పకడ్బందీగా కొనసాగిస్తుంది. ప్రభుత్వ రంగంలోని విద్యా సంస్థలకు నిధులు లేకుండా ఎండబెట్టిన పరిస్థితితోబాటు ఆ విద్యార్ధుల మెదళ్లలో హిందూత్వ మట్టిగడ్డలను ఎక్కించడం మొదలౌతుంది. ప్రశ్నిం చడం అప్పుడు ఏకంగా నేరమే అవుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల్లోనూ అదే పరిస్థితి తలెత్తుతుంది.
గత ప్రభుత్వాల పాలనలో కొద్దిమంది ఇంగ్లీషు భాష మాట్లాడగలిగిన బడాబాబుల్ని తయారు చేయడానికి మాత్రమే విద్యావ్యవస్థ పనిచేసిందంటూ నిప్పులు చెరిగిన నయా ఫాసిస్టులు ఆ బడా బాబుల పెత్తనాన్ని లేకుండా చేస్తారా అంటే అటువంటిదేమీ లేదు. ఇప్పుడు తేడా ఏమిటంటే గతంలో ఉన్న బడా బాబుల స్థానంలో ఇప్పుడు కొత్త తరహా ఇంగ్లీషు మాట్లాడే బడా బాబులు, అది కూడా విమర్శనాత్మక శక్తి నశించిన, బుర్ర లేని వారు వస్తున్నారు.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్



