15 మందికి తీవ్ర గాయాలు..
నవతెలంగాణ-పెబ్బేరు
మంత్రాలయం నుంచి వనపర్తికి వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు సోమవారం ఉదయం పెబ్బేరు సమీపంలోని జాతీయ రహదారి (NH-44)పై అదుపుతప్పి రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో సుమారు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఆ వెంటనే చికిత్స నిమిత్తం క్షతగాత్రులను హుటాహుటిన వనపర్తి, పెబ్బేరు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. కాగా, గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
క్షతగాత్రులను పరామర్శించిన మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్: ప్రమాద విషయం తెలియగానే పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పెబ్బేరు ప్రభుత్వ ఆస్పత్రి, సరోజిని ఆస్పత్రులను సందర్శించి, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులకు ఎలాంటి లోటు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని, అత్యవసర చికిత్సలు సకాలంలో అందేలా చూడాలని అక్కడి వైద్యులను కోరారు.



