దేవరకద్రలో క్షిపణి నిట్ ఏర్పాటుకు రంగం సిద్ధం
రూ. 500 కోట్లతో 416 ఎకరాల్లో ఏర్పాటు
సర్వే పూర్తి చేసిన అధికారులు
డిఫెన్స్ హబ్ గా మారనున్న పాలమూరు
రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం : సీఐటీయూ
మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
శత్రు దేశాల గుండెల్లో నిద్రపోయే ‘బ్రహ్మోస్త్ర’ క్షిపణులు ఇకపై పాలమూరు మట్టిలో పురుడు పోసుకోనున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జూన్‌లో ఢిల్లీలో జరిపిన చర్చలు వేగంగా ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతు న్నాయి. మేకిన్ ఇండియా, ఆత్మనిర్బర్ భారత్ లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ లో 200 ఎకరాల విస్తీర్ణంలో రూ .380 కోట్లతో ఈ బ్రహ్మోస్ యూనిట్‌ను ప్రారంభించనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర సమీపంలోని ప్రాంతాన్ని నిపుణుల బృందం పరిశీలించి ఇక్కడ యూనిట్ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదనీ, పాలమూరు ముఖ చిత్రమే మారబోతుందని చెబుతున్నారు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా
వేలాది మందికి ఉపాధి అవకాశాలు సుమారు రూ. 500 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటుచేసే క్షిపణి తయారీ కేంద్రంలో ప్రత్యక్షంగా 1,500 నుంచి 2,000 మందికి, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ ఇక్కడే తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం ఈ యూనిట్ కు కేంద్రబిందువుగా మారడానికి దీని వెనుక బలమైన వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి.
దేవరకద్రలోని చౌదర్‌పల్లి, బస్వాయ్‌పల్లి , అజిలాపురం గ్రామాల పరిధిలో దాదాపు 416 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. ప్రభుత్వ భూమితో పాటు చౌదరిపల్లిలో 20, బసవాయిపల్లిలో 150, జీనుగురాలలో 185 డోకూరులో 40 ఎకరాలను చిన్న సన్న కారు రైతుల నుంచి సేకరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న గుట్టలు పరిశ్రమకు ఒక సహజసిద్ధమైన రక్షణ గోడగా ఉపయోగపడతాయని డీఆర్డీఏ అధికారులు భావించారు. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారికి కేవలం 6 కి.మీ దూరంలో ఉండటం, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 100 కి.మీ సామీప్యతలో ఉండటంతో బ్రహ్మోస్ జనరల్ డైరెక్టర్ జై తీర్థ జోషి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డీఆర్డీఏ డైరెక్టర్ జిఏ శ్రీనివాసమూర్తి దీనికి పచ్చ జెండా ఊపినట్టు సమాచారం. హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ లేబొరేటరీస్ కు దగ్గరగా ఉండటంతో, భవిష్యత్‌లో మహబూబ్‌నగర్ ఒక ‘డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్’గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. క్షిపణి తయారీకి అవసరమైన చిన్న విడిభాగాలు, పరికరాలు తయారు చేసే అనేక చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉంటాయని చెబుతున్నారు.
పూర్తికా వచ్చిన సర్వే పనులు
బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్ ఏర్పాటుకు కావలసిన ప్రభుత్వ భూమిని ఇటీవల అధికారులు పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి రిపోర్టు అందజేసినట్టు తెలిసింది. ఇందులో ప్రభుత్వ భూమి 416 ఎకరాలు గుర్తించగా, యూనిట్ ఏర్పాటు కోసం మరికొంత ప్రయివేట్ భూములు కూడా సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు పట్టా భూముల్లో సైతం సర్వే పనులు నిర్వహించి ఇటీవల అధికారులకు రిపోర్ట్ అందజేశారు. దీంతో క్షిపణి తయారీ యూనిట్ కు మార్గం సుగమమైందని స్థానికంగా చర్చించుకుంటున్నారు.
రైతుల ఆవేదన
సారవంతమైన భూముల్లో ఆయుధాల తయారీకి తమ భూములు లాక్కోని తీవ్ర అన్యాయానికి గురి చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే సాగునీరు అంది లాభాలు గడుస్తున్న వేల.. క్షిపణి పేరుతో యూనిట్ల కోసం సాగు భూములను కేంద్రం సేకరించడం పట్ల రైతులు మండి పడుతున్నారు.
2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి
రైతుల సమ్మతి లేకుండా బలవంతంగా భూములు తీసుకుంటే ఉద్యమాలు తప్పవు. భూమికి భూమి ఇచ్చి భూసేకరణ చేయాలి. లేనిచో 2013 చట్టం ప్రకారం పరిహారం అందజేయాలి. 100 ఏండ్ల నుంచి భూమి ఆధారంగా జీవిస్తున్న పేదల భూముల జోలికి వస్తే.. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటాలు తప్పవు.
ఎన్. కురుమూర్తి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, మహబూబ్‌నగర్ జిల్లా



