Saturday, July 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చినుకు పడితే పెద్ద గుల్ల రోడ్డు చిత్తడే

చినుకు పడితే పెద్ద గుల్ల రోడ్డు చిత్తడే

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పెద్దగుల్ల గ్రామానికి వెళ్లే ఆర్‌ఎంబీ రోడ్డు ఇటీవల రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పూర్తిగా చిత్తడిగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు తెలిపారు. ఆరేళ్లుగా నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనుల వల్ల ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామస్తుల వివరాల ప్రకారం, రోడ్లు మరియు భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. పెద్ద ఏడ్గి గ్రామం నుంచి చిన్నగుల్ల మూలమలుపు వరకు రెండు వరుసల బీటీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసిన గుత్తేదారుడు, అక్కడి నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు నిధుల కొరతను సాకుగా చూపుతూ పనులను నిలిపివేశాడని ఆరోపించారు.

దీంతో పెద్దగుల్ల, గుల్లతాండ గ్రామాల ప్రజలు గత ఆరేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్డు మొత్తం బురదమయంగా మారి చిత్తడిగా మారుతుండటంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఆటో ట్రాలీలు రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందన్నారు. ఇప్పటికే పలువురు ప్రమాదాలకు గురైనప్పటికీ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు విమర్శించారు.

ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి చిన్నగుల్ల నుంచి గుల్లతాండ మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు సురక్షితమైన రాకపోకల సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -