Friday, April 24, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఇరాన్‌ టార్గెట్‌ అదేనా?

ఇరాన్‌ టార్గెట్‌ అదేనా?

- Advertisement -

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ జరుపుతున్న యుద్ధంలో ఇప్పటివరకు చమురు క్షేత్రాలపై దేశాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఇరాన్‌ హార్ముజ్‌ జలసంధి ద్వారా వెళ్లే చమురు సరఫరాలను అడ్డుకోవటం వలన ప్రపంచం ఇప్పుడు తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనికి పూర్తి బాధ్యత అమెరికాదే! అకారణంగా యుద్ధాన్ని ప్రజలపై రుద్దింది ఆ దేశమే కాబట్టి. ఇప్పటికే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అయితే జరిగింది. కానీ, ఓడిపోతున్నామనే ఆందోళనలో ట్రంప్‌ రోజుకో వ్యాఖ్య, పూటకోమాట మాట్లాడుతున్నాడు. నిన్న మొన్న చేసిన వాదనల్లో ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తామని, ఇప్పటికే ఆ దేశ రేవులను దిగ్భందించామని చెబుతున్నాడు. ఈ మాటల యుద్ధం ఇలాగే కొనసాగితే పర్వాలేదు. చేతల వరకు వెళ్తేనే మరో సమస్య మొదలవుతుంది. ఎందుకంటే, సముద్రగర్భంలోని ఇంటర్నెట్‌ కేబుల్స్‌ను ధ్వంసం చేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. నిజానికి వారం రోజుల్లో లొంగిపోతుం దనుకున్న దేశం అమెరికాను ప్రతిఘటిస్తూ పోరాడుతూ ప్రపంచాన్నే తమవైపు తిప్పేలా చేసుకుంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ యుద్ధం దిశ మార్చుకుంటే గ్లోబల్‌ ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోతాయా?అన్న సందే హం ఇప్పుడు అందరిలో నెలకొంది. సముద్ర కేబుల్స్‌ ఇరాన్‌ టార్గెట్‌ అయితే గనుక అమెరికానే కాదు, చాలాదేశాలు పెద్ద చిక్కుల్లో పడినట్లేనని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ఇది జరిగినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, 2024లో హౌతీ దళాలు ఇజ్రాయిల్‌-హమాస్‌ మధ్య తిరుగుబాటు సమయంలో ఎర్ర సముద్ర వద్ద ఇంటర్నెట్‌ కేబుల్స్‌కు నష్టం కలిగించాయి. తద్వారా ఆసియా, ఆఫ్రికాలో ఇంటర్నెట్‌ స్పీడ్లు గణనీయంగా తగ్గాయి, మరమ్మతులకు నెలల కాలం పట్టింది. హార్మూజ్‌ ద్వారా ఇప్పటివరకు చమురు నౌకలే వెళ్తాయని అందరూ అనుకుంటున్నారు. కానీ, ప్రపంచ ఇంటర్నెట్‌ కేబుల్స్‌లను తీసుకెళ్లే ముఖ్యమైన సముద్రగర్భ ఇంటర్నెట్‌ కేబుల్స్‌ కూడా ఆ జలసంధి గుండానే వెళ్తాయి. వీటికి ఏదైనా నష్టం జరిగితే ఇంటర్నెట్‌ అంతరాయాలు ఏర్పడవచ్చు, భారత్‌తో సహా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడవచ్చు. ఈ ఇంటర్నెట్‌ కేబుల్స్‌ ప్రపంచ ఇంటర్నెట్‌ను నడిపే దాదాపు అన్ని డేటాను తీసుకెళ్తాయి. అవి సెల్‌ఫోన్లు, వెబ్‌సైట్లు, బ్యాంకులు, స్టాక్‌ మార్కెట్లు, హాస్పిటల్స్‌, వీడియో కాల్స్‌, ఈమెయిల్స్‌, బ్యాంకింగ్‌ ట్రాన్స్‌ఫర్లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీసెస్‌ ఇలాంటివి ఉన్నాయి. అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి కంపెనీలు యూఎఈ, సౌదీ అరేబియా వంటి గల్ఫ్‌ దేశాల్లో భారీ డేటా సెంటర్లను నిర్మించడానికి బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టాయి. ఈ ప్రాంతాన్ని తదుపరి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌గా మార్చాలని ప్లాన్‌ చేశాయి. సముద్రగర్భ ఇంటర్నెట్‌ కేబుల్స్‌ ఈ సెంటర్లను ఆసియా, ఆఫ్రికా ఖండాల మార్కెట్లతో అనుసంధానించపడి ఉంటాయి. ఖండాంతరాలలోని డేటా సెంటర్లను కలపడానికి, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ డేటా (సమాచారం) ప్రవహించేలా చేయడానికి సముద్ర మార్గం చాలా అనుకూలమైన మార్గం. ఇప్పుడు అది కూడా పోతే బాధ్యత అమెరికానే కదా వహించాల్సింది.

ఇప్పటికే యుద్ధంలో ఇరు దేశాల్లోని ప్రజాసముదాయాలకు భారీ నష్టం వాటిల్లుతోంది. దాన్ని పునర్మించుకోవాలంటే మన లెక్కన వేల కోట్ల రూపాయలు అవసరం. అందుకే అమెరికా దాడిలో నష్టపోయిన ఇరాన్‌, ఆ లోటును పూడ్చుకోవడానికి హార్మూజ్‌ జలసంధి నుంచి వెళ్లే నౌకామార్గాలకు సుంకాలను విధిస్తోంది. ఇది దేశాలకు అమెరికా తీసుకొచ్చిన అదనపు భారం. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయిల్‌ల ఆయువు పట్టు అయిన సముద్ర కబుల్స్‌మీద ఇరాన్‌ కేంద్రీకరిస్తే గనుక అమెరికా గుండెల్లో గునపం దిగినట్లేనని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, నేలపై పోలిస్తే ఇంటర్నెట్‌ సముద్ర మార్గం ఖండాల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. భూమి మా ర్గాలు ఖండాల చుట్టూ తిరగడం, బహుళ దేశాలను దాటడం, కొండలు, ఎడారులను దాటి వెళ్లడం వలన దూరం పెరుగుతుంది. తద్వారా ఇంటర్నెట్‌ వేగం తగ్గుతుంది. సముద్రగర్భ కేబుల్స్‌ అతి తక్కువ మార్గాన్ని కలిగి ఉంటాయి. క్లౌడ్‌ సేవలు, వీడియో కాల్స్‌, గేమింగ్‌, ఫైనా న్షియల్‌ ట్రేడింగ్‌లకు ఆలస్యాన్ని తగ్గిస్తాయి. తొంభైతొమ్మిది శాతం అంతర్జాతీయ ఇంటర్నెట్‌ డేటా సముద్ర గర్భ కేబుల్స్‌ ద్వారా ప్రయాణిస్తుంది, ఉపగ్రహల ద్వారా కాదు.

చైనా కూడా ప్రపంచంలోనే మొట్టమొదట సముద్రనీటి అడుగున డేటా సెంటర్‌ను హైనాన్‌ ప్రావిన్స్‌ తీరంలో గతేడాది ప్రారంభించింది. మైక్రోసాఫ్ట్‌ 2018లో సముద్ర అడుగున ‘ప్రాజెక్ట్‌ నాటిక్‌’ అనే ప్రయోగాత్మక ప్రాజెక్టును చేపట్టగా అది విజయవంతం కాలేదు. డిజిటల్‌ సేవలకు సముద్రాలు సురక్షితమైనవి, అనుకూలమైనవని శాస్త్రజ్ఞులు భావిస్తున్న తరుణంలో ఇరాన్‌ హెచ్చరికలతో ఇప్పుడు ఆందోళనలో పడ్డారు. అయితే అమెరికా చర్చలను సానుకూల దృక్పథంతో అంగీకరిస్తే ఎలాంటి సమస్య ఉండదు. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ఇంటర్నెట్‌ లేకపోతే ప్రపంచమే స్తంభించిపోతుంది. అమెరికా మీద ఒత్తిడికి ఇంతకన్నా మార్గం ఇరాన్‌కు కనిపించలేదేమో? ఏదైనా యుద్ధం శాంతియుతంగా ముగియాలని ఆశిద్దాం.

శ్రీధరాల రాము
9441184667

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -