నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి కె. వెంకట్రామ్ రెడ్డి కుమారుడు భరత్ రాజ్ రెడ్డి డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణను ఎదుర్కొన్నాడు. పరీక్షల్లో అతడు గంజాయి సేవించినట్లు తేలిందని పోలీసులు పేర్కొంటుండగా, ఈ వార్తలను అతడి తండ్రి వెంకట్రామ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. డ్రగ్స్ సరఫరాదారుల కాంటాక్ట్ లిస్టులో భరత్ రాజ్ పేరు ఉండటంతో మంగళహాట్ పోలీసులు జూలై 16న అతడిని విచారణకు పిలిచారు. విచారణలో భాగంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతడు గంజాయి సేవించినట్లు నిర్ధారణ అయిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) యాక్ట్‌లోని సెక్షన్ 27(బి) కింద వినియోగదారుడిగా పరిగణిస్తూ అతడికి నోటీసులు జారీ చేశారు. తాను స్వచ్ఛందంగా డ్రగ్స్ పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతానని భరత్ రాజ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే, ఈ ఆరోపణలను ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి పూర్తిగా తోసిపుచ్చారు. తన కుమారుడిని అరెస్ట్ చేశారని, అతను డ్రగ్స్ తీసుకున్నాడని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పోలీసులు కేవలం ప్రాథమిక విచారణలో భాగంగా వివరాలు సేకరించారని, ఎటువంటి ఆధారాలు లభించలేదని ఆయన పేర్కొన్నారు.



