గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో వాటాలను విక్రయిస్తున్న నార్వే నార్జెస్ బ్యాంక్
గతంలోనే పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్‌లో వాటాల అమ్మకం
భారత బ్లూ చిప్ కంపెనీలపైనా చర్యలు
న్యూఢిల్లీ : అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ను తన పోర్ట్‌ఫోలియో (పెట్టుబడుల సమాహారం) నుంచి తొలగించాలని ప్రపంచంలోనే అతి పెద్ద సావరిన్ వెల్త్ ఫండ్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) నిర్ణయించింది. పోర్ట్‌ఫోలియో నుంచి తొలగించడం లేదా మినహాయించడం అంటే ఆ సంస్థలో గతంలో పెట్టిన పెట్టుబడులను విక్రయించడం. రెండు ట్రిలియన్ డాలర్ల సంపద నిధిని నార్వేకు చెందిన నార్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ నిర్వహిస్తోంది. సావరిన్ వెల్త్ ఫండ్ అనేది, ఏదైనా ఒక దేశానికి చెందిన ప్రభుత్వం తన యాజమాన్యంలో నిర్వహించే పెట్టుబడి నిధి. దేశంలోని అదనపు ఆదాయాన్ని, విదేశీ మారక నిల్వలను, సహజ వనరుల విక్రయం ద్వారా లభించిన మిగులు నిధులను స్టాక్‌లు, బాండ్లు, రియల్ ఎస్టేట్, ఇతర ఆర్థిక పరమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టడం దీని ప్రధాన ఉద్దేశం. మన దేశం కూడా 2015లో ఇలాంటి నిధిని ‘నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’ పేరిట ఏర్పాటు చేసింది.
గతంలోనే అదానీ వాటాల విక్రయం
అసలు విషయానికి వస్తే అవినీతి, ఇతర ఆర్థిక పరమైన నేరాలకు సంబంధించి అదానీ గ్రూపుపై తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నార్వేకు చెందిన ఎస్‌డబ్ల్యూఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. 2024 మే నెలలోనే అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్‌ను ఎస్‌డబ్ల్యూఎఫ్ తన పోర్ట్‌ఫోలియో నుంచి మినహాయించింది. అంటే అందులోని తన వాటాలను విక్రయించిందన్న మాట. నార్జెస్ బ్యాంక్ 2024 మే 15వ తేదీన తన వెబ్సైట్లో ఈ నిర్ణయాన్ని తెలిపింది. వాటాల విక్రయానికి దారితీసిన కారణాలను కూడా వివరించింది.
”యుద్ధం లేదా ఘర్షణ పరిస్థితులలో వ్యక్తుల హక్కులు తీవ్ర ఉల్లంఘనకు గురికావడానికి ఆ సంస్థ దోహదపడింది. ఈ చర్య బ్యాంక్‌కు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. మార్గదర్శకాల్లో ప్రవర్తనకు సంబంధించి పొందుపరచిన నియమావళిని పరిశీలించిన అనంతరం బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ బోర్డు అదానీ కంపెనీని పోర్ట్‌ఫోలియో నుంచి మినహాయించాలని నిర్ణయించింది” అని తెలిపింది. 2022 మార్చి నుంచి అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ తమ పరిశీలనలో ఉన్నదని, విలువలపై ఏర్పాటు చేసిన కౌన్సిల్ సిఫార్సు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.
ఏం చేస్తారు?
గత సంవత్సరం ప్రథమార్ధంలో అదానీ గ్రీన్ ఎనర్జీలో నార్జెస్ బ్యాంకుకు 43.9 మిలియన్ డాలర్ల విలువ కలిగిన 0.23 శాతం వాటాలు ఉన్నాయని మ్లెక్స్ వార్తా సంస్థ తెలిపింది. ఫండ్ నుంచి ఏ కంపెనీనైనా మినహాయిస్తే అందులో ఉన్న బ్యాంక్ వాటాలను విక్రయిస్తారు. మినహాయింపులను ఎత్తివేసే వరకూ ఆ కంపెనీలో ఫండ్ తిరిగి పెట్టుబడులు పెట్టదు.
బ్యాంక్ జాబితాల్లో ఈ కంపెనీలు కూడా…
గత సంవత్సరం నవంబర్ నాటికి నార్జెస్ బ్యాంక్ తన పోర్ట్‌ఫోలియో నుంచి మినహాయించిన లేదా పరిశీలనలో ఉంచిన కంపెనీల జాబితాలో అదానీ గ్రీన్ ఎనర్జీ కన్పిస్తోంది. గత నవంబరులో తీసుకున్న నిర్ణయాన్ని మూడు నెలల అనంతరం అంటే ఫిబ్రవరి 26న తెలియజేశారు. ఈ ఫండ్ గతంలో ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బీహెచ్ఈఎల్, గెయిల్ ఇండియా లిమిటెడ్, ఐటీసీ, లార్సెన్ అండ్ ట్రూబో, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్టీపీసీ, వేదాంత లిమిటెడ్ వంటి భారతీయ బ్లూచిప్ సంస్థలను తన పోర్ట్‌ఫోలియో నుంచి మినహాయించిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. బొగ్గు లేదా బొగ్గు ఆధారిత ఇంధన ఉత్పత్తి కారణంగా పర్యావరణానికి నష్టం ఏర్పడుతోందని, సాయుధ ఘర్షణలు జరుగుతున్న దేశాలకు ఆయుధాలను విక్రయిస్తున్నారని, పొగాకును, అణ్వాయుధాలను ఉత్పత్తి చేస్తున్నారని… ఇలా అనేక కారణాలు చూపి ఆయా సంస్థలను తన పోర్ట్‌ఫోలియో నుంచి మినహాయించింది.
ఏం జరిగిందంటే…
2024 నవంబర్ 20న అమెరికా సెక్యూరిటీలు-ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన ఆయన మేనల్లుడు సాగర్ అదానీలపై సివిల్ ఫిర్యాదు దాఖలు చేసింది. భారత ప్రభుత్వ అధికారులకు వందల మిలియన్ల డాలర్లను చెల్లించారని లేదా అందుకు హామీ ఇచ్చారని అందులో ఆరోపించింది. అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్ డాలర్లను సమీకరించే ఉద్దేశంతో అదానీ గ్రీన్ 2021 సెప్టెంబరులో బాండ్ ఆఫర్ చేయడంతో ఈ ఆరోపణలు వచ్చాయి. అదానీలకు సమన్లు జారీ చేయడానికి ఎస్ఈసీకి ఉన్న అధికారాన్ని ఈ ఏడాది జనవరిలో మోడీ ప్రభుత్వం సవాలు చేసింది. దీంతో దౌత్య ప్రయత్నాలకు స్వస్తి చెప్పి, అమెరికా రాయబార కార్యాలయం ద్వారా, ఈ మెయిల్ ద్వారా గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు సమన్లు పంపేందుకు అనుమతించాలంటూ ఫెడరల్ కోర్టును ఎస్ఈసీ ఆశ్రయించింది.



