– సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) రాష్ట్ర కన్వీనర్ల పిలుపు
– వికారాబాద్ జిల్లాలో సంతకాల సేకరణ, ర్యాలీ, సభ
– మార్చి 1 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు
నవతెలంగాణ-వికారాబాద్
కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకునే వరకు ఐక్యంగా పోరాడుదామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) రాష్ట్ర కన్వీనర్లు టి.సాగర్, పశ్య పద్మ, మండల వెంకన్న, జక్కుల వెంకటయ్య, పి.నాగిరెడ్డి పిలుపునిచ్చారు. విత్తన, విద్యుత్ తదితర రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఎస్‌కేఎం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ మండల పరిధిలోని సిద్ధులూరు, జైదుపల్లి, ధారూర్ మండలం కెరేల్లి గ్రామాల్లో రైతుల దగ్గర సంతకాలు సేకరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లా డుతూ భారతదేశం అమెరికాతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, విద్యుత్, విత్తన బిల్లును ఉపసంహరించాలని, వీబీజీఆర్‌ఏఎంజీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లు-2025 రైతులకు, గృహ వినియోగదారులకు విద్యుత్ రేట్లను పెంచుతుందన్నారు. పీక్ అవర్ ఛార్జీలు స్మార్ట్ మీటర్లను విధిస్తుందని తెలిపారు. బీజేపీ ఎన్నికల ప్రచారాల్లో హామీ ఇచ్చినట్టుగా స్మార్ట్ మీటర్లను అందరికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలు నిర్ణయించిన విధంగా గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే పాత ఉపాధి హామీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బహుళజాతి కంపెనీల విత్తనాలను దిగుమతి చేసుకోవడం, ఇష్టానుసారంగా వసూలు చేసే స్వేచ్ఛ, విత్తనాల బ్లాక్ మార్కెటింగ్ చేయడానికి అనుమతించే కొత్త విత్తన బిల్లును ఉపసంహరించాలని అన్నారు. మోడీ ప్రభుత్వం భారతదేశం సార్వభౌమత్వాన్ని, స్వావలంబనను అమెరికాకు అప్పగించిందని విమర్శించారు. వీటిన్నింటిపై మార్చి 1వ తేదీ నుంచి 20 వరకు అన్ని జిల్లాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పించి సంతకాలు సేకరించనున్నట్టు తెలిపారు. అలాగే, 385 రోజుల పాటు కొనసాగిన చారిత్రాత్మక రైతుల పోరాటం నేపథ్యంలో డిసెంబర్ 9, 2021 నాటి లేఖలో కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసిన అన్ని అంశాలపై పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. డబ్ల్యూటీవో, ఎంఎన్‌సీలు దేశీయ కార్పొరేట్ కంపెనీల ఒత్తిడితో హామీ ఇవ్వబడిన పంటల సేకరణ, పూర్తి రుణ మాఫీ, విద్యుత్ హక్కుతో అన్ని పంటలకు సీ2+50శాతం ఎంఎస్‌పీ కోసం చట్టాన్ని అమలు చేయడంపై మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒప్పందాన్ని అమలు చేయలేదని అన్నారు. వికారాబాద్ జిల్లాలో వ్యవసాయ, కూరగాయల మార్కెట్ యార్డుల్లో తాగునీరు, బాత్‌రూమ్‌లు, లైట్స్ తదితర కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వసతులు కల్పించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఎస్‌కేఎం జిల్లా నాయకులు ఆర్ మహిపాల్, వై.మహేందర్, సుదర్శన్, సత్యనారాయణ, వై.గీత, ప్రభులింగం, సురేష్, అనంతయ్య, ప్రవీణ్‌కుమార్, మల్లేష్, లక్ష్మి, వెంకటమ్మ వివిధ గ్రామాల రైతులు, కూలీలు, తదితరులు పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకునేవరకు పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



