కార్పొరేట్‌కు దీటుగా ప్రీ-ప్రైమరీ పాఠశాలల రూపురేఖలు
ఒక్కో బడికి రూ.లక్ష చొప్పున 62 రకాల ఆట సామగ్రి, ఫర్నిచర్
హైదరాబాద్ జిల్లాలో ఈ ఏడాది 275 పాఠశాలల ఎంపిక
ఆహ్లాదకరంగా ‘బాలా’ పెయింటింగ్స్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సరికొత్త హంగులతో ముస్తాబవుతున్నాయి. ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని రీతిలో పూర్వ ప్రాథమిక(ప్రీ-ప్రైమరీ) విద్యను అందించేందుకు విద్యాశాఖ పకడ్బందీ ప్రణాళికతో ముందడుగు వేస్తోంది. చిన్నారులను బడిబాట పట్టించడంతోపాటు, ఆటపాటలతో కూడిన ఆహ్లాదకర వాతావరణంలో విద్యనభ్యసించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రీ-ప్రైమరీ పాఠశాలలకు ఆధునిక వసతులు, ఇండోర్–ఔట్‌డోర్ ఆట వస్తువులు, చైల్డ్ ఫ్రెండ్లీ ఫర్నిచర్‌తో పాటు ‘బాలా’ పెయింటింగ్స్ వేసేందుకు సిద్దం చేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం హైదరాబాద్ జిల్లా పరిధిలోని మరో 275 ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ఎంపిక చేశారు. గతేడాది జిల్లాలో 28 పాఠశాలల్లో ప్రారంభించగా.. కొత్త వాటితో కలిపి 303 బడుల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించారు. మొత్తంగా ప్రభుత్వ బడుల్లో పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) విద్యకు తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఒక్కో బడికి రూ.లక్ష
చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి తోడ్పడేలా ప్రభుత్వం ఒక్కో పాఠశాలకు రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించింది. అంతర్జాతీయ బాలల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మొత్తం 62 రకాల వస్తు సామగ్రిని సమకూర్చనుంది. వాటిలో పిల్లలు సులభంగా కూర్చునే రంగురంగుల కుర్చీలు, గుండ్రని బల్లలు, పుస్తకాలు–బొమ్మల ర్యాక్‌లు, ఉపాధ్యాయుల టేబుల్స్, ప్లే టేబుల్స్, రెయిన్‌బో ల్యాడర్లు, అప్ అండ్ డౌన్ సీ-సాలు, స్వింగ్ ల్యాడర్లు, జారుడు బల్లలు, యాక్టివిటీ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ పరిధిలోని ప్రీ-ప్రైమరీ పిల్లలకు ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫాంలు, ఒక జత షూస్, సాక్సులు, బెల్టులను ఉచితంగా అందజేస్తున్నారు.
ఆకట్టుకునే ‘బాలా’ పెయింటింగ్స్
తరగతి గది గోడలే విద్యాబోధన సాధనాలుగా మారేలా ‘బాలా’ పెయింటింగ్స్‌ను తీర్చిదిద్దుతున్నారు. గోడలపై వర్ణమాల, అంకెలు, రంగురంగుల జంతువులు, పక్షుల చిత్రాలను ఆకర్షణీయంగా గీయనున్నారు. దీనివల్ల బడికి రావడమంటే భయం పోయి, ఆటల్లో భాగంగానే ప్రాథమిక అక్షర జ్ఞానం అలవడుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 24 జోన్ల(12మండలాలు)లో మొత్తం 303 పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు నడుస్తున్నాయి.
ఇప్పటివరకు 4,876 మంది చిన్నారులు ఎల్‌కేజీ, యూకేజీల్లో ప్రవేశాలు పొందారు.
జిల్లా నిర్దేశిత లక్ష్యం 5,980 కాగా, మిగిలిన 1,104 మంది విద్యార్థుల ప్రవేశాలను వందశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సంబంధిత అధికారులను ఆదే శించారు. ఇప్పటికే ఆ పాఠశాలలకు ప్రత్యేక ఇన్‌స్ట్రక్టర్ల నియామకం పూర్తయి, వారికి సుల్తాన్ బజార్ పాఠశాలలో బోధనా మెళకువలపై శిక్షణ ఇచ్చారు. ఆయాల నియామకం కూడా కొలిక్కి వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలలకు తల్లిదండ్రుల నుంచి భారీ స్పందన వస్తోంది.
సికింద్రాబాద్ నల్లకుంట పాఠశాలలో ఏకంగా 60కిపైగా చిన్నారులు చేరారు.
రాజ్‌భవన్, ఎన్‌బీటీ నగర్, సికింద్రాబాద్ మేకలమండి, చిలకలగూడ ప్రభుత్వ పాఠశాలల్లో 40-60 మందికి పైగా విద్యార్థులు చేరి సరికొత్త రికార్డు సృష్టించారు. నాలుగేండ్లు నిండిన చిన్నారులను అంగన్‌వాడీల తర్వాత నేరుగా ఒకటో తరగతికి కాకుండా.. ప్రీ-ప్రైమరీ ద్వారా పాఠశాల వాతావరణానికి అలవాటు పడేలా చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
‘ప్లే-వే’ పద్ధతిలో బోధన
చిన్న వయసు నుంచే పిల్లల్లో అభ్యాసన నైపుణ్యాలను
పెంపొందించడం, పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు
ప్రయివేటు ఫీజుల భారం తప్పించడమే లక్ష్యంగా ఈ ప్రీ-ప్రైమరీ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. ‘ప్లే-వే’ మెథడ్‌లో బోధన అందించడం ద్వారా భవిష్యత్‌లో ఒకటో తరగతి డ్రాపౌట్లను పూర్తిగా నివారించొచ్చు. సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ విద్యార్థులకు కల్పిస్తున్న కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు, ఆటపాటలతో కూడిన నాణ్యమైన విద్యా విధానం పట్ల తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-ఎస్.యాదయ్య, డీఈవో, హైదరాబాద్ జిల్లా
సర్కారు బడుల్లో బాలా సొబగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



