నవతెలంగాణ-హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు, డిజైన్ మార్పులపై తాను మాట్లాడడం లేదని, కానీ మొత్తం ప్రాజెక్టునే తప్పుపట్టడం సరికాదని కాంగ్రెస్ నేతలపై ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ప్రాజెక్టు పరిధిలోని దెబ్బతిన్న నిర్మాణాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, లేకపోతే రాష్ట్రం తీవ్ర కరవును ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సాగునీటి నిర్వహణ, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.ప్రజల ప్రయోజనాల విషయంలో తనకు తెలంగాణే మొదటి ప్రాధాన్యమని, ఆ తర్వాతే పార్టీ, వ్యక్తిగత అంశాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తాను ఎవరో చెప్పినట్లు మాట్లాడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.
ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి నీరు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఈటల ఆరోపించారు. వర్షాకాలంలోనూ సాగునీరు అందక రైతులు కష్టాలు పడుతున్నారని, ముఖ్యంగా ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వల కింద బోర్లు, బావులు లేకుండా వ్యవసాయం చేయడం సాధ్యం కాదని చెప్పారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, ఆత్మగౌరవం కోసమే జరిగిందని ఈటల గుర్తుచేశారు.


