పొద్దు పొద్దునే రోడ్లపైన అంత గందరగోళంగా ఉంది. బైక్ లు, కార్లు, బస్సులు, వాటి హారన్లు ఇలా ఒకటే ల్లి ఇందులో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్వయంగా స్కూల్ దగ్గర దింపేవారు కొందరు నేరుగా సైకిల్ పైన వచ్చే పిల్లలు నడుస్తూ వచ్చే వాళ్ళు కొందరు.
‘రాములయ్య ఓ రాములయ్య..’ అంటూ ఉన్న మనవడిని పట్టుకొని నడుస్తున్న ఒక వయసయిన పెద్ద మనిషి చామన ఛాయా రంగు బక్కపలుచని శరీరం. నరాలు బయటకు తేలిన చేతులు, ముడతల చర్మంతో అచ్చమైన తెలుగు పంచ కట్టులో ఉన్న వ్యక్తి.
‘ఊ… చెప్పు నాయినా’ అన్నాడు తన మనవడిని చూస్తూ.
‘రాములయ్య.. ఓ రాములయ్య నువ్వెందుకే అందరిలాగా ప్యాంటు, షర్టు వేసుకోలే గిట్ల పంచ కట్టినవ్’
రాములయ్య తన చేత్తో తన బట్టలను తడిమి చూసుకొని ‘నాకు గిట్లనే ఇష్టం బేటా’
‘గట్లనే ఇష్టం అంటే’ అభి అడిగాడు.
‘ఇగో నీకు ప్యాంటు షర్టు ఇష్టం గదా గవి తీసి నాలెక్క ఏసుకోమంటే ఏసుకుంటవా’
‘ఛీ నేను గవ్వి ఎందుకేసుకుంటా రాములయ్య నాకు ఇట్లనే ఇష్టం’ మొకం తిప్పుకున్నాడు.
‘నీకెట్లనో నాకట్లనే ఉంటది’ అని చెప్పాడు.
మనవడు ఇంకేదో అడుగుదాంమంటే స్కూల్ వచ్చిందని తను వేసుకున్న బ్యాగ్ మనవడికి ఇచ్చి టిఫిన్ బాక్స్ బ్యాగ్ చేతిలపెట్టి ‘సరే సరే నువ్వు స్కూలుకెళ్లి అచ్చినంక మాట్లాడుకుందాం ఇప్పటికైతే పైలంగా పో నాయినా’ అని గేట్ లోపలకి పంపించిండు.
‘బారు రాములయ్య’ అంటూ తను వెళ్ళిపోయాడు.
సాయంత్రం ఇంటికి వెళ్లే అప్పుడు
‘రాములయ్య ఓ రాములయ్య’
‘ఊ చెప్పు నాయినా’
‘నాకు చాక్లెట్ కావాలే’ అంటే… సరే అని ఒక చాక్లెట్ ఇప్పించిండు. తింటూ ఎన్నో యక్షప్రశ్నలు వేస్తున్నా మనవడికి రాములయ్య తనకి తోచిన సమాధానం ఇస్తూ ఇంటికి తీసుకొని వెళ్ళాడు.
ప్రతీరోజు రాత్రి తిన్నాక మనవడు తాత కథ చెప్పే వరకు నిద్రపోడు.
అందరూ తిన్న తరువాత రాములయ్య హాల్ లో ‘ఈ టివి’లో 9 గంటలకు వచ్చే న్యూస్ చూస్తున్నడు. తన కొడుకు కూడా అక్కడే ఉండి లాప్ టాప్ లో ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు.
‘రాములయ్య ఓ రాములయ్య నా కథ ఏది రాములయ్య’ అంటూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ మనవడు వచ్చాడు.
పక్కనే కూర్చున్న తన కొడుకు కొద్దిగా కోపంగా ‘రేరు అభి… నీకెన్నిసార్లు చెప్పిన తాతని పేరు పెట్టి పిలవద్దని’ అంటాడు.
అనగానే అభి రాములయ్య ఒడిలోకి దూరి ‘చూడు రాములయ్య నిన్ను ఇట్లా పిలవద్దంటా’ అని అమాయకంగా లేడి పిల్లలా ముకం పెట్టిండు.
రాములయ్య ‘అరే నీకేం అయితున్నదిరా మా నాయిన పిలిచేటోడు గట్ల. ఇప్పుడు నా మనవడు పిలుస్తున్నడు. నువ్వు సప్పుడుదాక ఆ కంప్యూటర్‌ల ఏదో ఒత్తుకో’ అని అనగానే అభి వాళ్ళ నాన్నని చూసి చేతులు అడ్డం పెట్టుకొని ముసి ముసి నవ్వులు నవ్వాడు.
‘నువ్వే లాడు చేస్తున్నవ్ బాపు వాడిని’
‘నేను కాకపోతే ఇంకెవరు చేస్తరు. నువ్వు నీ పని చేసుకో మేము మా పని చేసుకుంటాం’
‘సరే మీరు ఏం అన్న చేసుకోండి’ అని తన పనిలో తాను మునిగిపోయాడు.
‘నాకు కథ చెప్తావా రాములయ్య’ అని అడిగాడు అభి.
‘ఊ చెప్తా.. ఏం కథ చెప్పాలే రాజుల కథ చెప్పాలా? దయ్యాల కథ చెప్పాలా? మాయ మంత్రాల కథ చెప్పాలా?’
‘నాకీరోజు హీరో కథ చెప్పు’ అంటాడు అభి రాములయ్యని చూస్తూ.
‘నాకే హీరో కథ తెల్వదు బిడ్డా’ అంటాడు రాములయ్య .
‘నా హీరో కథ చెప్పు నీకు తెలుసు’
‘నీ హీరో కథనా ఎవరబ్బా నీ హీరో’ అని ఆలోచిస్తుంటే
‘నా రాములయ్యనే నా హీరో’ అని రాములయ్య మీసం తిప్పాడు గర్వంగా అభి.
ఒక్కసారిగా రాములయ్యకి కన్లలో నీళ్లు తిరిగాయి. తన కొడుకు వైపు గర్వమైన నవ్వుతో చూసాడు. కొడుకు చిన్న నవ్వు నవ్వాడు.
‘నా కథ ఎందుకు బిడ్డా గిప్పుడు’
‘చెప్పు రాములయ్య నాకు తెల్వదు కదా’
‘సరే చెప్తా కానీ నువ్వు మధ్యల డౌట్ లు అడగొద్దు’
‘సరే అడగను లే రాములయ్య నువ్వు చెప్పు’ అంటాడు కానీ అభి కథ మధ్యలో రాములయ్యకి ఏదో ఒక డౌట్ అడుగుతూనే ఉంటడు.
‘మాది జోగిపేట ఆడ మదిరంగం అని ఉంటుండే. గాడ ఉండేటోళ్లం మేము’.
‘మదిరంగం అంటే’ ఇంక ప్రశ్నలు మొదలు.
‘అంటే ఏం చెప్పాలే అందరం ఆడకి వచ్చేటోళ్లం. ఆడ చాలామందిమి ఉండేటోళ్లం. మాట్లాడుకుంటుండే. ఆడ దానికి వాచ్ కూడా ఉంటుండే’
ఇట్లా చెప్తుంటే పక్కనుంచి కొడుకు ‘క్లాక్ టవర్’ అంటాడు.
అభి వెంటనే ‘ఓహౌ క్లాక్ టవర్ ఆ..’ అంటాడు.
‘హ గదే గదే’
‘మా అమ్మ నాయిన బట్టలు నేసేటోళ్ళు’
‘నేసేటోళ్ళు అంటే….’
‘నువ్వేసుకున్న డ్రెస్ లకి బట్ట తయారు చేసుడు’
‘ఓ సరే సరే.. ‘
‘నేను పద్నాలుగేళ్లకే బట్టలు నేసుడు నేర్చిన. మేము బట్టలు నేసి పెట్టి మీ నాయనమ్మ ఇంటికి పోతుండే. అప్పటికి ఇంకా మాకు పెండ్లి కాలే. పక్క రెండు గల్లీల అవతల ఉంటుండే వాళ్ళిల్లు. వాళ్ళింటికి పోయి ఇచ్చోస్తే వాళ్ళ నాయిన సైకిలు పైన బట్టలు పెట్టుకొని ఊరూరు తిరిగి అమ్ముకొస్తుండే. అమ్మినంక అమ్మినందుకు కొన్ని పైసలు తీసుకొని కొన్ని మాకు ఇస్తుండే. బట్టలు నేసుడు అవ్వగానే నేనే పోతా అంటుండే బట్టలించరానికి. అట్లనే మీ నాయనమ్మని చూసి వస్తుండే. గిట్ల రోజు పోతుంటే మీ నాయనమ్మ నన్ను చూసి నవ్వుతుండే నేను చిన్నగా నవ్వి వస్తుండే’
వెంటనే అభి ‘హే హే రాములయ్య లవ్వా’.
రాములయ్య చిన్నగా సిగ్గుపడుతూ… ఒకనాడు పెళ్లి సంబంధం అని మా నాయన మీ నాయనమ్మనే పెళ్లికూతురని చెప్పేటల్లకు నాకు పట్టరాని సంతోషం వచ్చే. ఇంకా ఏమున్నది మాటలల్ల మాటలు, అందరూ కలిసి పెళ్లి చేసింర్రు.
‘ఏంది రాములయ్య నీకు చైల్డ్ మ్యారేజ్ చేశారా’ అని అభి అడిగాడు.
‘మీ నాయనమ్మ ఎంత ఉంటది అనుకుంటున్నవ్?’
‘ఎంత?’ అభి ఆశ్చర్యంగా అన్నాడు.
‘నాకంటే నాలుగేళ్లు చిన్నది’ అని నవ్వాడు రాములయ్య.
‘అవ్వ చైల్డ్ మ్యారేజ్ ఇద్దరిదీ’ అన్నాడు అభి నోటిపై చేతులు పెట్టుకొని.
రాములయ్య చిన్నగా నవ్వి మళ్ళీ కథలోకి వెళ్ళాడు.
లాప్టాప్ ఆపేసి మరి వింటున్నాడు తన కొడుకు కూడా.
‘తర్వాత మీ నాయనమ్మ ఇంట్లో ఆసుపోసేది నేను నేస్తుంటే’
‘ఆసువోయడం అంటే?’
‘దారాన్ని ఒక కొయ్య నుంచి నలబై కొయ్యలకు తొమ్మిది వేల సార్లు చెయ్యి తిప్పితే ఒక చీర నేయడానికి దారం సిద్ధం అయితది. గా పని ఆడొల్లే చేసేటోళ్లు ఇంట్ల. ఆ దారాన్ని మగ్గంల వెట్టి బట్టలు నేస్తుండే’
‘మరి మగ్గం అంటే ఏంది రాములయ్య’ అడిగాడు అభి వెంటనే.
‘మగ్గం అంటే ఏం చెప్పాలి అంటే దారాలు అన్ని పెట్టి బట్టలు, చీరలు చేస్తాం దానిమీద’
అర్థం కానట్టు ముకం పెట్టాడు అభి.
వాళ్ళ నాన్న ‘ఏం లేదు అభి క్లాత్ రెడీ చేసే మిషన్’ అంటాడు.
రాములయ్య ‘ఆ… మిషన్ మిషన్’ అంటాడు.
‘ఓకే ఓకే’
‘కొన్ని దినాలకు నాకు సంఘంల పని దొరికింది. ఆడవోయి నేను మగ్గం మీద నేస్తుంటే మీ నాయనమ్మ కూడా అప్పుడప్పుడు రంగులద్దనీకే వస్తుండే’
‘సంఘం అంటే ఏంది?’
‘అంటే నేత నేసే వాళ్ళందరూ అక్కడికి వచ్చేటోళ్లు. ఆడ మగ్గాలు ఉండేటివి. వాటి మీద బట్టలు నేస్తే నెలకి ఇంత, చీరకి ఇంత అని పైసలిస్తుండే. నాకు ఒక మగ్గం ఇచ్చేది. దాని మీదనే నేస్తుండే నేను. ఎవ్వరు వచ్చినా ఆ మగ్గం మాత్రం ఇంకొళ్ళకి ఇయ్యకపోతుండే. ఆ మగ్గం అంటే నాకు చాలా ఇష్టం. ఎవ్వలని కనీసం ముట్టుకోనియ్యకుండే. దానిమీద రాములయ్య మగ్గం అని చెక్కిన’
ఈ విషయం చెబుతున్నప్పుడు రాములయ్య కళ్ళల్లో ఒక రకమైన గర్వం నిండింది.
‘అంత బావుంటదా రాములయ్య’
‘ఎట్లుంటది అనుకున్నవ్. మగ్గం నేసేటప్పుడు ఇనాలే ”చక్ చక్ టక్ చక్ చక్ టక్” అంటూ మస్తు ఉంటుండే పాటకి దరువు లెక్క’
‘ఇగ మీ నాయన, మేనత్త ఏడాదికొకరు పుట్టిన్రు. ఒకటే లొల్లి ఇంట్లో ఎప్పుడు వీళ్ళిద్దరిది అంటూ వాళ్ళ నాన్నని చూసాడు.
‘సంఘంలో నా సోపతి గాల్లు ఏం రా రాములు నీకు నీ మగ్గం ఎక్వనా నీ కొడుకు ఎక్వనా అంటే నేను నాకు పెద్ద కొడుకు మగ్గం, తర్వాతనే నా పిల్లలు అంటుండే. ఎందుకంటే నాకు నా బిడ్డలకు కూడు పెట్టేది గీ మగ్గం. గందుకే ఇగ మీ నాయన అత్త పెద్దగైనరు, కర్సులు పెరిగినరు. సంఘంలో వచ్చే పైసలు సరిపోతలే. సంఘంలో జీతం పెంచమంటే గిరాకీ లేనిది ఏడికి వెళ్లి ఇయ్యాలే అంటుండే’
‘ఎందుకు లేదు’ అన్నాడు అభి.
‘అప్పుడే గీ ప్యాంటు షర్టులు వచ్చినయి. గిరాకీ అంత లేకుంటుండే. కొంతమంది పైసలు చాలక మానేస్తుండే సంఘంలో. నేను మాత్రం ఎప్పుడు పోతుండే. నన్ను ఏం అనకుండా మీ నాయనమ్మ పొలం పనికి పోతుండే పైసలు లేక. నాకు మాత్రం సంఘంలో పని ఇడిసి పెట్టాలని ఉండకుండే. సంఘంలో రోజురోజుకీ గిరాకీ తగ్గుతున్నది, పైసలు వస్తలే. మెల్లమెల్లగా పని తగ్గుతున్నది. నేను మాత్రం రోజు పని ఉన్నా లేకున్నా సంఘం పోతుండే నా మగ్గాన్ని మంచిగా తుడిచి సాయంత్రం దాకా ఉండి వస్తుండే కొన్ని రోజులకు సంఘం పెద్ద ‘మనకు పని లేదు, సంఘం మూసేస్తున్నాం’ అన్నడు. నాకైతే కాళ్లు చేతులు ఆడలే. ఏం చేయాలో అర్థం కాలే. చాలా బతిమిలాడిన, మల్ల సంఘం తెరుద్దామని. కానీ ఎవ్వరూ ముందుకు రాలే. ఇగ నేను కూడా దొరికిన పనికి పోయిన. ఎంత పని చేసినా నాకు ఆ సంఘంలోనే ఉండాలనిపిస్తుండే. మీ అత్తకి అప్పు చేసి పెళ్లి చేసిన. పెళ్లి అయిందో లేదో, మీ నాయన పట్నం వచ్చి పని చూసుకున్నడు. అప్పుడు ఇన్ని ఇప్పుడిన్ని పైసలు పంపితే కూడవెట్టి అప్పులు కట్టినం. మీ నాయినకు మీ అమ్మని చూసి పెళ్లి చేసినం. ఇక వీళ్ళు పట్నంలో, మేము పల్లెల అట్లా ఉండి బతుకుతున్నాం’
‘రాములయ్య నువ్వెందుకు రాలే సిటీకి’ అన్నాడు అభి.
‘మీ నాయన మీ అమ్మ చాలా సార్లు రమ్మని బతిమిలాడింన్రు బిడ్డా. కానీ మాకే పల్లెనిడిసి రాబుద్ధి కాలే. అయినా ఆడ మేము బాగానే ఉండేది. మీ నాయనమ్మకి సుస్తి చేసింది.
‘అయ్యో ఏమైంది’ అమాయకంగా అడిగాడు అభి.
‘మీ నాయనమ్మ ఆసు వొస్తుండే కదా… బొక్కలు అరిగినయి అని దవాఖానకి తోల్కపోతే రంగులు అద్దుతుండే గదా, ఆ రంగులకు లోపల ఏమో కరాబైనయని అన్నారు. నాకు మగ్గం పని చేసుడు ఇష్టమని నన్ను పని ఒక్కసారి గూడ మానుమని అనలే. అదే పనికి పోతుండే. ఆకరికి దాని పానం గట్ల అయ్యింది. డాక్టర్లు చెప్పిండ్రు ఎంత ఖర్చు చేసినా ఏం చేయలేమని. డాక్టర్ సాబ్ చేతులెత్తేసిండ్రు. మీ నాయనమ్మ పోరాడి పోరాడి సచ్చింది’ అంటూ కళ్ళ నుండి వస్తున్న కన్నీటిని ఆపుకున్నాడు. ఇంకా ఆడ ఉండి ఏం చేస్తావ్ అని మీ నాయన పట్నం తోలుకొచ్చిండు బిడ్డా’ అన్నాడు.
అందరి ముఖాల్లో ఏదో తెలియని బాధ ఒకరినొకరు చూసుకున్నారు. అభి అప్పటికే రాములయ్య ఒడిలో పడుకున్నడు.
తర్వాత కొన్ని రోజులకు స్కూల్లో చేనేత మగ్గం అనే ప్రాజెక్టు ఇచ్చిండ్రు. అభి స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఒకటే తలుగుడు మగ్గం చూపియ్యు… నాకు ప్రాజెక్టు ఉన్నది అని. ‘ఇక్కడ లేవు బిడ్డ మన ఊరు పోవాలే’ అని ఎంత చెప్పినా వినలే.
అభి వాళ్ళ నాన్న ‘గూగుల్‌లో ఫొటోస్ వస్తాయి చూడు’ అన్నాడు.
అభి అవేం వినకుండా ‘నేను రాములయ్య మగ్గం చూస్తా. దానిపైనే ప్రాజెక్ట్ చేస్తా’ అని మారం చేసాడు.
రాములయ్య కొడుకుతో ‘చానా దినాలయ్యింది మన ఊరు పోయి వద్దాం’ అంటాడు.
‘ఇప్పుడు ఎందుకు బాపు అవసరమాయే’
‘అరే పోరడు గంతగనం అడుగుతున్నడు. పోదాం పా నాకు సుడాలని ఉంది’
అందరూ కలిసి జోగిపేట పోయింన్రు. సంఘం తాళం తెప్పించిండు రాములయ్య. మొత్తం పాడువడ్డది అది.
‘ఓపెన్ చెరు రాములయ్య ఓపెన్ చెరు’ అని అభి దుంకుతున్నడు.
తెరిచి ఇద్దరూ లోపలికి పోయిండ్రు మొత్తం బూజువట్టి ఉన్నది. ఎక్కడ మగ్గాలు అక్కడ పడి ఉన్నయి.
అభి ఫోన్తో ఫోటోలు తీస్తూ ఉన్నాడు. రాములయ్య ఒక్కో మగ్గాన్ని చూస్తూ తన పాత దోస్తులను పలకరించినట్టు తన చేతితో తాకుతూ ముందుకు పోతున్నడు. అభి రాములయ్య వెనకనే పోతూ ‘రాములయ్య నీ మగ్గం ఏది ఎక్కడుంది చూపియ్యు’ అంటూ వెళ్తున్నాడు.
రాములయ్య ఒక మగ్గం దగ్గరికి వెళ్లగానే ఆగిపోయాడు.
అభి ‘ఇదేనా నీ మగ్గం’ అని చూస్తూ అంటున్నాడు.
ఆ మగ్గం పైన సంఘం పాత బిల్డింగ్ కదా దాని పై కప్పు ఊడి దాని మధ్యల పడ్డట్టు ఉంది. మధ్యలోకి ఇరిగింది మగ్గం. అక్కడ ”రాములయ్య మగ్గం” అని రాసుంది. రాములయ్య ఆ మగ్గాని చేత్తో తాకుతూ కుప్పకూలిపోయాడు.
అభి ‘రాములయ్య ఏమైంది’ అన్నాడు.
రాములయ్య ఒక్కసారిగా గట్టిగా ‘అయ్యో నా మగ్గం ఇరిగిపాయే అయ్యో అయ్యో నా మగ్గం అంటూ ఏడుస్తున్నాడు.
అభికి భయం అవుతుంది ‘రాములయ్య ఎందుకు గట్ల ఏడుస్తున్నవ్. ఏడవకు ఏడవకు’ అంటూ రాములయ్యని పట్టుకున్నాడు.
కానీ రాములయ్యకు ఏడుపు ఆగట్లేదు ఏడుస్తూనే ఉన్నాడు. ‘అయ్యో ఇన్ని ఏండ్ల నుంచి నిన్ను ఒక్కసారి చూసిన పాపాన పోలె. అయ్యో మా మగ్గం’ అంటూ ఏడుస్తున్నాడు.
ఆ సప్పుడు బయట ఉన్న వాళ్ళ అమ్మానాన్న దగ్గరకు వెళ్ళింది. వెంటనే ఏమైంది అని వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు.
రాములయ్య మగ్గాన్ని పట్టుకొని ఏడుస్తున్నాడు. వెళ్లి ఎంత లేపిన లేవలేదు.
‘బాపు బాపు లేవు గట్ల చేయకే’ అంటూ లేపడానికి చూసాడు కొడుకు.
చూస్తే రాములయ్య మగ్గాన్ని పట్టుకొని ఒక చేత్తో గుండెని పట్టుకొని పడిపోయాడు.
‘బాపు బాపు’ అని పిలుస్తున్నడు కొడుకు.
అభికి అవి ఏం అర్థం కావట్లేదు. ‘ఏమైంది రాములయ్యకి ఎందుకు లేస్తలే ఏమైంది?’ అని అంటున్నాడు అభి కూడా ఏడుస్తూ.
‘ఇంక తాత మనకి లేడు రా’ అంటూ అభి వాళ్ళ నాన్న అంటూ బాపు బాపు అని ఏడవడం మొదలుపెడతాడు.
అభి మెల్లిగా రాములయ్య దగ్గరకు వెళ్లి ‘తాత నాకు ఏ మగ్గం వద్దు, ఏ కథ వద్దు. నాకు నువ్వు కావాలి తాత. లే తాత లే తాత డాడీ తాత’ అంటూ ఏడుస్తాడు. మగ్గంతో పాటు రాములయ్య ప్రాణం కూడా లేకుండా పోయింది.
కె సాయి కిరణ్, 9533146760



