Wednesday, September 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపట్టు జారుతోంది!

పట్టు జారుతోంది!

- Advertisement -

ఇండియన్‌ అమెరికన్లలో ట్రంప్‌ తీరుపై తీవ్ర వ్యతిరేకత
ఏఏపీఐ ఓటర్లదీ అదే దారి
ప్రజలను వెంటాడుతున్న సమస్యలు
మధ్యంతర ఎన్నికల్లో ప్రతికూలత తప్పదంటున్న సర్వేలు

వాషింగ్టన్‌ : అమెరికాలో నవంబర్‌ మూడవ తేదీన జరగబోయే మధ్యంతర ఎన్నికలు అధికార రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమొక్రాట్లకు అగ్నిపరీక్ష కాబోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో అధికార సమతూకాన్ని నిర్ణయించే ఈ ఎన్నికలు దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సవాలు విసురుతున్నాయి. ఎన్నికలలో విజయం సాధించి ట్రంప్‌ పాలనలో సాధించిన విజయాలకు మరింత బలం చేకూర్చాలని రిపబ్లికన్లు భావిస్తుండగా ప్రజలలో నెలకొన్న అసంతృప్తిని ఉపయోగిం చుకొని చట్టసభపై పట్టు సాధించాలని డెమొక్రాట్లు కోరుకుం టున్నారు. ఈ పోరులో భారతీయ అమెరికన్‌ ఓటర్లు (భారత్‌ నుంచి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడిన వారు లేదా వారి మూలాలు భారత్‌లో ఉండి అమెరికాలో జన్మించిన వారు) గణనీయమైన పాత్ర పోషించబోతున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికలలో వీరు ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో డెమొక్రాట్లకు ఉన్న పట్టు సడలిపోయింది. అయితే మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరిపిన ఓ సర్వే ప్రకారం భారతీయ అమెరికన్లు తిరిగి డెమొక్రాట్‌ అభ్యర్థులకే మద్దతు ఇస్తున్నారని స్పష్టమవుతోంది. అది కూడా స్వల్ప తేడాతో కాదు….భారీ సంఖ్యలోనే మద్దతు తెలుపుతున్నారు. వీరంతా ట్రంప్‌ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సర్వే ఏం చెబుతోంది ?
2026 ఆసియన్‌ అమెరికన్‌ ఓటర్‌ సర్వే ప్రకారం… సెనెట్‌ ఎన్నికలలో డెమొక్రాట్లకే మద్దతు ఇస్తామని 66 శాతం మంది భారతీయ అమెరికన్లు తేల్చి చెప్పారు. కేవలం 18 శాతం మంది మాత్రమే రిపబ్లికన్లకు మద్దతు తెలిపారు. ప్రతినిధిసభ ఎన్నికలలో డెమొక్రాట్లకు ఓటేస్తామని 66 శాతం మంది చెప్పగా రిపబ్లికన్లకు ఓటేస్తామని 22 శాతం మంది తెలిపారు. ఆసియన్‌ అమెరికన్‌-పసిఫిక్‌ ద్వీపవాసులు (ఏఏపీఐ-తూర్పు ఆసియా, ఆగేయాసియా, దక్షిణాసియా ప్రాంతాల మూలాలు ఉన్న వారు, పసిఫిక్‌ మహా సముద్రంలోని ప్రధాన భౌగోళిక ప్రాంతాలకు చెందిన వారు) కూడా డెమొక్రాట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. వీరిలో 60 శాతం మంది డెమొక్రటిక్‌ సెనెట్‌ అభ్యర్థులకు, 24 శాతం మంది రిపబ్లికన్‌ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు. ప్రతినిధులసభకు సంబంధించి 64 శాతం మంది ఏఏపీఐ ఓటర్లు డెమొక్రాట్లకు, 22 శాతం మంది రిపబ్లికన్లకు అనుకూలంగా ఉన్నారు. మధ్యంతర ఎన్నికలలో తప్పనిసరిగా ఓటు వేస్తామని 90 శాతం మంది ఏఏపీఐ ఓటర్లు చెప్పడం గమనార్హం. 2022లో 84 శాతం, 2018లో 86 శాతం ఏఏపీఐ ఓటర్లు ఓటు వేశారు.

ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఇవే
ఆసియా అమెరికన్‌ ఓటర్ల విషయానికి వస్తే వారిని ప్రభావితం చేస్తున్న ప్రధాన అంశం ఆర్థిక సమస్యలు. ఏఏఐపీ ఓటర్లను జీవన వ్యయం, ద్రవ్యోల్బణం తీవ్ర ఆందోళ నకు గురిచేస్తున్నాయి. ఈ రెండూ అత్యంత ప్రధాన సమస్యలని 90 శాతం మంది తెలి పారు. ఆరోగ్య సంరక్షణ విషయంలో కూడా ఏఏఐపీ ఓటర్లు తీవ్రంగా కలత చెందు తున్నారు. 82 శాతం మంది దీనిని ప్రధాన సమస్యగా పరిగణిస్తున్నారు. ఇక సామాజిక భద్రత, మెడీకేర్‌ వంటి అంశాలు కూడా ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. విద్య, నేరాలు, ప్రజల భద్రత, యుద్ధం, విదేశాంగ విధానం వంటి విషయాలు కూడా ముందుకు వస్తున్నాయి. ఆసియా అమెరికన్‌ ఓటర్లు అనేక కీలక అంశాలలో రిపబ్లికన్ల కంటే డెమొక్రాట్లనే ఎక్కువగా నమ్ముతున్నారని సర్వేలు చెబు తున్నాయి. అమెరికాలో అత్యంత వేగంగా అభి వృద్ధి చెందుతున్న ఓటింగ్‌ వర్గాలలో ఏఏఐపీలు కూడా ఉన్నారు. దీంతో వీరి మద్దతు పొందేందుకు రిపబ్లికన్లు తీవ్రంగా ప్రయత్ని స్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో 16 మిలియన్ల ఏఏఐపీ ఓటర్లు ఉంటారని అంచనా.

బలపడుతున్న ఇండియన్‌ అమెరికన్‌ సమాజం
అమెరికా ఓటర్లలో ఇండియన్‌ అమెరికన్‌ సమాజం రోజురోజుకూ ఓ ముఖ్యమైన భాగంగా మారుతోంది. అమెరికా సెన్సెస్‌ బ్యూరో డేటా ప్రకారం 2023 నాటికి అమెరికాలో సుమారు 52 లక్షల మంది ఇండియన్‌ అమెరికన్లు భారతీయులుగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ఈ సమాజం అటు రిపబ్లికన్లకు, ఇటు డెమొక్రాట్లకు కీలకంగా మారింది. ఆర్థిక పరమైన ఆందోళనలు, ఆరోగ్య సంరక్షణ, విదేశాంగ విధానం, వలసలు, జాత్యాహంకారం వంటి అంశాలు ఓటర్ల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నందున భారతీయ అమెరికన్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేటప్పుడు వీటన్నింటినీ బేరీజు వేసుకునే అవకాశం ఉంది.

పెరుగుతున్న అసంతృప్తి
2024 ఎన్నికలలో భారతీయ అమెరికన్లు ట్రంప్‌కు ఓటేసినప్పటికీ ఇప్పుడా పరిస్థితి లేదు. ‘2026 ఇండియన్‌ అమెరికన్‌ యాటిట్యూడ్‌ సర్వే’ పేరిట నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 71 శాతం మంది భారతీయ అమెరికన్లు ట్రంప్‌ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 29 శాతం మంది మాత్రమే ఆయన పనితీరును సమర్ధించారు. భారతీయ అమెరికన్లలో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. వలస విధానం, ఆర్థిక విధానం, వాణిజ్యం, సుంకాలు, ఆంక్షలు… ఇలా అనేక విషయాలలో ఆయన వ్యవహార శైలిని జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్‌-అమెరికా సంబంధాల విషయంలోనూ ఆయన వైఖరిని వారు తప్పుపట్టారు. భారత్‌తో సంబం ధాల విషయంలో ట్రంప్‌ వ్యవహరించిన తీరును 55 శాతం మంది భారతీయ అమెరికన్లు వ్యతిరేకించగా కేవలం 20 శాతం మంది మాత్రమే సమర్ధించారు. సర్వేలను విశ్లేషిస్తే 2024 ఎన్నికలలో భారతీయ అమెరికన్లలో సాధించిన పట్టును ట్రంప్‌ కోల్పోతున్నారన్న విషయం స్పష్ట మవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -