Monday, February 23, 2026
E-PAPER
Homeదర్వాజమనిషి అంతరాల్లో మెదిలిన కథలు'శశివదనే...'

మనిషి అంతరాల్లో మెదిలిన కథలు’శశివదనే…’

- Advertisement -

సాహిత్యం అంటే కేవలం కథల సమాహారం కాదు, అది మనిషి అంతరాల్లో దాగి ఉన్న ప్రశ్నలకు అద్దం. కాలం, పరిస్థితులు, సంబంధాలు మనలో మిగిల్చే మౌనాలను అక్షరాలుగా మార్చే ప్రయత్నమే నిజమైన కథారచన. ఆ కోవలోనే నిలిచే కథల సంపుటి ‘శశివదనే…’. ప్రేమతో మొదలై, బాధ్యతల దగ్గర ఆగే మనుషుల ప్రయాణాలను, నమ్మకం అనుమానం మధ్య చీలిపోయే హదయాలను, త్యాగం పేరుతో మౌనంగా జరిగే ఓటములను ఈ సంపుటిలోని కథలు సున్నితంగా ఆవిష్కరిస్తాయి. అతి ఉపదేశం లేకుండా, భావోద్వేగాల ఆర్భాటం చేయకుండా, జీవితం ఎలా ఉందో అలా చూపించే నిజాయితీ ఈ కథల ప్రధాన బలం. చదువుతుంటే కథలు మనల్ని వదలవు, చదివిన తర్వాత కూడా మనతోనే నడుస్తాయి.

‘శశివదనే’ ప్రేమ కథగా మొదలై, జీవితం పెట్టే కఠిన ప్రశ్నల దగ్గర ముగుస్తుంది. ఫొటోగ్రఫీ అనే కళతో శశిరేఖ అందాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన విమల్‌, అదే అందం తనకు దూరమవుతుందన్న భయంతో ఆమె జీవితం మీద అనుకోకుండా ఆంక్షలు పెట్టడం ఈ కథ కేంద్రబిందువు. ప్రేమ, కలలు, ఆశలు అన్నీ ఉన్నా, చివరికి ఒక స్త్రీ తన స్వేచ్ఛను ప్రేమ పేరుతో వదిలివేయాల్సిన దశకు చేరడం పాఠకుడిని ఆలోచింపజేస్తుంది. గ్రామీణ నేపథ్యం, పాత్రల సహజ సంభాషణలు, కెమెరాను ప్రతీకగా మలిచిన తీరు కథకు బలాన్ని చేకూర్చాయి. ‘శశివదనే’ పెద్దగా హడావిడిగా, ఉపదేశం చేసేదిగా ఉండదు కానీ చదివిన తర్వాత చాలాసేపు మనసులో బలంగా నిలిచిపోయే కథ.

‘రాజు గారి కిరాణ కొట్టు’ ప్రేమకథగా మొదలైనా, సమాజం కొలిచే విలువలు ఎంత పొరపాటైనవో ఆవిష్కరించే గాఢమైన జీవనకథగా మారుతుంది. ప్రభుత్వ ఉద్యోగం, భద్రతల పేరుతో విడిపోయిన రాజు – కుమారి సంబంధం ఓటమితో ముగిసినట్టే కనిపించినా, కాలంతో పాటు రాజు వ్యక్తిత్వం మాత్రం మరింత పరిపక్వతను సంతరించుకుంటుంది. కిరాణా కొట్టును కేవలం వ్యాపార స్థలంగా కాక, సాటి మనిషికి అండగా నిలిచే ఆశ్రయంగా చూపిస్తూ రచయిత నిజమైన ప్రేమ అంటే పొందడంలో కాదు, వదిలేయడంలోనూ బాధ్యత వహించడంలోనూ ఉందని సూచిస్తాడు. అవసరంలో అబద్ధం చెప్పినవాడికీ చేయూతనిచ్చే రాజు స్వభావం, చివరికి జ్ఞాపకాలు కోల్పోయిన కుమారిని ఆదరించడంలో వ్యక్తమై, ప్రేమా మానవత్వాలూ కాలానికి లోబడని కథ. ఎలాంటి అతి భావోద్వేగాలకు తావు లేకుండా, సున్నితంగా మనిషితనం విలువను గుర్తుచేసే ఈ కథ పాఠకుడ్ని లోతైన ఆలోచనలోకి నడిపిస్తుంది.

‘ఆటో మెకానిక్‌ రమేష్‌’ కులం, అంతస్తు, అహంకారం వంటి సామాజిక గోడల మధ్య నలిగిపోయిన ప్రేమకు, నమ్మకానికి ప్రతీకగా నిలిచే కథ. వానలో మొదలైన మౌనప్రేమ, ‘బాకీ’… జీవితంలో మనం లెక్కపెట్టుకునే బాకీలు డబ్బుతో ముగిసేవి కావు; జ్ఞాపకాలుగా, మొహమాటాలుగా, చివరికి చెప్పుకోలేని బాధగా మిగిలిపోతాయి అనే సత్యాన్ని మదువుగా, లోతుగా చెప్పే కథ. ఆదివారం రోజు తనలో మొదలైన ప్రశ్న, కాలేజీ రోజుల తీపి జ్ఞాపకాలు, ఉద్యోగ జీవితంలోని రాజీ, స్నేహం అనే అనుభూతి బలాన్ని గుర్తుచేస్తూ పాఠకుణ్ని సహజంగా గతంలోకి తీసుకెళ్తుంది. మోహన్‌ పాత్ర స్నేహం అంటే లెక్కలు కాదని, సమయానికి చేయూతనిచ్చే మనసేనని తెలియజేస్తే, తండ్రి పాత్ర ద్వారా రచయిత ఎప్పటికీ తీర్చలేని ఏకైక బాకీ ప్రేమేనని గుండెకి తాకేలా చెపుతాడు.
‘తీరని కోరిక’… జీవితం ముందుకు సాగిపోతున్నా, మనసు మాత్రం అప్పుడప్పుడూ వెనక్కి తిరిగి చూసే జ్ఞాపకాలతోనే జీవిస్తుందనే సున్నితమైన సత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన కథ.

‘ఒక ఫాతిమ’… ప్రేమ, త్యాగం, మానవత్వం ఈ మూడు భావాల మధ్య మనిషి ఎంత లోతుగా మారగలడో హదయాన్ని తాకేలా ఆవిష్కరించిన కథ. విఫలమైన ప్రేమను విషాదంగా మోసుకెళ్లకుండా, జీవితానికొక జ్ఞాపకంగా మార్చుకునే పరిపక్వతను రచయిత ఎంతో సహజంగా, భావోద్వేగాల ఆర్భాటం లేకుండా చిత్రించాడు. దుబారు నైట్‌ క్లబ్‌ నేపథ్యంగా సాగినా, కథ అసలు సారం శరీర సుఖంలో కాదు ఆడమనసును మనిషిగా గౌరవించే మగమనసులో ఉంది. ఫాతిమ పాత్ర ద్వారా రచయిత సమాజం తోసిపుచ్చిన ఒక స్త్రీ అంతరంగాన్ని, ఆమె నిస్సహాయతను, అదే సమయంలో ఆమెకు ఉన్న ఆత్మగౌరవాన్ని స్పష్టంగా చూపిస్తాడు. ప్రేమ అంటే పొందడమే కాదు, విడిచిపెట్టడమూ గొప్ప ప్రేమే అన్న సత్యాన్ని కథ చివరి మలుపు లోతుగా ఆవిష్కరిస్తుంది. తండ్రి చెప్పిన ప్రేమకథ కూతురి జీవితానికి దారి చూపడం ద్వారా, వ్యక్తిగత అనుభవం ఎలా మరొకరి జీవితాన్ని రక్షించగలదో రచయిత సున్నితంగా చెబుతాడు. చివర్లో వెలుగులోకి రాని నిజం కథకు మరింత లోతును, తీయని విషాదాన్ని జోడిస్తుంది. ఈ చదివిన తర్వాత ప్రేమపై మన దక్కోణం మారకమానదు. ప్రేమ ఓ గెలుపు కాదు; ఒక విలువ. ఓ ముగింపు కాదు; అది జీవితాంతం నిలిచే జ్ఞాపకం.

‘పెద్ద మనసు’… కథలో మణెమ్మ అనే సాధారణ, బలహీన కుటుంబ మహిళ తన కష్టకాలంలోనూ నిజాయితీ, ధైర్యం, కర్తవ్యబోధతో జీవిస్తూ, తన కుమార్తె భవిష్యత్తును ఆకాంక్షతో నడిపించడం, జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఓపికతో ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పాత్రలో వ్యక్తి తన స్వప్నాలు, కుటుంబ ఆశయాలు, సామాజిక అసమానతల మధ్య సమాజంలో నిజాయితీ, సౌందర్యం, నిస్వార్థతను గుర్తిస్తూ, రిజర్వేషన్ల పరమార్థాన్ని అర్థం చేసుకుంటాడు. కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు, ఒక సాధారణ మహిళ మనసులోని గొప్పతనం, దయ, సామాజిక బాధ్యతలలోని సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ, చదువునీ, జీవితానుభవానీ, మానవీయ బలాన్ని పాఠకుని మనసులో నిలిపేలా, హదయానికి తాకేలా తెరకెక్కిన కథ.
‘స్క్రీన్‌ టైమ్‌’లో రమణమ్మ అనే సాధారణ, కష్టపడే తల్లి, ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ, తన కూతురు శ్రీవల్లిని చదువులో విజయం సాధించేలా జాగ్రత్తగా మార్గనిర్దేశం చేస్తుంది. తల్లి ప్రేమ, కషి, సమయపాలనతో కూడిన స్ఫూర్తి, ఫోన్‌ లేదా ఆధునిక గ్యాడ్జెట్లు కేవలం సాధనమని మాత్రమే గుర్తు చేస్తుంది.
‘శశివదనే…’ కథాసంపుటి చదవడం అంటే ఇతరుల జీవితాలను చదవడం కాదు, మనమే మనల్ని మనం చదువుకున్న అనుభవం. ప్రేమలోని స్వార్థం, స్నేహంలోని ఋణం, కుటుంబాల్లోని మౌనత్యాగం, సమాజంలో మనిషితనానికి ఉన్న విలువ… ఈ అన్నింటినీ రచయిత మదువైన భాషలో, గుండెకి దగ్గరగా చెప్పగలిగాడు.
చక్కటి కథల సంపుటిని పాఠకులకు అందించిన మొగిలి అనిల్‌ కుమార్‌ రెడ్డిని హదయపూర్వకంగా అభినందనలు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో సాహిత్య సంకలనాలు అందించాలి.

గాజోజి శ్రీనివాస్‌, 9948483560

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -