నవతెలంగాణ-హైదరాబాద్ : ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం రాత్రి కేవలం నాలుగు గంటల్లోనే 100మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం ప్రభావంతో సబర్బన్ రైలు సర్వీసులకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వీణా నగర్‌లో అత్యధికంగా 160.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.
వర్షం కారణంగా అంధేరి ప్రాంతంలోని సబ్‌వే పూర్తిగా నీట మునిగింది. దీంతో ముందస్తు చర్యగా ఈ అండర్‌పాస్‌లో వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు బీఎంసీ వెల్లడించింది. మరోవైపు వాతావరణం అనుకూలంగా లేనందున విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది.



