నవతెలంగాణ – హైదరాబాద్ : ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ముఖ్యంగా తూర్పు శివారు ప్రాంతాల్లో గత 48 గంటల్లో ఏకంగా 380 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం అప్రమత్తమై హై అలర్ట్ ప్రకటించింది.
నగరంలో 300 మి.మీ., పశ్చిమ శివార్లలో 345 మి.మీ. వర్షపాతం నమోదైంది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. భారత వాతావరణ శాఖ జులై 4 నుంచి 6 వరకు గతంలో జారీ చేసిన ‘రెడ్ అలర్ట్’ను మంగళవారం నాటికి ‘ఆరెంజ్ అలర్ట్’గా సవరించింది. అయినప్పటికీ, నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.



