Friday, July 10, 2026
E-PAPER
Homeజాతీయంగ్రామీణఆర్థిక వ్యవస్థకు దెబ్బ

గ్రామీణఆర్థిక వ్యవస్థకు దెబ్బ

- Advertisement -

వర్షాభావంతో డిమాండ్‌‌పై ప్రభావం
వ్యవసాయం, వాహన రంగాలకు ప్రతికూలత:ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ హెచ్చరిక

ముంబయి : ప్రస్తుత ఏడాదిలో నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉంటే దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ హెచ్చరించింది. తక్కువ వర్షపాతం కారణంగా పంట దిగుబడులు తగ్గి రైతుల ఆదాయం క్షీణించడంతో పాటు ఆహార ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్ మందగించి, వ్యవసాయం, వ్యవసాయ రసాయనాలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, మైక్రోఫైనాన్స్ రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఎస్‌అండ్‌‌పీ నివేదిక వెల్లడించింది. మరోవైపు భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ఎరువులు, ఇతర వ్యవసాయ ముడి సరుకుల ధరలు పెరగడం రైతులపై అదనపు భారంగా మారుతుందని తెలిపింది. గడిచిన జూన్ నెలలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే దాదాపు 40 శాతం తక్కువ వర్షపాతం నమోదవగా.. జులైలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. ఫలితంగా వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ వంటి ఖరీఫ్ పంటల సాగు గణనీయంగా తగ్గింది. రైతుల ఆదాయం క్షీణిస్తే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ ‌పడిపోనుందని ఎస్‌అండ్‌‌పి నివేదిక పేర్కొంది. కాగా.. వ్యవసాయేతర రంగాల్లో వృద్ధి కొనసాగు తుండటం, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం వల్ల విస్తృత స్థాయిలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం లేదని ఎస్‌అండ్‌పి పేర్కొంది.

జల విద్యుత్‌‌ తగ్గొచ్చు..
వర్షాభావం కొనసాగితే జలవిద్యుత్ ఉత్పత్తి 10-15 శాతం వరకు తగ్గే అవకాశం ఉండటంతో పాటు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపైనా ఒత్తిడి పెరుగుతుందని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. బలహీన రుతుపవనాల ప్రభావం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా బ్యాంకింగ్, ఆర్థిక రంగాలపై కూడా పడే అవకాశముందని హెచ్చరించింది. రైతుల ఆదాయం తగ్గడం వల్ల రుణాల చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తి బ్యాంకుల ఆస్తుల నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా గ్రామీణ రుణగ్రహీతలపై అధికంగా ఆధారపడే మైక్రోఫైనాన్స్ సంస్థలు ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని పేర్కొంది. బ్యాంక్‌‌ల రుణాల వృద్ధి మందగించడంతో పాటు నిరర్ధక ఆస్తులు పెరిగే అవకాశం ఉంది. గ్రామీణ రుణగ్రహీతలపై ఎక్కువగా ఆధారపడే మైక్రోఫైనాన్స్ సంస్థలు అధిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముందని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -