Saturday, July 4, 2026
E-PAPER
Homeజాతీయంఅన్ని ప్రయత్నాలు విఫలం-న్యాయ వ్యవస్థపైనే నమ్మకం

అన్ని ప్రయత్నాలు విఫలం-న్యాయ వ్యవస్థపైనే నమ్మకం

- Advertisement -

ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో 24 ప్రతిపక్ష పార్టీలు
న్యూఢిల్లీ : అన్ని ప్రయత్నాలు విఫలమైనప్పు డు న్యాయవ్యవస్థపైనే ప్రజలు నమ్మకం ఉంచుతారని ఇండియా బ్లాక్‌‌లోని 24 ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి. ప్రజాస్వామ్యం ప్రమాదం లో ఉందని, ఎన్నికల సంఘం స్వతంత్రత కోల్పోయిందని విశ్వసిస్తున్నందున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించినట్లు తెలిపాయి. ఎన్నికల్లో అవకతవకలు, భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పక్షపాత వైఖరి, ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు ఇటీవల రాసిన లేఖను ఇండియా బ్లాక్‌ ‌పార్టీలు శుక్రవారం విడుదల చేశాయి. ఈ లేఖపై స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్‌తో సహా 24 ప్రతిపక్ష పార్టీల నాయకులు సంతకం చేశారు. పశ్చిమ బెంగాల్, బీహార్‌లో సర్ సందర్భంగా చోటు చేసుకున్న అవకతవకలను ఆ లేఖలో నేతలు వివరించారు. ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రలలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేసినట్లు విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజాస్వా మ్య సంస్థలు ఒత్తిడికి గురవుతున్నాయని, పలు సందర్భాల్లో ఎన్నికల ఫలితాలు ప్రజల ఆకాంక్షను సరిగ్గా ప్రతిబింబించలేదని భావిస్తున్నందున సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నామని తెలిపారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన ద్వారా ఓట్ల చోరీకి ఇసిఐ సహకరిస్తోందని ఆరోపించారు. 2014కు ముందు కమిషన్‌లోని వ్యక్తుల నిజాయితీపై పెద్దగా ప్రశ్నలు తలెత్తలేదని పేర్కొన్నారు. “2014 నుంచి ప్రభుత్వం చేసిన ప్రతి నియామకం, ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తులదే. వీరు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి బరితెగించి ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నట్లు కనిపిస్తోంది,” అని ఆ లేఖలో విమర్శించారు. ఇటీవలి సంవత్సరాలలో ఎన్నికల కమిషన్ స్వతంత్రత క్షీణించిందని పేర్కొన్నారు. అనూప్ బరన్వాల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై న్యాయపరమైన ఆందోళనలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని తెలిపారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను నియమించే బాధ్యత గల కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించిన, తదనంతర చట్టాల ద్వారా చేసిన మార్పులను ఆ లేఖ విమర్శించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నిస్సిగ్గుగా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, ఎన్నికల ప్రక్రియ సమయంలో బీజేపీ కి ఆయన బహిరంగంగా మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని, తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయడంలో ఈసీ ‘నిష్పక్షపాతంగా’వ్యవహరించడం లేదని తెలిపారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినప్పుడు చర్యలు తీసుకోవడం లేదని, అదే సమయంలో ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు.

సర్‌ ‌వెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటి?
సర్ నిర్వహించడం వెనుక ఉన్న హేతుబద్ధతను ఇండియా వేదిక నేతలు ప్రశ్నించారు. బీహార్ ఓటర్ల జాబితాలోకి బంగ్లాదేశీయులు చొరబడ్డారన్న ఆరోపణల చుట్టూ ఎస్‌ఐఆర్‌ కేంద్రీకృతమై ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినందున, అటువంటి చొరబాటు నిజంగా జరిగిందని సూచించడానికి ఎటువంటి డేటా లేదు, భారతదేశంలో చట్టవిరుద్ధంగా ఓటు హక్కును పొందిన బంగ్లాదేశీయుల సంఖ్యకు సంబంధించి ఎన్నికల సంఘం ఎటువంటి డేటాను బహిరంగపరచలేదు.‘అని ఆ లేఖలో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితి మరింత దిగజారిందని, అక్కడ 2.4 లక్షల మంది సీఎపీఎఫ్ సిబ్బంది ఉండటంతో ప్రభుత్వం దిగ్బంధంలో ఉందని విమర్శించారు. చిన్నచిన్న తేడాల కారణంగా దాదాపు 25 లక్షల మంది ఓటర్లు అనర్హులుగా మిగిలిపోవడంపై ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు కనీసం ఐదేళ్ల సమయం ఉన్నప్పుడే ఓటర్ల జాబితాల సమగ్ర పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని, ఎస్‌ఐఆర్‌‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. గతంలో ఎన్నడూ అనుసరించని పత్రాల ఆధారిత ప్రక్రియకు బదులుగా, ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ధ్రు వీకరించడానికి కమిషన్ ప్రతినిధులకు వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -