నవతెలంగాణ-హైదరాబాద్ : నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఉస్మానియా విశ్వవిద్యాలయం మెయిన్ లైబ్రరీని సందర్శించి నిరుద్యోగ యువతతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిరుద్యోగుల సమస్యలను తెలుసుకుని, నిరుద్యోగుల వినతిపత్రాన్ని తీసుకున్నారు.
ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ..’దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 60 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, 2014లో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తవుతున్నా ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు.
ఉద్యోగాలు ఇవ్వలేని పాలకులు యువతకు సమాధానం చెప్పాల్సింది పోయి, “పకోడీలు, బజ్జీలు వేయడం కూడా ఉద్యోగమే” అని వ్యాఖ్యానించడం అత్యంత బాధ్యతారాహిత్యమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులు కూడా ఇదే ధోరణిని కొనసాగించడం దేశ యువత ఆకాంక్షలను అవమానించడమేనని పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు.
బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఖాళీలు ఉన్నప్పటికీ నియామకాలను ఎందుకు చేపట్టడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రకటించనున్న 7 వేల పోలీసు పోస్టులు సరిపోవని, కనీసం 20 వేల పోస్టులతో పోలీసు నియామక నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, జూనియర్ లెక్చరర్ (JL), డిగ్రీ లెక్చరర్ (DL), డీఎస్సీతో పాటు అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వం ప్రకటిస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేసి, దానికి అనుగుణంగా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత తీవ్ర ఆందోళనకు గురవుతోందని, భవిష్యత్తుపై భరోసా కోల్పోతోందని అన్నారు.
ఈ ప్రభుత్వ హయాంలో కూడా 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత విషాదకరమని, దీనిపై ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే టీజీపీఎస్సీ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్‌లో సుమారు 30 లక్షలకు పైగా నిరుద్యోగులు నమోదు చేసుకున్నారని, వారికి స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేసి, స్థానిక యువతకు ప్రాధాన్యం కల్పిస్తూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
వేలాది మంది విద్యార్థులు, యువత త్యాగాలు, నిరుద్యోగుల ఆత్మబలిదానాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆ త్యాగాలను ప్రభుత్వం మరవకూడదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 16 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేయగా, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లతో కలిపి మొత్తం 62 వేల ఉద్యోగాలే భర్తీ అయ్యాయని అన్నారు.
లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటూ, హాస్టళ్లలో ఉంటూ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఆశలను ప్రభుత్వం వమ్ము చేస్తోందని విమర్శించారు.
జూలై 15న సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే రాష్ట్రస్థాయి నిరుద్యోగ ధర్నాలో నిరుద్యోగ యువత, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు తమ సమస్యలు, ఉద్యోగ నియామకాలపై ఉన్న ఆందోళనలను వివరిస్తూ జాన్ వెస్లీకి వినతిపత్రాన్ని అందజేశారు.
రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి : జాన్ వెస్లీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


