అన్ని మండపాలకూ ఉచిత విద్యుత్
సింగిల్ యూజ్ ప్లాస్టిక్, డీజేల వినియోగంపై నిషేధం
700 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు,
మెట్రో సేవల పొడిగింపు : జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో పనిచేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని గణేష్ మండపాలకూ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని, మండపాల నిర్వాహకులు నిర్దేశిత విధానంలో దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో మంగళ వారం ఉన్నతస్థాయి సన్నాహక సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహిం చాలని, మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిం చాలని సూచిం చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్, డీజేల వినియోగాన్ని పూర్తిగా నిషేధించినట్టు స్పష్టం చేశారు.
పటిష్ట భద్రత – ట్రాఫిక్ నియంత్రణ
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. షీ టీమ్స్, యాంటీ-థెఫ్ట్ బృందాలతో నిరంతర నిఘా ఉంచాలని, శాంతిభద్రతలు, మత సామరస్యాన్ని కాపాడాలని మంత్రి చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ వాలంటీర్లను సిద్ధం చేయాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ అధికారులు 24 గంటలపాటు పారిశుధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, రోడ్డు మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ, ఫాగింగ్, బయో టాయిలెట్లు, బేబీ పాండ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. కీలక ప్రాంతాల్లో 24 గంటల వైద్య శిబిరాలు, అంబులెన్సులు, డాక్టర్లు, మందులతో కూడిన వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని వైద్య శాఖను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల్లో శిక్షణ పొందిన గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది, టూరిజం శాఖ లైఫ్‌బోట్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు.
ఫిట్‌నెస్ ఉన్న బస్సులనే వినియోగించాలి
ఆర్టీసీ ఆధ్వర్యంలో దాదాపు 700 ప్రత్యేక బస్సులను నడపాలని, ఫిట్‌నెస్ ఉన్న బస్సులనే వినియోగించాలని మంత్రి ఆదేశించారు. మెట్రో రైలు సర్వీసుల వేళలను పొడిగించడంతో పాటు, రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని చెప్పారు. హైదరాబాద్‌లో 47 ఏండ్లుగా కొనసాగుతున్న ఉత్సవాల సంప్రదా యాన్ని కాపాడుతూ, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా లోపాలు తలెత్తకుండా చూడాల న్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, విగ్రహాల ఊరేగింపు మార్గాల్లో సంబంధిత శాఖల అధికారులు జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ యాదవ్, రఘువీర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్, ఏడీజీపీ మహేష్ భగవత్, పోలీస్ కమిషనర్లు సజ్జనార్, రమేష్, సుమతి, జాయింట్ సీపీ జోయెల్ డేవిస్, హెచ్‌ఎండీఏ కమిషనర్, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు కర్ణన్, సృజన, వినయ్ కృష్ణారెడ్డి, ఎండోమెంట్స్ కమిషనర్ హనుమంత రావు, ఆరోగ్య శాఖ కమిషనర్ సంగీత సత్యనా రాయణ, టూరిజం ఎండీ గౌతమి, టీజీఎస్‌పీడీసీఎల్ ఎండీ జితేష్ పాటిల్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ జాయింట్ ఎండీ మయాంక్ మిట్టల్, సాంస్కృతిక శాఖ సంచాల కులు నరసింహారెడ్డి, ఐఅండ్‌పీఆర్ అదనపు సంచా లకులు డీఎస్ జగన్, ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి, రవాణాశాఖ హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ డాక్టర్ వెంకటరమణ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి, కార్యదర్శి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.



