క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన మాస్కో 18 మంది మృతి… 90 మందికి పైగా గాయాలు
కీవ్ : ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బుధవారం రాత్రి క్షిపణులు, డ్రోన్లతో పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఈ దాడుల్లో కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 90 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 70 మందికి ఆస్పత్రులలో చికిత్స అందజేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని అధికారులు భావిస్తున్నారు. రష్యా దాడుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలలో భారీగా మంటలు వ్యాపించాయి. రష్యా క్షిపణులు, డ్రోన్ల శకలాలు అనేక భవనాలపై పడ్డాయి. కీవ్‌లో కొన్ని గంటల పాటు పేలుడు శబ్దాలు వినిపించాయి. డ్రోన్లు, క్రూయిజ్-బాలిస్టిక్ క్షిపణులు రాజధాని వైపు దూసుకువస్తుండడంతో ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఓ క్షిపణి నేరుగా భవనంపై పడడంతో ఆరు అంతస్థులు కుప్పకూలాయని నగర మేయర్ వితాలీ క్లిట్కో తెలిపారు. మరో ప్రదేశంలో భవనం శిధిలాల కింద చిక్కుబడిన ప్రజలను బయటికి తీశారు. దాడిలో అంబులెన్స్ స్టేషన్ కూడా దెబ్బతిన్నది. దీనిని అత్యంత భీకర దాడిగా క్లిట్కో అభివర్ణించారు. శుక్రవారాన్ని సంతాప దినంగా ప్రకటించారు.
ముందుగానే హెచ్చరించిన అధ్యక్షుడు
గతంలో రష్యా జరిపిన దాడులలో ఇంతకంటే ఎక్కువ ప్రాణనష్టమే జరిగినప్పటికీ తాజా దాడుల్లో పలు ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకుంది. దాడుల నేపథ్యంలో నగర పరిసర ప్రాంతాలలోని ప్రజలను ఖాళీ చేయించారు. రష్యా ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు అనేక భవనాలను తాకడమే దీనికి కారణం. ఉక్రెయిన్ రాజధానిపై రష్యా తరచుగా క్షిపణి, డ్రోన్ దాడులు జరుపుతూనే ఉంది. భారీ దాడికి మాస్కో సిద్ధపడుతోందంటూ కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బుధవారం రాత్రి దాడులు జరగవచ్చునని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ముందుగానే ప్రజలను హెచ్చరించారు. ‘ప్రజలందరినీ మరింత అమ్రత్తంగా ఉండాలని కోరుతున్నాను. మీరు, మీ చిన్నారులు జాగ్రత్త. సురక్షిత ప్రాంతాలలో ఉండండి. అది చాలా ముఖ్యం’ అని ఆయన డబ్లిన్ పర్యటనలో ప్రజలకు సూచించారు. రష్యా దాడులతో భీతిల్లుతున్న రాజధానిలోని వేలాది మంది ప్రజలు మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. విదేశీ దౌత్యవేత్తలందరూ నగరాన్ని వీడిపోవాలని మేలోనే రష్యా హెచ్చరికలు జారీ చేసింది. నిర్ణయాత్మక ప్రాంతాలపై దాడులను ఉధృతం చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది.
ఉక్రెయిన్ దాడులకు ప్రతిగానే… : రష్యా
ఇంధన కొరతను ఎదుర్కొంటున్న సమయంలో రష్యా ఈ దాడి చేసింది. రష్యాలోని చమురు రిఫైనరీలపై దూర శ్రేణి డ్రోన్ దాడులు చేస్తామని ఉక్రెయిన్ చెబుతూ వస్తోంది. రష్యాలోని అనేక ప్రాంతాలలో పెట్రోల్‌పై రేషన్‌ను అమలు చేస్తున్నారు. ఆక్రమిత క్రిమియాలో రష్యా అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. తమ పౌర మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ దాడులు చేసినందునే ప్రతి దాడులు జరిపామని రష్యా చెప్పింది. లక్ష్య సాధన కోసం ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచుతూనే ఉంటామని క్రెమ్లిన్ ప్రతినిధి డ్మిట్రీ పెస్కోవ్ తెలిపారు.
జనావాసాలు, చిన్నారులే రష్యా లక్ష్యం : మండిపడిన ఉక్రెయిన్
జనావాసాలను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులు చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది. ఆక్రమణదారును, దేశాన్ని కాపాడుకుంటున్న వారిని ఒకేలా చూడడం తప్పు అని తెలిపింది. కాగా మృతులలో చిన్నారుల సంఖ్య ఎక్కువగానే ఉన్నదని కైవ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అధిపతి తైమూర్ చెప్పారు. ‘శత్రువు ఉద్దేశపూర్వకంగానే జనావాసా లను, చిన్నారులను లక్ష్యంగా చేసుకున్నాడు’ అని మండి పడ్డారు. కీవ్ కు ఆగ్నేయంగా ఉన్న బహుళ అంతస్థుల భవనం లో కొంత భాగం మంటలలో చిక్కుకున్నదని ఆయన అన్నారు.
క్షిపణుల తయారీకి లైసెన్సులు ఇవ్వండి : జెలెన్‌స్కీ
పాట్రియాట్ గగనతల రక్షణ క్షిపణుల తయారీకి లైసెన్సులు మంజూరు చేయాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికాను కోరారు. మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలను పంపాలని విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేశారు. రష్యాపై ఆంక్షలు పెంచాలని సూచించారు. దేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాలలోని సైనిక కేంద్రాలపై కూడా రష్యా దాడులు చేసిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
11 గంటల
పాటు పలు
దఫాలుగా..
నగరంపై పది దాడులు జరిగాయని, భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని బీబీసీ బృందం తెలియజేసింది. రష్యా దాడులలో అనేక వాహనాలు, భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని చెప్పింది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. కైవ్‌పై పలు దఫాలుగా 11 గంటలకు పైగా దాడులు జరిగాయి. ముందుగా రాత్రి ఒంటి గంట సమయంలో అనేక బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు దూసుకొచ్చాయి. ఆ తర్వాత తెల్లవారుజామున మూడు గంటలకు మరోసారి కేహెచ్-101 క్రూయిజ్ క్షిపణుల దాడి జరిగింది. ఆ తర్వాత తెల్లవారే వరకూ డ్రోన్ దాడులు కొనసాగాయి. మొత్తంమీద రష్యా బుధవారం రాత్రి 74 క్షిపణులు, 496 డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వీటిలో చాలా వాటిని గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. పాతిక బాలిస్టిక్ క్షిపణులు, పన్నెండు డ్రోన్లు వాటిని దాటుకొని నగరంలోని 33 ప్రదేశాలను తాకాయి.



