సింగిల్ జడ్జి తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
రంగనాథ్‌ను తప్పించాలంటూ ఇచ్చిన తీర్పు నిలిపివేత
నవతెలంగాణ-సిటీబ్యూరో
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో జీఎల్ ఆర్ 243లో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూముల పరిరక్షణ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో ఈ కేసు విచారణలో భాగంగా హైడ్రా కమిషనర్ ను తప్పించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం నిలిపివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైడ్రా కమిషనర్ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసిన విషయం విదితమే. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. హైడ్రా కమిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రాజీవ్ శక్దర్ సుదీర్ఘ వాదనలు వినిపించారు. అనంతరం డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను నవంబరు 3కు వాయిదా వేసింది.
కేసు పూర్వాపరాలు..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని జీఎల్ ఆర్ 243లో 119 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. బీ-2 భూములుగా పేర్కొన్న వీటిని ఆస్పత్రులు, పాఠశాలలు.. ఇలా రాష్ట్ర ప్రభుత్వ అవసరాల నిమిత్తం సికింద్రాబాద్ కంటోన్మెంట్ కేటాయించింది. వీటి హక్కుదారుగా రాష్ట్ర ప్రభుత్వం ఉండటమే కాకుండా, వాటి సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకుంటుంది. జులై 18న తిరుమలగిరి – అల్వాల్ ప్రాంతంలోని ఈ 119 ఎకరాల ప్రభుత్వ భూమికి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ఇది ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ డిఫెన్స్ ఎస్టేట్ అధికారులు కూడా ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన కో ఆర్డినేట్స్, గూగుల్ ఎర్త్‌మీద క్లియర్‌గా మార్కు చేస్తూ కేఎంఎల్ ఫైల్ ఇచ్చారు.
3 కిలోమీటర్ల దూరం..
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం లోతుకుంట సర్వే నంబరు 1, 2లో ఉన్న ప్రయివేటు భూములకు, 243 జీ ఎల్ ఆర్ నెంబరులో ఉన్న 119 ఎకరాల ప్రభుత్వ భూమికి మధ్య దూరం 3 కిలోమీటర్ల వరకూ ఉందని హైడ్రా చెబుతూ వస్తోంది. లోతుకుంట సర్వే నంబరు 1, 2 లో అనుమతులు తెచ్చుకుని జీఎల్ ఆర్ నెంబర్ 243లోని ప్రభుత్వ భూమిలో శాంతశ్రీరాం కనస్ట్రక్షన్స్ నిర్మాణాలు చేపడుతోంది. ప్రభుత్వ భూమిని తమదిగా చెబుతూ హైకోర్టును ఆశ్రయించడమే కాకుండా కంటెంప్ట్ కేసు కూడా హైడ్రాపై వేసింది. వ్యక్తిగతంగా హైడ్రా కమిషనర్‌పై కూడా కంటెంప్ట్ కేసు వేసింది. ఈ కేసు విచారణలో హైకోర్టు సింగిల్ జడ్జి పలు వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి ఏవీ రంగనాథ్ ను తప్పించి, ఆ స్థానంలో మరొకరిని నిమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఈ ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.



