Wednesday, July 8, 2026
E-PAPER
Homeఖమ్మంఓటరు సమగ్ర సవరణకు రాజకీయ పార్టీలు సహకరించాలి: తహశీల్దార్

ఓటరు సమగ్ర సవరణకు రాజకీయ పార్టీలు సహకరించాలి: తహశీల్దార్

- Advertisement -

– ఎస్ఐఆర్ గడువు పెంచాలని రాజకీయ పార్టీల విజ్ఞప్తి
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఓటరు సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను విజయవంతం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అశ్వారావుపేట తహశీల్దార్ దాసరి కిశోర్ కుమార్ కోరారు.  బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ కార్యాచరణను వేగవంతం చేసే అంశంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ, అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో పలువురు ఓటర్లు ఒక వార్డులో ఓటు నమోదు చేసుకుని, మరో వార్డులో నివాసం ఉంటున్నందున ఓటరు జాబితాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. దీంతో బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటి ఎన్యూమరేషన్ నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

రాజకీయ పార్టీలు నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) బీఎల్ఓలతో సమన్వయంగా పనిచేస్తే ఓటరు వివరాల సేకరణ మరింత సులభంగా, పారదర్శకంగా పూర్తవుతుందని ఆయన సూచించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ప్రస్తుతం నిర్దేశించిన గడువు సరిపోవడం లేదని, మరింత సమయం పొడిగించాలని కోరారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే రాజకీయ పార్టీల నుంచి విజ్ఞప్తులు వెళ్లాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్ సయ్యద్ హుస్సేన్, సీపీఐ(ఎం), కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు చిరంజీవి, తుమ్మ రాంబాబు, యూ.ఎస్. ప్రకాశ్‌ రావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -