శత జయంతి ఉత్సవాల వేళ దేశవ్యాప్తంగా వెల్లివిరుస్తున్న విప్లవ స్ఫూర్తి
కొనసాగుతున్న ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు, చర్చలు
భారత్ తరఫున హాజరైన సీపీఐ(ఎం) బృందం
కాస్ట్రో భావజాలానికి పెరుగుతున్న ప్రాధాన్యత
హవానా : క్యూబా విప్లవ యోధుడు ఫైడల్ కాస్ట్రో జ్ఞాపకాలను క్యూబన్లు గుర్తు చేసుకుంటున్నారు. సామ్రాజ్యవాదం విసిరిన అనేక సవాళ్ళను రాజీపడని రీతిలో సోషలిస్టు ప్రతిఘటనతో ఎదుర్కొన్న ఆ వీరోచిత నేత శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రజలు ప్రముఖంగా ఆయనను స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా హవానా కన్వెన్షన్ సెంటర్‌లో ప్రత్యేక కార్యక్రమాలు, ఉత్సవాలు, అంతర్జాతీయ చర్చలు సాగుతున్నాయి. అమెరికా కొనసాగిస్తున్న ఆంక్షలను, ఇతర సంక్షోభాలను అధిగమించడానికి, దేశ సార్వభౌమాధికారాన్ని, సోషలిస్టు విజయాలను పరిరక్షించుకోవడానికి క్యూబన్లకు అధికంగా శక్తినిచ్చేది ఫైడల్ కాస్ట్రో విప్లవాత్మక ఆలోచనలు, ఆయన అనుసరించిన పంథా, సైద్ధాంతిక భావజాలమే. క్యూబా అత్యంత దారుణమైన, కఠినమైన దిగ్బంధనాన్ని ఎదుర్కొంటోందని, ప్రతిరోజూ ఆర్థిక వేధింపులేనని క్యూబా అధ్యక్షుడు డియాజ్ కానెల్ అన్నారు. ఇటీవల క్యూబాపై ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను అమెరికా మరింత ఉధృతం చేసింది. క్యూబాకు చమురును ఎగుమతి చేసే దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని జనవరిలో అమెరికా బెదిరించింది. దాంతో ఆంక్షల భయంతో క్యూబాకు చమురును సరఫరా చేయడానికి షిప్పింగ్ సంస్థలు వెనుకాడాయి.
నెలల తరబడి ఒక్క చుక్క కూడా ఇంధనం లేకపోవడంతో దేశంలో తీవ్రమైన ఇంధన సంక్షోభం నెలకొంది. గత 24 మాసాల్లో 12సార్లు జాతీయ స్థాయిలో ఇంధన సంక్షోభాలను క్యూబా ప్రజలు ఎదుర్కొన్నారు. ఆస్పత్రుల్లో విద్యుత్ లేకపోవడంతో ఆపరేషన్ థియేటర్లు మూతపడ్డాయి. ఆపరేషన్ల కోసం వేచి ఉన్నవారి సంఖ్య 1.20లక్షలు దాటిపోయింది. వీరిలో 11వేల మందికి పైగా చిన్నారులే కావడం అత్యంత దయనీయం. డిజిటల్-ఇంటర్‌నెట్ ప్రాతిపదికన నడిచే విద్యా వేదికల పనితీరుకు తరచూ ఆటంకాలే. రవాణా వ్యవస్థ మొత్తంగా కూలబడింది. ఒకప్పడు దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్థంభాల్లో ఒకటిగా వున్న చక్కెర పరిశ్రమ కుప్పకూలింది. గత 67 సంవత్సరాలుగా అమెరికా సాగిస్తున్న ఆర్థిక యుద్ధానికి పరాకాష్టగా ఈ పరిస్థితులు నిలిచాయి. ఈనాడు క్యూబన్లలో 80శాతం మంది ఈ కఠినమైన ఆంక్షల పరిస్థితుల్లోనే పుట్టారు, జీవనం సాగిస్తున్నారు. అదేసమయంలో, అమెరికా బెదిరింపులను, ఆంక్షలను, సవాళ్ళను తట్టుకుని నిలిచిన క్యూబా… ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శంగా నిలుస్తోంది. ఈ సందర్భంలోనే ఫైడల్ కాస్ర్టో, ఆయన భావజాలం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అంతర్జాతీయ సదస్సులో కాస్ట్రో శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా హవానా కన్వెన్షన్ సెంటర్‌లో అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. నాలుగు రోజులకు పైగా సాగుతున్న ఈ సదస్సులో 1500మందికి పైగా ఎంపికచేసిన ప్రతినిధులు పాల్గొన్నారు.
వీరిలో 63 దేశాలకు చెందిన 900మంది విదేశీ ప్రతినిధులు ఉన్నారు. క్యూబా విప్లవ స్ఫూర్తికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న మిత్ర దేశాలు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, సామాజిక నేతలు పాల్గొని తమ అభిప్రాయాలు పరస్పరం పంచుకున్నారు. క్యూబా అధ్యక్షుడు, క్యూబా కమ్యూనిస్టుపార్టీ ఫస్ట్ సెక్రెటరీ మిగ్వెల్ డియాజ్ కానెల్ ఈ సదస్సను ప్రారంభించారు. వివిధ అంశాలపై 11 సెషన్లలో చర్చలు కొనసాగుతున్నాయి. ‘కాస్ట్రో వారసత్వం, ప్రపంచ రాజకీయాలపై ఆయన చారిత్రక ప్రభావం’ అనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. అమెరికా సాగిస్తున్న కుట్రలను, మోపుతున్న ఆర్థిక ఆంక్షలను అత్యంత ధైర్యంగా ప్రతిఘటించడంలో క్యూబా సాధిస్తున్న విజయాలను ప్రతినిధులు ప్రశంసల్లో ముంచెత్తారు. స్పానిష్ భాషలో నినదించిన సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదాలు ఆ సదస్సు జరుగుతున్న ప్రాంగణంలో ప్రతిధ్వనించాయి. కాస్ట్రో చిత్రం ఉన్న దుస్తులు ధరించి వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్ అరుణ్ కుమార్, విజూ కృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం భారత్ తరఫున ఈ సదస్సులో పాల్గొంది.
కాస్ర్టో విధానాలే మార్గదర్శకం
క్యూబా అధ్యక్షులు డియాజ్ కానెల్ హవానాలో ప్రారంభమైన ప్రపంచ సదస్సు
కాస్ట్రో విధానాలే ఇప్పటికీ క్యూబాకు మర్గదర్శకాలని ఆ దేశ అధ్యక్షులు డియాజ్ కానెల్ అన్నారు. ఫైడెల్ కాస్ట్రో శత జయంతి సందర్భంగా అంతర్జాతీయ సదస్సు హవానాలో ప్రారంభమైంది. ఈ సదస్సు 10వ తేదీ నుంచి 13 వరకూ జరగనుంది. సోమవారం అధ్యక్షులు డియాజ్-కానెల్ ఈ సదస్సును ప్రారంభించారు. చైనా, వియత్నాం, దక్షిణాఫ్రికా, నమీబియా వంటి దేశాల ప్రభుత్వ ప్రతినిధులతో పాటు వందకు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా డియాజ్-కానెల్ మాట్లాడుతూ… సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొంటాం, సోషలిజాన్ని నిలుపుకుంటామని స్పష్టం చేశారు. క్యూబా లోని సోషలిస్టు వ్యవస్థను కూలదోయాలని చూస్తున్న సామ్రాజ్యవాదాన్ని ప్రాణాలకు తెగించి ఆ దేశ ప్రజలు నిత్యం కాపాడుకుంటున్న తీరును వివరించారు. కాస్ట్రో అమలు చేసిన విధానాలు ఇప్పుడు కూడా మార్గదర్శకంగా ఉన్నాయని అని ఆయన తెలిపారు. 1959 జనవరి 1 క్యూబా దేశానికి విప్లవాన్ని సాధించిన దగ్గర నుంచి చనిపోయే వరుకు క్యూబన్ల కోసమే కాదు…. ప్రపంచ ప్రజల కోసం పని చేసిన యోధుడు పైడల్ కాస్ట్రో అని తెలిపారు. క్యూబాలోని సోషలిస్ట్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ట్రంప్ నాయకత్వంలో ఇప్పుడు అమెరికా మరింత బరితెగించిందని అన్నారు.
క్యూబాను ఒంటరి చెయ్యటానికి అన్ని ప్రయత్నాలనూ అమెరికా చేస్తుందని విమర్శించారు. ప్రపంచంలో సోషలిజం నిలబడటానికి, అభివృద్ధి చెందడానికి క్యాస్ట్రో అందించిన సహకారం ఎంతో గొప్పది అని చైనా, వియత్నాం దేశాల అధికార ప్రతినిధులు కొనియాడారు. కాస్ట్రో క్యూబా నాయకుడే కాదు, మా నాయకుడు, అంతర్జాతీయ నాయకుడు అని అన్నారు. సదస్సు అనంతరం 11 సెషన్స్ నిర్వహించారు. ఒకొక్కదానిలో ఒక్కక్క అంశంపై చర్చలు జరిగాయి. క్యూబా అభివృద్ది, ఎదురవుతున్న సవాళ్లు, అమెరికా నాయకత్వం లో సామ్రాజ్య వాదం చేసున్న దాడులు, యుద్ధాలు.. మొదలైన వాటిపై చర్చలు జరిగాయి. భారత్ నుంచి సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు ఆర్ అరుణ్ కుమార్, విజూ కృష్ణన్, వ్యకాస ప్రధాన కార్యదర్శి బి వెంకట్, మీనాక్షి సుందరం, చంద్రన్, మహాపాత్ర, అనిల్ పాల్గొన్నారు. ఈ బృందం భారత్ నుంచి ఔషధాలను తీసుకొచ్చి క్యూబా ప్రజలకు అందజేసింది. సీపీఐ నుంచి రామకృష్ణ కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు.



