నవతెలంగాణ – దర్పల్లి
ఈ నెల 11న సీతయ్యపేట గుడి తండాకి చెందిన జరుపుల కాంతమణి అనే మహిళ శవం అనుమానాస్పద స్థితిలో ధర్పల్లి గ్రామం బస్టాండ్ వెనుకాల ఓపెన్ ప్లాట్స్ వద్ద కనిపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం నిందితున్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 13న నిందితుడు గుండ్ల నడుకుడ నర్సయ్య (58) కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఉన్నట్లు తెలిసి, గాలించి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.
విచారణలో నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యమ్మ రైస్ మిల్ సమీపంలో ఉన్న అతని ఓపెన్ ప్లాట్లో తనకు చిన్న రేకుల షెడ్ ఉండి, అక్కడ కూరగాయలు పెంచుకుంటూ కట్టెలతో కంచె వేసుకొని ఉపయోగించుకుంటున్నట్లు తెలిపాడు. సీతయ్యపేట గ్రామం గుడి తండా కి చెందిన కాంతమణితో తనకు పరిచయం ఉండి, ఆమె అప్పుడప్పుడు తన షెడ్ వద్దకు వచ్చేదని తెలిపాడు.
ఈ క్రమంలో ఈ నెల 11న కాంతమణి తన షెడ్ వద్దకు వచ్చినప్పుడు ఇద్దరి మధ్య శారీరక సంబంధం జరిగిన తరువాత, తనను రూ.300/- ఇవ్వాలని అడిగిందని తెలిపారు. నేను నా దగ్గర ఇప్పడు డబ్బులు లేవని చెబితే.. ఈ విషయం గ్రామంలో అందరికీ చెబుతానని బెదిరించడంతో, తన పరువు పోతుందనే భయంతో నిందితుడు ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
అతను చేపల వలకు ఉపయోగించే తెల్లని నైలాన్ తాడు ఆమె మెడకు గట్టిగా చుట్టి గుంజి పట్టుకొని ఆమెను హత్య చేసినట్లు విచారణలో వెల్లడించాడు. ఆమె మృతి చెందిన తరువాత ఎవరికి అనుమానం రాకుండా ముందుగా తన షెడ్ మరియు చెక్క గేటుకు తాళం వేసి మార్కెట్కు వెళ్లి చేపలు కట్ చేసే పని చేసి, రాత్రి తిరిగి వచ్చి మృతదేహాన్ని ఎర్రని వస్త్రంలో చుట్టి ప్లాస్టిక్ సంచిలో పెట్టి తన టీవీఎస్ ఎక్సెల్ వాహనానికి కట్టి బయటకు తీసుకెళ్లాడు.
దమ్మనపేట ఎక్స్ రోడ్ వద్ద డ్రైనేజీ పనుల కారణంగా రోడ్డు బ్లాక్ కావడంతో, కొత్త బస్టాండ్ వెనుక వైపు ప్లాట్ల మధ్యగా వెళ్తుండగా అతని టీవీఎస్ ఎక్సెల్ వాహనం స్కిడ్ అయి పడిపోవడంతో, ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో వాహనాన్ని మరియు మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయినట్లు తెలిపాడు. తరువాత పోలీసులు కొత్త బస్టాండ్ ప్రాంతంలో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా, అతను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అందువల్ల నిందితుడిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరు పరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు.



