రష్యా ప్రతినిధి బృందానికి ఆహ్వానం
రాలీ : యూరోపియన్ యూనియన్ అభ్యంతరాలు, నిరసనలను పట్టించుకోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జీ-20 ఆర్థిక మంత్రుల సమావేశానికి రష్యా ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు. రష్యా ఆర్థిక మంత్రి ఆంటోన్ నిలునోవ్‌తో కలిసి సంప్రదాయ ‘ఫ్యామిలీ ఫొటో’ దిగేందుకు ఈయూ మంత్రులు ససేమిరా అన్నారు. అయినప్పటికీ ట్రంప్ వారిని ఏ మాత్రం పట్టించుకోలేదు. ట్రంప్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు జీ-20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు సోమవారం రెండు రోజుల సమావేశం నిమిత్తం ఉత్తర కరోలినా రాష్ట్రంలోని అష్విల్లేకు చేరుకున్నారు. 2022లో ఉక్రెయిన్ ఘర్షణలు తీవ్రమైన తర్వాత ఈ వేదికపై నిలునోవ్ కన్పించడం ఇదే మొదటిసారి కావడంతో యూరోపియన్ ప్రతినిధుల నుంచి నిరసన వ్యక్తమైంది. నిలునోవ్‌ను ఓ సాధారణ భాగస్వామిగా చూడాలన్న నిర్ణయం ఆందోళనకరమైన సంకేతమని జర్మనీ ఆర్థిక మంత్రి లార్స్ క్లింగ్‌బీల్ చెప్పారు. నిలునోవ్‌ను పక్కన పెట్టకపోతే ఫ్యామిటీ ఫొటోను బహిష్కరిస్తామని ఇతర ఈయూ మంత్రులు హెచ్చరించారు. అయితే ట్రంప్ ఈ హెచ్చరికలను తోసిపుచ్చారు. అందరితో కలసిపోవడం వల్లనే తాను విజయాలు సాధిస్తున్నానని ఆయన తెలిపారు. కాగా ఈయూ ప్రతినిధుల వైఖరికి భిన్నంగా నిలునోవ్‌తో అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్ బెస్సెంట్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యాను దౌత్యపరంగా ఏకాకిని చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల విషయంలో యూరోపియన్ మిత్రదేశాలతో ట్రంప్ విభేదిస్తూ వస్తున్నారు. డిసెంబరులో మయామీలో జరిగే జీ-20 నేతల శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరు కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈయూ నిరసనను పట్టించుకోని ట్రంప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



