బీజేపీ విధానాలపై యుద్ధానికి సిద్ధంకండి
కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు
డీసీసీ అధ్యక్షులే మన సైన్యం
పని చేయండి.. పదవులు అవే వస్తాయి…
పార్టీ నిర్మాణంపై దృష్టి సారించండి
వచ్చే రోజులన్నీ మనవేనంటూ దిశా నిర్దేశం
వికారాబాద్‌లో ముగిసిన శిక్షణా కార్యక్రమాలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి, హైదరాబాద్ బ్యూరో
ఇండో అమెరికా ట్రేడ్ డీల్ మనకు అత్యంత ప్రమాదకరమని పార్లమెంటులో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రధాని మోడీ చర్యలతో మనదేశంలో సైతం యుద్ధ వాతావరణం నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆయన పూర్తిగా దాసోహమయ్యారని ఎద్దేవా చేశారు. అందుకే మోడీ.. అమెరికాకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని పేర్కొన్నారు. ఇరాన్‌లో తలెత్తిన పరిస్థితులు ఇండియాలో రాకుండా చూసుకోవాలని ఆయన దేశ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై యుద్ధానికి సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో తొమ్మిది రోజులపాటు కొనసాగిన తెలంగాణ, ఏపీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల (డీసీసీలు) శిక్షణా తరగతులు సోమవారం ముగిశాయి.
ముగింపు కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతోపాటు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశాన్ని కూడా నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలపై డీసీసీలకు రాహుల్‌గాంధీ దిశా నిర్దేశం చేశారు. అంతర్జాతీయ, జాతీయ రాజకీయాల్లో నెలకొన్న పరిణామాల గురించి ఆయన వారితో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ అహింసా వాదాన్ని నమ్ముతూ రాజకీయాలు చేస్తుంటే.. బీజేపీ హింసావాదంతో ముందుకు సాగుతోందని విమర్శించారు. తాము గాంధేయ వాదాన్ని అనుసరిస్తే.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు గాడ్సే బాటలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చెప్పారు.
వాటన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. డీసీసీ అధ్యక్షులే తమ పార్టీకి అసలైన సైన్యమని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అందువల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వారి పాత్రను మరింత పెంచుతామని భరోసానిచ్చారు. ఏఐసీసీ దేశవ్యాప్త పిలుపులను నూటికి నూరుశాతం జయప్రదం చేయాలని సూచించారు. తెలంగాణ, ఏపీల్లోని సామాజికాంశాలపై అధ్యయనం చేయాలని అన్నారు. తెలంగాణలో పార్టీ, ప్రభుత్వం జోడెడ్లలాగా పని చేస్తున్నాయని కితాబిచ్చారు. సీనియర్ నేతలు, కార్యకర్తలు, నాయకులను కలుపుకుని ముందుకు పోవాలని రాహుల్ ఈ సందర్భంగా సూచించారు. అహాన్ని పక్కనపెట్టి పని చేయాలని హితవు పలికారు. ‘ఇగో’ల కంటే పార్టీ ముఖ్యమనే విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. ఒక్కో డీసీసీ అధ్యక్షుడు మరో పదిమంది క్రియాశీలక నాయకుల్ని తయారు చేయాలని దిశా నిర్దేశం చేశారు. పని చేస్తున్న వారిని గుర్తించి, ప్రోత్సహించాలని కోరారు.
మార్షల్ ఆర్ట్స్‌తో క్లాస్…
సమావేశంలో రాహుల్ గాంధీ మార్షల్ ఆర్ట్స్ చేస్తూ వినూత్నంగా సందేశమిచ్చారు. అందులోని మెళకువలను డీసీసీ అధ్యక్షులకు వివరించారు. మార్షల్ ఆర్ట్స్‌ను వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవాలని సూచించారు. జాతిపిత మహాత్మా గాంధీకి ఒంటిపై ఒక బట్ట తప్ప ఏమీ ఉండదని గుర్తు చేశారు. అంతటి నిరాడంబరుణ్ని బ్రిటీష్ వారు సైతం ఏమీ చేయలేకపోయారని పేర్కొన్నారు. ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజలతో మమేకమై పని చేయాలని పిలుపునిచ్చారు. కష్టించి పని చేయండి.. రానున్న రోజులన్నీ మనవేనంటూ భరోసానిచ్చారు.
కాంగ్రెస్ శివుడు.. బీజేపీ విష్ణువు…
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని శివుడితో పోల్చారు. తనలో సగభాగాన్ని భార్యకు ఇచ్చిన శివుడు, నిరాడంబరంగా ఉంటారని గుర్తు చేశారు. అదే రకంగా కాంగ్రెస్ పద్ధతి సాధారణంగా ఉంటుందని తెలిపారు. అందుకు భిన్నంగా బీజేపీ విష్ణువులాగా నగలు నట్రాతో ఆడంబరంగా, అత్యంత విలాసంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. వాటిని కాపాడుకోవటానికే ఆ పార్టీ ప్రజల మీద ఆయుధా(అధికారం)న్ని ప్రయోగిస్తోందని ఎద్దేవా చేశారు.
దేశం కోసం ప్రధాని అవుతా..
కాగా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని కావాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆయన తాత నెహ్రూ, నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ ప్రధాని పదవిని చేపట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని గుర్తు చేశారు. అదే తరహాలో ఇప్పుడు దేశాన్ని రక్షించేందుకు, విపత్కర పరిస్థితులనుంచి బయటపడేసేందుకు రాహుల్ గాంధీ కూడా పీఎం పదవిని చేపట్టాలని కోరారు. తాను ఓ ముఖ్యమంత్రిగా ఈ విజ్ఞప్తి చేయటం లేదని.. సాధారణ కాంగ్రెస్ కార్యకర్తగా అభ్యర్థిస్తున్నానని తెలిపారు. స్పందించిన రాహుల్ గాంధీ మోడీపై యుద్ధం చేసేందుకు ప్రధాని పదవిని చేపడతానని వ్యాఖ్యానించారు.



