Wednesday, September 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపాక్‌లో పెరుగుతున్న ఆహార సంక్షోభం

పాక్‌లో పెరుగుతున్న ఆహార సంక్షోభం

- Advertisement -

అర్థాకలితో ప్రజానీకం
ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో ఆహార సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఆరు సంవత్సరాల క్రితం ప్రజల కడుపు నింపిన గోధుమలు, బియ్యం, మాంసం, పాలకు ఇప్పుడు తీవ్ర కొరత ఎదురవుతోంది. నగరాలు, గ్రామాలు అనే బేధం లేకుండా ప్రజలంతా అర్థాకలితో రోజులు గడుపుతున్నారు. దొరికిన దానితో సరిపెట్టుకొని భోజనాన్ని మధ్యలోనే ముగించాల్సిన దుస్థితి ఏర్పడింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో కుటుంబ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. దాదాపు అన్ని ప్రధాన ఆహార కేటగిరీలలోనూ గృహ వినియోగం పడిపోతోందని పాకిస్తాన్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (పీబీఎస్‌) డేటా చెబుతోంది. అదే సమయంలో ఆహార రంగంలో అభద్రతాభావం పెరిగిపోతోంది. పీబీఎస్‌ డేటా ప్రకారం 2018-19లో 15.92 శాతంగా ఉన్న ఆహార అభద్రత 2024-25 నాటికి 24.35 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో తీవ్ర ఆహార అభద్రత 2.37 శాతం నుంచి 5.04 శాతానికి చేరింది.

మారుతున్న ఆహార అలవాట్లు
పాక్‌లో పెరుగుతున్న ఆహార సంక్షోభం ప్రజల రోజువారీ ఆహార అలవాట్లను మార్చేస్తోంది. గోధుమలు, బియ్యం వినియోగం పడిపోయింది. మాంసాన్ని పండగకో పబ్బానికో వండుకుంటున్నారు. పాలు, టీ వాడకం కూడా తగ్గింది. కేవలం వనస్పతి నెయ్యి మాత్రం చాలినంత లభిస్తోంది. దీని వాడకం 81 శాతం పెరిగింది. ప్రొటీన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా లభించే మాంసం, పాలకు బదులు ప్రజలు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. 2021 నుంచి పాకిస్తాన్‌ ఆహారాన్ని దిగుమతి చేసుకుంటూనే ఉంది. అయితే ఆహారం అందుబాటులో ఉన్నదా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు. దాని ఖర్చును ప్రజలు భరించగలరా లేదా అన్నదే సమస్య. ఆహార ధరలు పెరగడం, కొనుగోలు శక్తి తీవ్రమైన ఒత్తిడికి గురవుతుండడంతో ప్రజలు చౌకగా లభించే ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలను ఎంచుకుంటున్నారు లేదా కొన్ని ఆహార పదార్థాలను దూరం పెడుతున్నారు. ఆహార అభద్రత గ్రామాలకే పరిమితం కాలేదు. పట్టణ కుటుంబాలలోనూ అది కన్పిస్తోంది. అక్కడ అనేక కేటగిరీలలో ఆహార వినియోగం తగ్గిపోతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -