Friday, July 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్ యుద్ధం నేపథ్యంలో…అమెరికా-సౌదీ సంబంధాలకు దెబ్బ

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో…అమెరికా-సౌదీ సంబంధాలకు దెబ్బ

- Advertisement -

వాషింగ్టన్ : ఇరాన్ యుద్ధం అమెరికా-సౌదీ అరేబియా సంబంధాలను దెబ్బతీస్తోంది. ఇరాన్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి అమెరికా సిద్ధమవుతోందంటూ వస్తున్న వార్తలు సౌదీని కలవరపెడుతున్నాయని వాల్‌స్ట్రీటa్ జర్నల్ పత్రిక తెలిపింది. వాస్తవానికి ఘర్షణలను మొదటి నుంచీ సౌదీ వ్యతిరేకిస్తూనే ఉంది. ఇరాన్ నాయకత్వాన్ని బలహీనపరచేందుకు చేసే ఏ ప్రయత్నమైనా ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తుందని, ఇంధన సరఫరాలను దెబ్బతీస్తుందని, హార్ముజ్ జలసంధి మూతపడేందుకు దోహదపడుతుందని చెబుతోంది. సౌదీ భయపడినట్లుగానే ఇవే పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా తన సైనిక స్థావరాలను, గగనతలాన్ని వినియోగించుకోవడాన్ని సౌదీ తొలుత వ్యతిరేకించింది. దీంతో అమెరికా చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ’ ఆపరేషన్ తాత్కాలికంగా నిలిచిపోయింది. సౌదీ వైఖరిపై ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి గగనతల రక్షణ వ్యవస్థల సరఫరాను జాప్యం చేస్తానంటూ హెచ్చరించారు. దీంతో సౌదీ చివరికి అమెరికాకు సహకరించేందుకు అంగీకరించింది. సౌదీతో నెలకొన్న విభేదాల కారణంగా అక్కడ తన సైనిక ఉనికిని కుదించుకోవాలని అమెరికా యోచిస్తోంది. ఇటీవలి దౌత్య పరిణామాలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీశాయి. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో గల్ఫ్ దేశాలైన కువైట్, బహ్‌రైన్, యూఏఈలలో పర్యటించారు. కానీ ఆయన సౌదీ వైపు కన్నెత్తి చూడలేదు. పైగా ఫ్రాన్స్‌లో జరిగిన జీ-7 సదస్సుకు సౌదీ యువరాజుకు ఆహ్వానం పంపలేదు. ఈ సమావేశానికి ట్రంప్ హాజరైన విషయం తెలిసిందే. ఇరాన్ క్షిపణి, డ్రోన్ స్థావరాలపై సౌదీ పరిమితంగానే దాడులు చేసింది. అలాగే ఇరాన్ కూడా సౌదీ ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేసింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న వివాదానికి దౌత్య పరిష్కారం సాధించేందుకు సౌదీ కూడా తన వంతు ప్రయత్నాలు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -