వైరల్‌గా డాక్టర్ ట్రంప్ ఏఐ వీడియో
‘ట్రంప్ డెరేంజ్‌మెంట్ సిండ్రోమ్’కు చికిత్స ఇదేనంటూ చమత్కారం
సినీ, టీవీ ప్రముఖుల ఏఐ రూపాలను ఉపయోగించడంపై చర్చ
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఏఐ సాయంతో రూపొందించిన వీడియోతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఈసారి ఆయన ‘డాక్టర్ ట్రంప్’గా కనిపించారు. ‘ట్రంప్ డెరేంజ్‌మెంట్ సిండ్రోమ్ (టీడీఎస్)’కు చికిత్స సూచిస్తున్నట్టుగా రూపొందించిన వ్యంగ్య వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. సుమారు 90 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ట్రంప్ తెల్లటి డాక్టర్ కోటు ధరించి కనిపిస్తారు. ‘‘మీకు లేదా తెలిసిన ఎవరికైనా టీడీఎస్ ఉందా? అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను డాక్టర్ ట్రంప్. దీనికి చికిత్స ఉంది’’ అంటూ వీడియో ప్రారంభమవుతుంది. అనంతరం తన చికిత్స వల్ల ప్రయోజనం పొందిన రోగుల అభిప్రాయాలంటూ కొన్ని కల్పిత దృశ్యాలను చూపించారు. అందుకు ట్రంప్ విధానాలను గతంలో బహిరంగంగా విమర్శించిన పలువురు హాలీవుడ్ నటులు, టెలివిజన్ వ్యాఖ్యాతల ఏఐ రూపాలను ఉపయోగించారు. వారంతా ట్రంప్ సూచించిన చికిత్సతో తమకు ప్రయోజనం కలిగినట్టు మాట్లాడుతున్నట్టుగా వీడియోలో చూపించారు.
ఏఐ పోస్టులపై గతంలోనూ వివాదం
ఇటీవల ట్రంప్ పలు ఏఐ ఆధారిత చిత్రాలు, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. వాటిలో కొన్ని తీవ్ర విమర్శలకు దారితీశాయి. ముఖ్యంగా పోప్ లియో-14తో కలిసి ఉన్నట్టు రూపొందించిన ఒక ఏఐ చిత్రం వివాదాస్పదమైంది. విమర్శలు వెల్లువెత్తడంతో ఆ చిత్రాన్ని తొలగించినప్పటికీ.. అనంతరం మరో ఏఐ చిత్రాన్ని కూడా ఆయన పంచుకోవడం చర్చకు దారితీసింది.
ఇరాన్ దాదాపు మా అన్ని షరతులకు అంగీకరించింది : ట్రంప్
ఇదిలా ఉండగా, ఇరాన్‌తో కొనసాగుతున్న దౌత్య చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా కోరిన దాదాపు అన్ని షరతులకు ఇరాన్ అంగీకరించిందని, రెండు దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరే దశకు చర్చలు చేరాయని ఆయన వెల్లడించారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించడమే ఈ చర్చల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
‘టీడీఎస్’ అంటే ఏమిటి?
వీడియో చివర్లో డాక్టర్ పాత్రలో కనిపించిన ట్రంప్.. ‘ఫేక్ న్యూస్ చూడడం మానేయండి. ప్రార్థనలు చేయండి. ఆందోళనగా అనిపిస్తే నా లాగే డైట్ కోక్ తాగండి. అప్పుడు మీ జీవితంలో గొప్ప మార్పు కనిపిస్తుంది’ అంటూ సరదాగా సూచనలు ఇస్తారు. ఇక ‘ట్రంప్ డెరేంజ్‌మెంట్ సిండ్రోమ్’ అనే పదాన్ని ట్రంప్, ఆయన మద్దతుదారులు తరచుగా ఉపయోగిస్తుంటారు. ట్రంప్‌ను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులు ఆయన పట్ల తీవ్ర ప్రతికూల భావనతో వ్యవహరిస్తున్నారని విమర్శించేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ పదం వైద్య పరిభాషకు సంబంధించింది కాదు.



