– కలెక్టరేట్ ముందు గిరిజన సంఘం ధర్నా
నవతెలంగాణ – కామారెడ్డి
రాజంపేట మండలం షేర్ శంకర్ తండాలో పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోతిరాం నాయక్ మాట్లాడుతూ.. షేర్ శంకర్ తండాలో ఫారెస్ట్ అధికారులు జేసీబీలు, ట్రాక్టర్లతో గిరిజనులు సాగు చేస్తున్న పంటలను ధ్వంసం చేశారని ఆరోపించారు.
30–40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను అన్యాయంగా గిరిజనుల నుంచి లాక్కోవడం దుర్మార్గమని అన్నారు. ఆ భూమిలో ప్రస్తుతం 20 కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నాయని, సర్వే పూర్తయినప్పటికీ ఫారెస్ట్ అధికారుల అభ్యంతరాల వల్ల హక్కు పాసు పుస్తకాల జారీ నిలిచిపోయిందని తెలిపారు. సంబంధిత భూములు ఇప్పటికీ సాగుదారుల పేర్లతో ఆన్‌లైన్‌లో నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం గిరిజనులపై దాడులు చేస్తూ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన, అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించి గిరిజనుల సాగుభూములను వారికి అప్పగించాలని కోరారు. 2005కు ముందు నుంచే గిరిజనుల అధీనంలో ఉన్న ఈ భూములకు అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు పత్రాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షులు బన్సీ నాయక్, కిషన్ నాయక్, గోవర్ధన్ నాయక్, సరోజ, పులి విట్టల్, నవీన్, లాల్యతో పాటు పోడు భూముల సాగుదారులు పాల్గొన్నారు.



