Friday, July 10, 2026
E-PAPER
Homeజాతీయంజవాబుదారీతనమేది?

జవాబుదారీతనమేది?

- Advertisement -

రామమందిరం నుంచి నీట్‌ వరకు కనిపించని బాధ్యత
దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ప్రశ్నలు.. ఆత్మరక్ష‍ణలో బీజేపీ
అయోధ్య వివాదం, నీట్‌ లీక్‌, మధ్యప్రదేశ్‌ ‌
భూకుంభకోణం వ్యవహారంతో మోడీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి
కొందరిని అరెస్టు చేస్తే సరిపోదు..
రాజకీయ, నైతిక బాధ్యతను కేంద్రం, సంఘ్‌ ‌స్వీకరించాలి
ఈ అంశాలపై మీడియా ఒత్తిడి కొనసాగించాలి
అలా అయితేనే పూర్తి నిజాలు వెలుగులోకి : మేధావులు, విశ్లేషకులు

న్యూఢిల్లీ : నీట్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌ వివాదం, అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం, మధ్యప్రదేశ్‌‌లోని భూకుంభకోణం వ్యవహారం కేంద్రం, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలను వెంటాడుతున్నాయి. ఈ అంశాల్లో ‘జవాబుదారీతనం ఏది?’ అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతిపై రాజీపడబోమని అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు అదే అంశంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బీజేపీ రాజకీయ ఎదుగుదలకు కీలకంగా మారిన అయోధ్యలోని రామ మందిరంలోనే విరాళాల అవకతవకలు బయటపడడం అటు మోడీ సర్కారుకు, ఇటు యోగి ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు.

​అవినీతిపై రాజీపడబోమంటూనే…
2014లో ప్రధాని మోడీ ‘నా ఖావూంగా.. నా ఖానే దూంగా’ అంటూ అవినీతిపై రాజీ ఉండదని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఇప్పుడు ప్రభుత్వానికే శల్య పరీక్షగా మారింది. అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం వెలుగులోకి రావడంతో ఆ హామీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయోధ్య వివాదానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యం పూర్తిగా భిన్నం. ఎందుకంటే.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ ప్రయాణానికి ప్రతీకగా నిలిచిన ఆలయంలోనే ఈ ఘటన జరగడంతో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఏర్పడింది. విరాళాలు స్వీకరించే బాధ్యతలో ఉన్న కొందరు నగదును క్రమంగా అపహరించారని, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ విషయం బయటపడిందని ఆరోపణలు ఉన్నాయి. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ ‌కూడా తన మధ్యంతర నివేదికలో ఇవే విషయాలను వెల్లడించింది. అయితే అందుబాటులో ఉన్న సీసీటీవీ రికార్డులు కేవలం 45 రోజులకే పరిమితం కావడంతో అంతకుముందు ఎంత మొత్తంలో దుర్వినియోగం జరిగిందో అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. అవకాశం దొరికినప్పుడల్లా చేతివాటం ప్రదర్శించి నగదు తీసుకున్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడి కాగా.. మొత్తం నష్టం ఎంతన్నది మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. ఇప్పటి వరకు బయటపడింది ‘మంచుకొండలో కనిపించే చిన్న భాగం మాత్రమే’ అని మాజీ ఐపీఎస్‌ అధికారి విభూతి నారాయణ్‌ ‌రాయ్‌ అన్నారు. విరాళాల దుర్వినియోగం సీసీటీవీ ఏర్పాటైన తర్వాతే ప్రారంభమైందని భావించడానికి ఆధారాలు లేవనీ, అసలు వ్యవహారం మరింత విస్తృతంగా ఉండే అవకాశం ఉందని భక్తులు సైతం అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

​బీజేపీ, సంఘ్‌‌లు బాధ్యత వహించాలి
యూపీ ప్రభుత్వం సిట్‌‌ను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించినప్పటికీ.. కొందరిని అరెస్టు చేయడం, ట్రస్టు సభ్యుల రాజీనామాలు కోరడం మాత్రమే సరిపోదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయోధ్యలో రామ మందిర విషయాన్ని ఎన్నికల్లో గొప్పగా ప్రచారం చేసుకొని లబ్ది పొందినందున కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బీజేపీ సర్కారు, సంఘ్‌ రాజకీయ, నైతిక బాధ్యతను స్వీకరించాలనే డిమాండ్‌‌లు వెల్లువెత్తుతున్నాయి. అవినీతిని అరికట్టడంలో తాము ప్రత్యేకమనీ, ఇతర పార్టీలకు భిన్నంగా వ్యవహరిస్తామని చెప్పుకునే మోడీ ప్రభుత్వం.. ఇప్పుడు అదే సమస్యలో మౌనం పాటించడంపై ప్రశ్నలు ఎదురవుతు న్నాయి. ఈ పరిణామం సాధారణ ప్రజలతో పాటు బీజేపీ కార్యకర్తలు, భక్తులలో సైతం అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నది. రామ మందిరాన్ని తమ విజయంగా చెప్పుకునే ఆర్‌ఎస్‌ఎస్‌.. అదే సంస్థలో వైఫల్యాలు బయటపడినప్పుడు బాధ్యత నుంచి తప్పించుకోకూడదని సీనియర్‌ ‌జర్నలిస్ట్‌ ‌రాజ్‌‌దీప్‌ ‌సర్దేశాయ్‌ అన్నారు. రామజన్మ భూమి అంశం సిద్ధాంతపరంగా ఆర్‌ఎస్‌ఎస్‌‌కు బలాన్ని అందించగా, ఎన్నికల్లో విజయంతో బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడిందనీ, కాబట్టి ఈ వివాదంలోనూ బాధ్యతను స్వీకరించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.

​మీడియా నిజాలు వెలికి తీయాలి
ఈ ఘటనలో మీడియా పాత్ర కూడా అత్యంత కీలక మని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి భయా లు, ప్రలోభాలకు లొంగకుండా నిజాలు వెలికి తీసే ప్రయ త్నాన్ని మీడియా కొనసాగించాలని వారు సూచిస్తున్నారు. ఇతర పార్టీలతో పోల్చకుంటే బీజేపీ ‘భిన్నమైంది’ అని చెప్పుకునే కాషాయ పార్టీ నేతలకు అయోధ్య వ్యవహారం మింగుడుపడనీయడం లేదంటున్నారు. అవినీతి అనేది కేవలం నీతిబోధలతో ఆగిపోదనీ, అధికారం ఎవరినైనా ప్రభావితం చేయగలదని విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్మించిన వ్యవస్థలోనే ఈ ఆరోపణలు రావడం ‘రామరాజ్యం’ అనే నైతిక వాదనను బలహీనపరుస్తోందని అంటున్నారు. ​

​‘నీట్‌’పై ఉదాసీన వైఖరి
ప్రతిష్టాత్మక నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీ కూడా బీజేపీ వైఫల్యాన్ని బహిర్గతం చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా కోరుతూ నిరసనలు తీవ్రమయ్యాయి. ఢిల్లీలోని జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో ఆందోళనలు సాగుతు న్నాయి. ఇటు ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్‌‌చుక్‌ ‌కూడా సీజేపీ ఆందోళనలకు సంఘీభావంగా నిరాహార దీక్ష‍కు దిగారు. వీరి పోరాటానికి విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి తీవ్ర మద్దతు లభిస్తోంది. అయితే మోడీ ప్రభుత్వం మాత్రం ధర్మేంద్ర ప్రధాన్‌‌ను మాత్రం మంత్రి పదవి నుంచి తొలగించకపోవటం కేంద్రం ఉదాసీన వైఖరికి అద్దం పడుతోంది.

​మధ్యప్రదేశ్‌ ‌సీఎంపై చర్యలేవి?
ఇటు మధ్యప్రదేశ్‌‌లోని బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ ‌సర్కారు పాలనలోనూ అవినీతి ఆరోపణలు కాషాయపార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. సాక్ష‍ాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ కుటుంబానికి సంబంధించిన భూముల వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసింది. ఉజ్జయినిలో పట్టణాభివృద్ధి ప్రణాళికల నేపథ్యంలో ఆయన కుటుంబం 168 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, ప్రభుత్వ భూ వినియోగ మార్పుల వల్ల లాభపడిందని ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి మీడియా కథనాలు కూడా వచ్చాయి. ఇంత జరిగినప్పటికీ.. ముఖ్యమంత్రి మోహన్‌‌యాదవ్‌‌పై బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -